నిరాశాజనకంగా బడ్జెట్‌

– బుడ్డర్‌ఖాన్‌లా మాట్లాడుతున్న సీఎం రేవంత్‌
 – బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌
– సికింద్రాబాద్‌లో బీఆర్‌ఎస్‌ సనత్‌నగర్‌ కార్యకర్తల సమావేశం
నవతెలంగాణ-బేగంపేట
తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నిరాశాజనకంగా ఉందని ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం బుడ్డర్‌ఖాన్‌లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్‌లోని ఎస్‌వీఐటీ మహబూబ్‌ కాలేజ్‌లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధ్యక్షతన నిర్వహించిన బీఆర్‌ఎస్‌ సనత్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు రూ.1.25 లక్షల కోట్లు అవసరమవుతాయని, కానీ బడ్జెట్‌లో రూ.53 వేల కోట్ల మాత్రమే కేటాయించారని తెలిపారు. 200 యూనిట్లకు ఉచిత విద్యుత్‌ ఇవ్వకపోతే పెద్దఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ జల హక్కులను కృష్ణాబోర్డుకు అప్పగించడాన్ని నిరసిస్తూ ఈనెల 13న నల్లగొండలో పెద్దఎత్తున సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే వారి జీవితకాలం సమయం కూడా సరిపోదన్నారు. 100 రోజుల్లో హామీలను అమలు చేయకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. హైదరాబాద్‌ నగరం మాజీ మంత్రి కేటీఆర్‌ నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. అందుకే ఇక్కడి ప్రజలు అన్ని అసెంబ్లీ స్థానాలలో బీఆర్‌ఎస్‌ను గెలిపించారని చెప్పారు. తన గెలుపు కోసం ఎంతో కృషి చేసిన నియోజకవర్గ ప్రజలకు ఏ అవసరమొచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సమావేశంలో సికింద్రాబాద్‌ ఎమ్మెల్యేలు పద్మారావుగౌడ్‌, మాగంటి గోపినాద్‌, దానం నాగేందర్‌, ముఠా గోపాల్‌, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ హౌంమంత్రి మహమూద్‌ అలీ, కార్పొ రేటర్‌లు కొలను లక్ష్మి, టి.మహేశ్వరి, కుర్మ హేమలత, బీఆర్‌ఎస్‌ సికింద్రాబాద్‌ పార్ల మెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తలసాని సాయికిరణ్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

Spread the love