Saturday, March 21, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలునిరాశ పర్చిన బడ్జెట్‌

నిరాశ పర్చిన బడ్జెట్‌

- Advertisement -

ఆరు గ్యారంటీలకు ఘోరీ కట్టిన ప్రభుత్వం : మాజీమంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ ప్రజలను తీవ్రంగా నిరాశ పరిచిందని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌రావు విమర్శించారు. 2026-27 బడ్జెట్‌పై అసెంబ్లీ మీడియా హాల్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరు గ్యారంటీలకు రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా ఘోరీ కట్టిందని విమర్శించారు. 20 పేజీలు పెంచారు, రూ.20 వేల కోట్ల బడ్జెట్‌ పెంచారు తప్ప ఆరు గ్యారంటీల ప్రస్తావన గానీ, నిధుల కేటాయింపు గానీ చేయలేకపోయారని తెలిపారు. కాగితాల మీద అంకెలు ఉన్నాయి తప్ప, ప్రజల కష్టాలు తీర్చడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ డిక్లరేషన్లు ఓట్ల కోసమే తప్ప ఆ వర్గాల అభివృద్ధి కోసం కాదని బడ్జెట్‌ నిరూపించిందని చెప్పారు.

గత బడ్జెట్‌లో చెప్పిన పథకాలు అమలు చేయలేదనీ, ఈసారి అవే పెట్టారని గుర్తు చేశారు. పోయిన బడ్జెట్‌లో రాజీవ్‌ యువ వికాసం కోసం రూ.ఆరు వేల కోట్లు కేటాయించారనీ, ఈసారి కూడా అవే నిధులు కేటాయించారని వివరించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలోనూ అదే జరిగిందని అన్నారు. ఒక్క రూపాయి ఇవ్వలేదనీ, పైసా ఖర్చు చేయలేదని చెప్పారు. అంకెల గారడీ తప్ప కేటాయింపుల విషయంలో, ఖర్చు విషయంలో చిత్తశుద్ధి లేదని అన్నారు. ఇందిరమ్మ, రాజీవ్‌ గాంధీ పేరు చెప్పి వారి ఆత్మ క్షోభించేలా చేస్తున్నారని చెప్పారు. రెండు పంటలకు బోనస్‌ ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు. ఇది దగాకోరు బడ్జెట్‌ అనీ, అన్ని వర్గాల ప్రజలనూ నిరాశ పర్చిందని అన్నారు.

రైతుబీమాకు కాంగ్రెస్‌ రాంరాం : నిరంజన్‌రెడ్డి
రైతుబీమాకు కాంగ్రెస్‌ ప్రభుత్వం రాంరాం పలికిందని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రైతుబీమాకు ప్రత్యామ్నాయంగా 1.15 కోట్ల కుటుంబాలకు రూ.ఐదు లక్షల జీవిత భీమా అని ప్రకటన చేసిందని గుర్తు చేశారు. రేషన్‌ కార్డు ఉన్న కుటుంబాలకు మాత్రమే అని స్పష్టం చేసిందని పేర్కొన్నారు. రైతుబీమా ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్‌ నాటకమని తెలిపారు.

ఉద్యోగులను నిరాశపర్చిన బడ్జెట్‌ : దేవీప్రసాద్‌
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఉద్యోగులను నిరాశ పర్చిందని ఉద్యోగ సంఘాల మాజీ చైర్మెన్‌ జి దేవీప్రసాద్‌ తెలిపారు. పీఆర్సీ కోసం గత రెండేండ్లుగా ఎదురు చూస్తున్న ఉద్యోగులకు పీఆర్సీ ప్రస్తావన లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఐదు డీఏలు పెండింగ్‌లోనే ఉన్నాయని వివరించారు. రిటైర్‌ అయిన ఉద్యోగులకు రావాల్సిన పెన్షన్‌ ప్రయోజనాలు అందక 80 మంది మానసిక వేదనతో మరణించినా ప్రభుత్వం స్పందించకపోవడం అమానవీయమని తెలిపారు. పీఆర్సీ, డీఏలు, రిటైర్‌మెంట్‌ బకాయిలు ఎప్పడు విడుదలవుతాయో తెలియని పరిస్థితి ఉందని పేర్కొన్నారు.

బీసీలను మోసం చేసిన కాంగ్రెస్‌ : కిశోర్‌గౌడ్‌
బడ్జెట్‌ కేటాయింపుల్లో బీసీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు, బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు కె కిశోర్‌గౌడ్‌ విమర్శించారు. ఒకవైపు 42శాతం రాజకీయ రిజర్వేషన్ల విషయంలో మరోవైపు బడ్జెట్‌ కేటాయింపుల్లోనూ బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను ఓసారి చదవాలని సూచించారు. ఇది సంక్షేమ బడ్జెట్‌ కాదనీ, ప్రభుత్వ పెద్దల కమీషన్ల బడ్జెట్‌ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -