4 తులాల బంగారం, నగదు అపహరణ
నవతెలంగాణ – కామారెడ్డి, మాచారెడ్డి
మాచారెడ్డి మండలం ఈశాయిపేట గ్రామంలో గురువారం రాత్రి ఓ ఇంట్లో చోరీ జరిగిందిని మాచారెడ్డి పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన పుల్లి లలిత (భర్త: భూమయ్య) ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆమె కుమారుడు మెహర్ ప్రసాద్ హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలను ఇంట్లోని బీరువాలో భద్రపరిచి ఉంచాడు.
ఈ నెల 27న మధ్యాహ్నం ఆరోగ్యం బాగాలేక ఇంటికి తాళం వేసి సిరిసిల్లలోని తన కుమార్తె ఇంటికి వెళ్లిన లలితకు, 30న ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయని స్థానికులు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే ఇంటికి చేరుకుని పరిశీలించగా, ప్రధాన తలుపు తాళంతో పాటు బీరువా తాళాలు పగులగొట్టి, అందులో ఉన్న సుమారు 4 తులాల బంగారు ఆభరణాలు, రూ.5,000 నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు గుర్తించారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి, క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితులను గుర్తించి త్వరితగతిన పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎస్సై ప్రజలకు సూచిస్తూ.. ఇళ్లకు తాళం వేసి ఎక్కువసేపు బయటకు వెళ్లాల్సి వస్తే సమీప బంధువులు లేదా పొరుగువారికి సమాచారం ఇవ్వాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్-100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.



