నవతెలంగాణ – హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్ర అభివృద్ధిపై దూరదృష్టి, విజన్ లేక ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేశారని పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని హోటల్ వివేరాలో డిసిసి నూతన కార్యవర్గాన్ని ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ చేసిన అప్పుల వల్ల నేటికీ రూ.6500 కోట్ల వడ్డీలు చెల్లించాల్సి వస్తుందన్నారు.
10 ఏళ్లు పరిపాలించి రూ.8 లక్షల కోట్ల అప్పుడు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి తోశారన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేస్తే అవకాశాలు వాటి అంతట అవే వస్తాయన్నారు. భారతదేశ నిర్మాణంలో రాహుల్ గాంధీ కుటుంబం కీలక పాత్ర పోషించిందన్నారు. దేశ నిర్మాణంలో బిజెపి నాయకుల కుటుంబ సభ్యుల పాత్ర ఎక్కడ ఉందని ప్రశ్నించారు. కొద్దో గొప్పో సావర్కర్ గురించి చెప్పుకుంటే బ్రిటిష్ వారి కాళ్ళ వద్ద మోకరిల్లిన సంఘటనలు మాత్రమే ఉన్నాయన్నారు.



