Thursday, July 30, 2026
E-PAPER
Homeజాతీయంతమిళనాడు ప్రభుత్వ కీలక నిర్ణయం..

తమిళనాడు ప్రభుత్వ కీలక నిర్ణయం..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : వైద్య ఆరోగ్య రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించే దిశగా తమిళనాడు ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో నూతన ఆసుపత్రుల ఏర్పాటుకు అవసరమైన అనుమతుల కోసం ‘సింగిల్ విండో క్లియరెన్స్’ (ఏకగవాక్ష) విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీనివల్ల ఏళ్ల తరబడి వివిధ ప్రభుత్వ శాఖల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, అనుమతుల ప్రక్రియ కేవలం కొన్ని నెలల్లోనే పూర్తి కానుంది.

ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ శుక్రవారం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశం అనంతరం దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు (జీవో) జారీ అయ్యే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో పారిశ్రామికంగా పురోగతి సాధిస్తున్న మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల సరసన తమిళనాడు కూడా నిలవనుంది.

ప్రస్తుత విధానంలో ఆసుపత్రి భవనాలు, ప్రాజెక్ట్ డిజైన్లకు అనుమతులు లభించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని, కొన్ని సందర్భాల్లో రూ. 40-50 లక్షల వరకు లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ జాప్యం కారణంగా సుమారు 7-8 మంది వైద్యులు తలపెట్టిన ఆసుపత్రి ప్రాజెక్టులు ప్రస్తుతం పెండింగ్‌లో పడిపోయాయి.

కొత్త సింగిల్ విండో విధానంతో పారదర్శకమైన, నిర్దిష్టమైన ఫీజుల విధానం అమల్లోకి రానుంది. దీనివల్ల అవకతవకలకు అడ్డుకట్ట పడుతుందని, అనుమతుల ప్రక్రియ వేగవంతమై వైద్య రంగంలో పెట్టుబడులు పెరుగుతాయని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ద కాలంగా పరిశ్రమ వర్గాల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -