దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష
లాటరీ పద్ధతిలో ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి
సంక్షేమ పథకాలు అమలవుతున్నా ప్రభుత్వంపై అసంతృప్తి
గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలివ్వాలి : అసెంబ్లీలో కూనంనేని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దేశంలో గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. బుధవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై ఆయన మాట్లాడుతూ తమిళనాడు, కేరళలో గవర్నర్లు కొత్త సమస్యలను సృషిస్తున్నారని చెప్పారు. ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రం బయటపడాలని అన్నారు. సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నా ప్రజల్లో అసంతృప్తి ఉందన్నారు. దాన్ని పోగొట్టేందుకు ఆలోచించాలని సూచించారు. 12 ఏండ్లలో కేంద్రం తెలంగాణకు రూ.13 లక్షల కోట్లు ఇచ్చిందంటూ బీజేపీ నాయకులు చెప్తున్నారని అన్నారు. ఇక్కడి నుంచి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు.
భారత్‌లో తెలంగాణ భాగం కాదా?, అనాథలా వదిలేస్తారా?అని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతున్నదని విమర్శించారు. అప్పుల నుంచి గట్టెక్కేలా కేంద్రం సహాయం చేయాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో రాజకీయ జోక్యం ఉండొద్దని అన్నారు. లాటరీ పద్ధతిలో ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, వాటిని భర్తీ చేయాలని కోరారు. విద్యాకమిషన్ నివేదికను యథాతధంగా అమలు చేయొద్దని సూచించారు. మంచి విషయాలను తీసుకోవాలనీ, ఇతర అంశాలను సమీక్షించాలని కోరారు. మూసీ ప్రక్షాళనలో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
58,59 జీవోల ప్రకారం గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఇండ్లు నిర్మించాలని ఇవ్వాలని సూచించారు. బీఆర్‌ఎస్ ఓటమిలో ధరణి పాత్ర ఉందన్నారు. తొమ్మిది లక్షల సాదాబైనామాలను పరిష్కరించాలని చెప్పారు. రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్లు రాక బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఉద్యోగులకు పెండింగ్ డీఏలను విడుదల చేయాలనీ, పీఆర్సీని ప్రకటించాలని అన్నారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. కాంట్రాక్టు కార్మికులకు 21 జీవో ప్రకారం కనీస వేతనం రూ.23 వేలు ఇవ్వాలని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



