అమెరికా-ఇజ్రాయిల్ ముఠా ఇరాన్‌పై దాడికి దిగినప్పుడు దానిని ఖండించే ఒక్కమాట కూడా మాట్లాడకుండా, భారత ప్రభుత్వం చాలా హీనమైన పిరికితనాన్ని ప్రదర్శించింది. ఇప్పుడు మీడియాలో తన మద్దతుదారుల ద్వారా ఒక ప్రచారాన్ని ప్రజల్లోకి ఎక్కించడానికి పూనుకుంటోంది. ఆ ఘర్షణలో ఏ పక్షం వైపునా నిలవకుండా మొత్తంగా మౌనం పాటించడమే చాలా గొప్ప ఎత్తుగడ అని, అలా ఉండడమే దేశానికి అత్యంత ప్రయోజనకరమని చెప్పుకోడానికి తయారైంది. నైతికంగా చూసినప్పుడు అమెరికా-ఇజ్రాయిల్ దాడిని ఖండించడం సరైన స్పందన కావచ్చునేమో గాని, ఏ దేశమైనా అనుసరించవలసిన విదేశాంగ విధానం తన జాతీయ ‘స్వంత’ ప్రయోజనాలను బట్టి ఉండవలసిందే తప్ప ”గాలికి కొట్టుకు పోయే” నైతిక ప్రమాణాలను బట్టికాదని ప్రభుత్వం చెప్పుకుంటోంది. కాబట్టి ఇప్పుడు భారతదేశపు జాతీయ స్వప్రయోజనాల ప్రకారం మనం పశ్చిమ సంపన్న దేశాలతో సంబంధాలను కొనసాగించుకోడమే ముఖ్యం.
”మూడవ ప్రపంచ దేశాల నడుమ సంఘీభావం” వంటి అమూర్తమైన భావాలకు అనుగుణంగా నడిస్తే అది నైతికంగా సంతృప్తిని కలిగిస్తుందే తప్ప భౌతికంగా పొందగల ప్రయోజనా లేమీ ఒనగూడవు-ఇదే ప్రభుత్వ సమర్ధకుల వాదన సారాంశం. ఈ వాదన రెండు కారణాల రీత్యా అత్యంత ప్రమాదకరం. మొదటిది: అంతర్జాతీయ వ్యవహారాలలో నైతిక ప్రమాణాల ఆవశ్యకతను కొట్టిపారేయడమంటే రెండవ ప్రపంచ యుద్ధానం తరం ఏర్పడిన అంతర్జాతీయ వ్యవస్థనే కాలదన్నడాన్ని సమర్ధించడం ఔతుంది. ఈ యుద్ధానంతర కాలంలో ఐరాస వ్యవస్థతో సహా నడిచిన అంతర్జాతీయ వ్యవస్థ, దానితోబాటు ఏర్పడిన అంతర్జాతీయ న్యాయ వ్యవస్థ అన్ని సందర్భాల్లోనూ నైతిక ప్రమాణాలకే కట్టుబడి వ్యవహరించిందని చెప్పలేంకాని ఆ వ్యవస్థ స్పష్టమైన నైతిక ప్రమాణాల ప్రాతిపదిక పైనే ఏర్పడిందని చెప్పగలం.
రెండవ ప్రపంచ యుద్ధంలో బలహీనపడ్డ సామ్రాజ్యవాదం ఈ అంతర్జాతీయ వ్యవస్థకు లోబడి వ్యవహరించక తప్పలేదు. అయితే, వీలైనప్పుడల్లా సామ్రాజ్యవాదం ఈ కాలమంతా ఏవో పాత వివా దాలను తవ్వి తీసి తన పెత్తనాన్ని తిరిగి సాధించడానికి ప్రయత్నిస్తూనే వుంది. కాని అటువంటి సందర్భాలు అప్పుడప్పుడూ మాత్రమే తలెత్తినవి. అవి అవకాశం దొరికినప్పుడు మాత్రమే రేపిన వివాదాలు. పైగా అటువంటి అన్ని సందర్భాల్లోనూ సామ్రాజ్యవాదం ఏవో ‘అంతర్గత తిరుగుబాట్ల’ ముసుగులో మూడవ ప్రపంచ దేశాల ప్రభుత్వాల్ని పడగొట్టడానికి పూనుకుంది తప్ప బాహాటంగా బరితెగించి దాడులకు ఎక్కడా దిగలేదు. అందుచేత అంతర్జాతీయ సంబంధాల విషయంలో నైతిక ప్రమాణాల పాటింపు అనేదాన్ని పట్టించుకోనవసరం లేదంటూ అవహేళన చేయడం అంటే మూడవ ప్రపంచ దేశాల మీద నగంగా సాగుతున్న సామ్రాజ్యవాద దాడిని సమర్ధించడమే. ఇది తటస్తత అనిపించుకోదు.
ఒకానొక చారిత్రిక సందర్భంలో మూడవ ప్రపంచ దేశాలు వలస విధానం లేదా అర్థవలస విధానం బారి నుండి బయట పడగలిగాయి. బోల్షివిక్ విప్లవం విజయవంతం కావడంతో ప్రారంభమైన కష్టజీవుల విముక్తి పోరాటాల వెల్లువ ఈ చారిత్రిక పరిస్థితికి దారితీసింది. కొన్ని వారాల క్రితం అమెరికన్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో యూరోపియన్ సామ్రాజ్యవాద దేశాధినేతలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ వాస్తవాన్ని ఒప్పుకున్నాడు. మూడవ ప్రపంచ దేశాలకు వెన్నుదన్నుగా ఇప్పుడు ఆ సోవియట్ యూనియన్ లేదు కనుక మళ్ళీ మూడవ ప్రపంచ దేశాలను తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకుని కొల్లగొట్టడానికి పూనుకోవాలని ఉద్బోధించాడు. ఆ విధంగా ఇప్పుడు సామ్రాజ్యవాదుల ప్రతిదాడిని సమర్ధించుకునే గతితర్కాన్ని ముందుకు తెచ్చాడు.
మన ప్రభుత్వం సమర్ధించుకుంటున్న విధంగా అంతర్జాతీయ విధానాల్లో నైతికతకు విలువనివ్వ నక్కర్లేదని అంగీకరిస్తే ఇక సామ్రాజ్యవాదం అప్పటా అప్పటా చేసే దాడుల పట్ల ఉపేక్ష వహించడంతో అది ఆగిపోదు.మూడవ ప్రపంచ దేశాల స్వాతంత్య్రాన్ని హరించి వాటిని మళ్లీ పాదాక్రాంతం చేసుకోడానికి సామ్రాజ్య వాదం చేస్తున్న ఎదురుదాడిని మొత్తంగానే సమర్ధించడానికి అది దారితీస్తుంది. అంటే మన దేశ స్వాతంత్య్రాన్ని కూడా సామ్రాజ్య వాదానికి సమర్పించుకునే దిశగా ఈ వాదన నడిపిస్తుంది. సోవియట్ యూనియన్ పతనమైన తర్వాత కాలంలో ”రంగు విప్లవాల” పేరుతో సామ్రాజ్యవాదం పాత సోవియట్ రిపబ్లిక్‌లోకి చొరబడింది. నాటో కూటమిని ఏకంగా రష్యన్ సరిహద్దుల వరకూ విస్తరించింది.
అత్యంత ఘోరమైన జాతి హననం గాజాలో జరగడానికి, ఇజ్రాయిల్ వలసవాద సామ్రాజ్యవాదం (సెటిలర్ కొలోనియలిజం) ఆ దేశ సరిహద్దులను ఇతర దేశాల్లోకి చొచ్చుకుపోయేట్టగా విస్తరించుకుంటూ పోవడానికి, వెనిజులా దేశాధ్యక్షుడు మదురోను, అతని భార్యను దుర్మార్గంగా ఎత్తుకుపోడానికి, క్యూబాలోని సోషలిస్టు విప్లవాన్ని కాలరాసేస్తామంటూ బహిరంగంగా అమెరికా బెదిరించడానికి, ఇప్పుడు బహిరంగంగానే ఇరాన్ మీద యుద్ధానికి దారితీసింది. ప్రస్తుతం చాలా తెగువతో ఇరాన్ ప్రతిఘటిస్తోంది కాబట్టి సామ్రాజ్యవాదుల దాడికి అది అడ్డుకట్టగా ఉంది. ఒకవేళ ఈ ప్రతిఘటనను అధిగమించగలిగితే ఇక సామ్రాజ్యవాదం అత్యంత క్రూరమైన రీతిలో, మరింత ధైర్యాన్ని తెచ్చుకుని తన దాడితో విజృంభిస్తుంది.
ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న ప్రభుత్వం సిద్ధాంతంతో, అది అనుసరించే పద్ధతులతో, అక్కడి ఇస్లామిక్ మత వ్యవస్థలతో నిమిత్తం లేకుండా ఇరాన్‌ను బలపరచడం అవసరం. అలా గనుక చేయకపోతే, రేపు మన దేశాన్నే సామ్రాజ్యవాద ఆధిపత్యానికి బలి పెట్టవలసిన స్థితి వస్తుంది. అంటే ఇరాన్‌ను బలపరచడం అనేది కేవలం నైతిక ప్రమాణాల ప్రాతిపదికరీత్యా మాత్రమే కాదు. మన స్వంత దేశపు సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకోవడం కూడా అవసరం. అన్నింటికన్నా ఇప్పుడు ముఖ్యమైనది సామ్రాజ్యవాదుల దాడి గతితర్కాన్ని తిప్పికొట్టడం. ఈ యుద్ధం తర్వాత ఇరాన్ ఏమౌతుంది అనేది కేవలం ఇరాన్‌కు మాత్రమే సంబంధించిన సమస్య కాదు. మన స్వాతంత్య్రం కూడా ఇరాన్ తోటే ముడిపడి వుంది.
ఈ సామ్రాజ్యవాద గతితర్కపు క్రూరత్వం డొనాల్డ్ ట్రంప్‌కి ఉండే తలతిక్కల నుండి పుట్టినది కాదు. ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ స్వభావంలోనే అంతర్లీనంగా ఉంది. తన కాలంలో ప్రపంచం సామ్రాజ్యవాద దేశాల మధ్య పరస్పర వైరంతో విధ్వంస మౌతున్నప్పుడు సామ్రాజ్యవాద రధ ప్రయాణం ఎంత క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతుందో లెనిన్ ప్రత్యేకించి వివరించాడు. అయితే, సామ్రాజ్యవాద దేశాలు తమలో తాము ఘర్షణ పడుతున్న సందర్భంలోనే ఈ క్రూరత్వం వ్యక్తమౌతుందని భావించడం పొరపాటు అవుతుంది. ప్రస్తుతం సామ్రాజ్యవాద దేశాల మధ్య ఉండే వైరుధ్యాలు పైకి తన్నుకురాకుండా చడీచప్పుడూ లేకుండా కొనసాగుతున్నాయి. అంతమాత్రాన సామ్రాజ్యవాదం క్రూరమైన దాడులకు పూనుకోదని భావించలేం. లెనిన్ కాలంలో ముడిసరుకుల మీద పెత్తనం కోసం ఎంత తీవ్రమైన ఆరాటం ఉండేదో ఇప్పుడూ అంత తీవ్రంగానూ ఉంది. అటువంటి ముడిసరుకులను మూడవ ప్రపంచ దేశాల అదుపునకు విడిచిపెట్టకుండా తమ చేజిక్కించుకోడం ఇప్పుడు సామ్రాజ్యవాదులకు చాలా ముఖ్యం.
పెట్టుబడిదారుల నడుమ చావో, బతుకో తేల్చుకునేంత తీవ్రంగా నేడు పోటీ నెలకొంది. ఈ పోటీ విశ్వ వ్యాప్తంగా నెలకొంది. ఏ విధంగానైనా సరే ఆ పోటీలో నిలదొక్కుకోవడం అనేదే సామ్రాజ్యవాదుల వ్యూహాన్ని ప్రధానంగా నిర్ణయిస్తుంది. ఈ ప్రపంచంలో సామ్రాజ్యవాదం ఏదో ఒక సమతూక స్థితి వద్ద సర్దుకుని కొనసాగేందుకు ఎన్నడూ సంసిద్ధం కాదు. శాశ్వతంగా కొనసాగే ‘శాంతియుత సహజీవన’ స్థితిని అది ఎన్నడూ అంగీకరించదు. అంతకంతకూ ఎక్కువగా తమ ‘ఆర్థిక సామ్రాజ్య’ విస్తరణను కొనసాగించడం అనేది దాని ఉనికికి అనివార్యం. యుద్ధానంతర కాలంలో ఏర్పడ్డ ప్రపంచ వ్యవస్థ ఈ విస్తరణకు అనేక పరిమితులను విధించింది. సోవియట్ యూనియన్ పతనంతో ‘విజయం’ సాధించిన సామ్రాజ్యవాదం ఆ తర్వాత మళ్ళీ తన దూకుడును మొదలుపెట్టింది. దీనిని తిప్పికొట్టడానికి మూడవ ప్రపంచ దేశాల ప్రజలు ‘ప్రతిఘటన’కు గతితర్కంతో సిద్ధం కావాలి. ఇప్పుడు ఎవరు సామ్రాజ్యవాదంతో పోరులో నిమగ్నమైవున్నా వారిని బలపరచడం ఈ గతితర్కంలో భాగంగా ఉంటుంది.
ఇప్పుడు ఈ వాదనకు ఒక ప్రత్యేక నిర్దిష్ట సందర్భం కూడా ఉంది. మూడవ ప్రపంచ దేశాల్లోని సోషలిజానికి, అభ్యుదయ లౌకిక జాతీయ వాదానికి వ్యతిరేకంగా జరిపిన పోరులో సామ్రాజ్యవాదం ‘ఇస్లామిజం’ను తన ఆయుధంగా వాడుకుంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారత ఉపఖండంలో జరిగిన జాతీయోద్యమాన్ని దెబ్బ తీయడానికి బ్రిటన్ ప్రధాని, అప్పటి సామ్రాజ్యవాద శిబిరానికి నాయకుడు అయిన విన్‌స్టన్ చర్చిల్ ముస్లిం వేర్పాటువాదాన్ని బలపరిచాడు. అక్కడి నుంచి ఇస్లామిజాన్ని అడ్డంపెట్టుకోవడం మొదలై, మొహమ్మద్ మొసాద్దేహ్ నాయకత్వంలో ఇరాన్‌లో ఏర్పడిన లౌకిక, అభ్యుదయ పాలనను దెబ్బ తీయడానికి అయతుల్లా కాసానీని ఉపయోగించి తిరుగుబాటుకు అమెరికా కుట్ర పన్నడంవరకూ సాగింది. ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన సౌర్ విప్లవాన్ని దెబ్బ తీయడానికి కూడా ఇస్లామిక్ శక్తులను ఉపయోగించారు. అన్ని సందర్భాల్లోనూ మత ప్రాతిపదికన ప్రజానీకాన్ని చీల్చి అభ్యుదయ శక్తులను దెబ్బ తీయడం సామ్రాజ్యవాదులు మూడవ ప్రపంచ దేశాలలో అనుసరించిన వ్యూహం.
అయితే, ఇక్కడ చరిత్రలోని విచిత్రం ఏమంటే ఈ ఇస్లామిక్ శక్తులు ఒకసారి అధికారంలోకి వచ్చాక, అనేక సందర్భాల్లో సామ్రాజ్యవాదాన్ని ఎదిరించి నిలబడ్డాయి. అలా నిలబడ్డప్పుడు అదే సామ్రాజ్యవాదం మళ్లీ ”ప్రజాస్వామ్య రక్షణ” ముసుగునో, ”స్వేచ్ఛ” ముసుగునో ధరించి గతంలో తన సహకారంతోనే అధికారం చేపట్టిన శక్తులకే వ్యతిరేకంగా మళ్లీ కుట్రలకు సిద్ధపడింది. కొన్నిసార్లు తనను ఎదిరించిన ఇస్లామిక్ శక్తులను దెబ్బ తీయడం కోసం సామ్రాజ్యవాదం లౌకిక ప్రభుత్వాలకు కూడా మద్దతునిచ్చింది. ఇరాన్-ఇరాక్ యుద్ధంలో అమెరికా చేసిందిదే. సామ్రాజ్యవాద జోక్యాన్ని ఎదిరించినా లేక సానుకూ లంగా వ్యవహరించకపోయినా అటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆయా దేశాల్లో అల్లర్లు రెచ్చగొట్టడానికి సామ్రాజ్యవాదం రూపొందించిన సాధనమే నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమాక్రసీ (ఎన్‌ఇడి) ఈ సంస్థ ద్వారా వివిధ దేశాల్లో అల్లర్లను, కుట్రలను రెచ్చగొట్టే శక్తులకు నిధులను అందిచడం జరుగుతూ వచ్చింది.
ఉక్రెయిన్ లో ప్రజలు ఎన్నుకున్న విక్టర్ యానుకోవిచ్‌కు వ్యతిరేకంగా అల్లర్లు రెచ్చగొట్టింది ఈ నిధులతోనే. ఇప్పుడు ఇరాన్‌లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అటువంటి ప్రయత్నాన్నే చేసింది కాని అందులో విఫలమైంది. అందుకనే ప్రత్యక్ష సైనిక దాడికి దిగింది. ఇటువంటి దాడి జరుగుతున్నప్పుడు దాన్ని సామ్రాజ్య వాదపు ప్రపంచాధిపత్య వ్యూహంలో భాగంగా చూడాలే తప్ప ఏదో విడిగా జరుగుతున్న సంఘటనగా చూడడం తీవ్ర తప్పిదమౌతుంది. గతంలో ఇస్లామిజం కూడా సామ్రాజ్యవాదంతో చేతులు కలిపినప్పుడు ఇటువంటి తప్పిదాన్నే చేసింది. యావత్తు మూడవ ప్రపంచ దేశాలన్నీ సామ్రాజ్యవాద ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలవాలి. ఈ దేశాల ప్రజల ఐక్యత తోటే సామ్రాజ్యవాద కుట్రలను ఓడించగలుగుతాం. సామ్రాజ్యవాదం అనుసరిస్తున్న దురాక్రమణ గతితర్కానికి సరైన సమాధానం దానిని ప్రతిఘటించే గతితర్కమే.
అయితే, హిందూత్వ శక్తులకు ఇది అర్థం కాదు. ఆ హిందూత్వను ప్రతిపాదించిన వి.డి.సావర్కర్ భారత ఉప ఖండంలో ద్విజాతి సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చాడు. దానినే మహమ్మద్ ఆలీ జిన్నా ముందుకు తీసుకెళ్లి దేశ విభజనకు పూనుకున్నాడు. వీరిద్దరినీ విన్‌స్టన్ చర్చిల్ నాయకత్వంలోని బ్రిటిష్ సామ్రాజ్యవాదం బలపరిచింది. ఇప్పుడు ఈ హిందూత్వ శక్తులు ఇజ్రాయిల్‌తో కూడబలుక్కుంటూ, అమెరికా అడుగులకు మడుగు లొత్తుతూ వ్యవహరిస్తున్నాయి గనుకనే ఇరాన్ మీద జరగుతున్న దాడి విషయంలో ఇంత పిరికితనంతో, మౌనాన్ని వహిస్తున్నాయి. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటాల్లో పునాదులు ఉన్న ఏ అభ్యుదయ జాతీయ స్రవంతీ ఇటువంటి మౌనాన్ని అంగీకరించదు. ఇప్పుడు ఇలా మౌనం వహించడమే దేశ ప్రయోజనాలకు మంచిదన్న వాదన పూర్తిగా అర్ధం లేని వాదన. సామ్రాజ్యవాదుల దుండగీడుతనాన్ని చూడకుండా కబోదిలా వ్యవహరించడమే కాక, ఇది మన దేశ వారసత్వం అయిన జాతీయ విమోచనా పోరాటానికి కూడా అవమానకరం!
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్



