ఉద్యానవన శాఖ అధికారి వై.మణి
నవతెలంగాణ – మల్హర్ రావు
పంట మార్పిడితో రైతులు అధిక దిగుబడి, లాభాలు పొందవచ్చునని మహాదేవపూర్ డివిజన్ ఉద్యాన శాఖ అధికారి వై.మణి అన్నారు. మండలంలోని దుబగట్టు, గ్రామ శివారులో సోమవారం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఉద్యాన పంటలపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యాన శాఖ అధికారి మాట్లాడుతూ .. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉద్యాన పంటల సాగులో రైతులు అనుసరించాల్సిన మెలకువలు, పంటల యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు.
ఉద్యాన శాఖ ద్వారా అమలవుతున్న వివిధ పథకాల గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఉద్యాన పంటల సాగు ద్వారా రైతులు తక్కువ భూమిలో ఎక్కువ ఆదాయం పొందే అవ కాశం ఉందని తెలిపారు. కూరగాయలు, పండ్ల తోటలు, ఆయిల్ పామ్ వంటి ఉద్యాన పంటల సాగు ద్వారా మార్కెట్లో మంచి ధర లభించి రైతుల ఆదాయం పెరుగుతుందన్నారు. డ్రిప్ సాగు విధానాన్ని అనుసరించడం ద్వారా నీటి పొదుపు జరిగి పంటల ఉత్పత్తి పెరుగుతుందని వివరించారు. రైతులకు డ్రిప్ వ్యవస్థ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్వహణ పద్ధతులు నీటి పొదుపు ద్వారా పంటల ఉత్పత్తి పెంపు గురించి వివరించారు. అనంతరం తెలంగాణ ఉద్యాన మిషన్ పథకం కింద రైతులకు కూరగాయల మినీ కిట్లను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన విస్తరణ అధికారి రామ్‌దాస్, ఆయిల్ పామ్ కంపెనీ, డ్రిప్ కంపెనీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.



