ప్రజల్లో అవగాహన పెంచితేనే టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చు
ప్రాథమిక ఆరోగ్య కేద్రం వైద్యురాలు డాక్టర్ మౌనిక
నవతెలంగాణ- కాటారం
క్షయ (టీబీ) వ్యాధి గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించే ప్రమాదకర అంటువ్యాధి కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక వైద్య అధికారిణి డాక్టర్ మౌనిక సూచించారు. ముఖ్యంగా టీబీ రోగి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వచ్చే నోటి తుంపర్ల ద్వారా ఈ వ్యాధి ఇతరులకు వ్యాపిస్తుందని అన్నారు .
ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో స్థానిక వైద్యాధికారిణి డాక్టర్ ఎం. మౌనిక మాట్లాడుతూ.. క్షయ వ్యాధి ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుందని, మైక్రోబ్యాక్టీరియ ట్యూబర్‌క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుందని తెలిపారు.
టీబీ లక్షణాలుగా రెండు వారాలకు మించిన దగ్గు, తీవ్రమైన జ్వరం, బరువు తగ్గడం, రాత్రిపూట చెమటలు, ఆకలి మందగించడం వంటి లక్షణాలు ఉంటాయని చెప్పారు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీబీకి సంబంధించిన పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని, అవసరమైతే ఎక్స్‌రే పరీక్షలు కూడా చేస్తారని తెలిపారు. టీబీ నిర్ధారణ అయిన వారికి పూర్తిగా ఉచితంగా చికిత్స అందించడంతో పాటు పౌష్టికాహారం కోసం బియ్యం, పప్పులు వంటి ఆహార దినుసులు కూడా అందజేస్తున్నారని పేర్కొన్నారు.
టీబీ నివారణకు దగ్గినప్పుడు రుమాలు పెట్టుకోవడం, మాస్కులు ధరించడం, పౌష్టికాహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చికిత్స మధ్యలో మందులు మానేయకుండా పూర్తి కోర్సు పూర్తి చేయాలని ప్రజలకు సూచించారు. “ప్రజల్లో అవగాహన పెంచితేనే టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చు. ‘Yes We Can End TB’ అనే నినాదంతో ముందుకు సాగాలి” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నిర్మల, మహిళా హెల్త్ సూపర్వైజర్ సరళ, జిల్లా అకాడమిక్ టీం సభ్యులు కాపర్తి రాజు, మహిళా హెల్త్ అసిస్టెంట్ నిర్మల, స్టాఫ్ నర్స్ కృపావరం, ఫార్మసిస్ట్ రషియా, ల్యాబ్ టెక్నీషియన్లు పుష్పలత, రాజు, ఇమ్మానియేల్, ఆశా కార్యకర్తలు జయప్రద, రాజేశ్వరి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



