Wednesday, March 25, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంచర్చలపై అనిశ్చితి

చర్చలపై అనిశ్చితి

- Advertisement -

కొలిక్కి రాని దౌత్య యత్నాలు
ఇంకా నిర్ణయం తీసుకోలేదు : అమెరికా
సంప్రదింపులు జరగడం లేదు : ఇరాన్‌
ట్రంప్‌ ప్రకటనతో మాకేమీ సంబంధం లేదు : ఇజ్రాయిల్‌
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న దాడులు-ప్రతి దాడులు
నవ తెలంగాణ – సెంట్రల్‌ డెస్క్‌
మధ్యప్రాచ్యంలో యుద్ధానికి ఐదు రోజులు విరామం ఇస్తున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనను ఇరాన్‌, ఇజ్రాయిల్‌ ఖాతరు చేయడం లేదు. ఆ ప్రాంతంలో దాడులు, ప్రతి దాడులు మంగళవారం కూడా కొనసాగాయి. మరోవైపు ఇరాన్‌ తో జరుగుతున్న చర్చలలో అనిశ్చితి నెలకొన్నదని శ్వేతసౌధం తెలిపింది. అస్థిర పరిస్థితులు కొనసాగుతున్నం దున చర్చలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్‌ లీవిట్‌ చెప్పారు. తాము అధికారికంగా ప్రక టించే వరకూ ఎలాంటి ఊహాగానాలను నమ్మవద్దని కోరారు. అమెరికా అధ్యక్ష భవనం ప్రకటనతో బ్యారల్‌ చమురు ధర మళ్లీ వంద డాలర్లు దాటింది. అసలు చర్చలే జరగడం లేదని ఇరాన్‌ అంటుంటే ట్రంప్‌ ప్రకటనతో తనకేమీ సంబంధం లేదని ఇజ్రాయిల్‌ తేల్చి చెప్పింది. లెబనాన్‌, పాలస్తీనా ప్రజలకు వ్యతి రేకంగా ఇజ్రాయిల్‌ పెద్ద ఎత్తున యుద్ధ నేరాలకు పాల్పడుతోందని మండిపడిన ఇరాన్‌…ఉత్తర ఇజ్రాయిల్‌ లోనూ, గాజా సమీపం లోనూ ఉన్న సేనలపై క్షిపణులు, డ్రోన్లతో భారీగా దాడులు చేస్తానని హెచ్చరించింది. తమ మౌలిక సదుపాయాల జోలికి వస్తే అమెరికాను నిర్వీర్యం చేసా ్తమని, అరేబియన్‌ గల్ఫ్‌ ప్రాంతంలోని దాని నౌకలను సముద్రంలో ముంచే స్తామని ఐఆర్‌జీసీ సీనియర్‌ అధికారి మొహసేన్‌ రెజాయీ చెప్పారు.

78వ విడత దాడులు ప్రారంభించిన ఇరాన్‌
ఇజ్రాయిల్‌పై 78వ విడత దాడులు మొదలు పెట్టామని ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) తెలిపింది. ఇజ్రాయిల్‌లోని డిమోనా, టెల్‌ అవీవ్‌, ఇలాట్‌తో పాటు గల్ఫ్‌ దేశాలలోని అమెరికా సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకొని క్షిప ణులు, డ్రోన్‌ దాడులు జరుపుతున్నామని చెప్పింది. ఈ దాడులలో పలు ప్రాంతాలు ధ్వంసమ య్యాయని తెలిసింది. టెహ్రాన్‌ వైపు వచ్చిన సాయుధ హెర్మస్‌ డ్రోన్‌ను మధ్యలోనే అడ్డుకొని ధ్వంసం చేశామని ఐఆర్‌జీసీ తెలియజేసింది. ఇరాన్‌ వైపు నుంచి దూసుకొస్తున్న క్షిపణులతో అప్రమత్తమైన ఇజ్రాయిల్‌ అధికారులు దేశవ్యాప్తంగా సైరన్లు మోగించారు.

ఇజ్రాయిల్‌ దాడిలో అగ్నికి ఆహుతైన జనావాసాలు
అటు ఇజ్రాయిల్‌ కూడా ఇరాన్‌లోని రెండు గ్యాస్‌ స్థావరాలపై దాడులు జరిపింది. ఇస్ఫహాన్‌లోని గ్యాస్‌ వ్యవస్థ, ఖొర్రమ్‌షహర్‌లోని విద్యుత్‌ ప్లాంటును క్షిపణులు, డ్రోన్లు తాకాయి. టెహ్రాన్‌లోని పలు ప్రభుత్వ కార్యాలయాలపై సోమవారం రాత్రి వైమానిక దాడులు జరిపామని ఇజ్రాయిల్‌ సైన్యం చెప్పింది. బాలిస్టిక్‌ క్షిపణులను నిల్వ చేసే కేంద్రాలు, ఇంటెలిజెన్స్‌ మంత్రిత్వ శాఖ కార్యాలయం సహా రెండు ఐఆర్‌జీసీ ఇంటెలిజెన్స్‌ ప్రధాన కార్యాలయాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని వివరించింది. లెబనాన్‌లోని పలు నివాస గృహాలు, బ్రిడ్జిలపై సైతం ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు జరిపింది. దక్షిణ లెబనాన్‌ ప్రాంతంలో అనేక జనావాసాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. మరోవైపు ఐదు ఇజ్రాయిల్‌ లక్ష్యాలపై దాడి చేశామని హెజ్బొల్లా తెలిపింది. తాజా దాడులపై అమెరికా అధికారి ఒకరు స్పందిస్తూ తాము కేవలం ఇరాన్‌ ఇంధన మౌలిక సదుపాయాలపై మాత్రమే దాడులు ఆపామని, ఇతర ప్రాంతాలపై అవి కొనసాగుతాయని చెప్పుకొచ్చారు.

ట్రంప్‌ ప్రకటనకు ముందు భారీ బెట్టింగ్‌ ?
ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయంటూ ట్రంప్‌ ప్రకటన చేయడానికి ముందు ట్రేడర్లు పెద్ద ఎత్తున బెట్టింగుకు పాల్పడ్డారని తెలుస్తోంది. చమురు ధరలు తగ్గిపోతాయని, స్టాక్‌ మార్కెట్లు పుంజుకుంటాయని జోరుగా బెట్టింగులు సాగాయి. ఆ తర్వాతే ట్రంప్‌ ప్రకటన వెలువడింది. దీనిని బట్టి చూస్తే అంతర్జాతీయ మార్కెట్లలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందన్న వార్తలు వచ్చాయి. ట్రేడర్ల బెట్టింగ్‌, ట్రంప్‌ ప్రకటన ఒక దాని తర్వాత ఒకటి రావడం కేవలం యాధృచ్ఛికమేనని అంటున్న వారు కూడా లేకపోలేదు.

ఏదేమైనా అంతర్జాతీయ మార్కెట్లలో 580 మిలియన్‌ డాలర్ల మేర బెట్టింగ్‌ జరిగిందని తెలుస్తోంది. అయితే అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్‌ తేల్చి చెప్పడంతో మార్కెట్లలో ఏం జరిగిందనే దానిపై పరిశీలన జరుగుతోంది. న్యూయార్క్‌ కాలమానం ప్రకారం ఉదయం 6.49 గంటలు, 6.50 గంటల మధ్య వందల మిలియన్‌ డాలర్ల మేర ట్రేడర్లు బెట్టింగ్‌ చేశారని ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రిక తెలియజేసింది. ట్రంప్‌ ప్రకటన వెలువడడానికి పదిహేను నిమిషాల ముందు ఈ బెట్టింగ్‌ జరిగింది. అయితే ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ జరిగిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు.

అమెరికా చమురు శుద్ధి కర్మాగారంలో పేలుడు
అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో ఉన్న పోర్ట్‌ ఆర్థర్‌ ప్రాంతంలోని వాలెరో ఎనర్జీ చమురు శుద్ధి కర్మాగారంలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. రిఫైనరీలోని హీటర్‌ పేలడంతో ఈ ఘటన జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడడంతో ఆ ప్రాంతమంతటా దట్టమైన పొగలు అలముకున్నాయి. అమెరికాలోని కీలకమైన రిఫైనరీలలో ఇది ఒకటి. ఇది రోజుకు 3,80,000 బ్యారల్స్‌ చమురును శుద్ధి చేస్తుంది. ఘటనపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

దాడి చేయమని చెప్పింది నీవేగా : నెపాన్ని హెగ్‌సేథ్‌పై నెట్టేసిన ట్రంప్‌
ఇరాన్‌ యుద్ధం విషయంలో తనపై వస్తున్న విమర్శల నుంచి తప్పించుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో నెపాన్ని యుద్ధ మంత్రిపై నెట్టేసి చేతులు దులుపుకున్నారు. ఇరాన్‌పై దాడి చేయాలంటూ ముందుగా చెప్పింది యుద్ధ శాఖ మంత్రి పీట్‌ హెగ్‌సేథేనని ట్రంప్‌ సెలవిచ్చారు. టెన్నెసీలో జరిగిన ఓ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ ఇరాన్‌పై సైనిక చర్య జరపడానికి ముందు తాను కొందరు మంత్రులు, అధికారులను సంప్రదించానని చెప్పారు. ఇరాన్‌పై దాడికి ముందుగా మద్దతు ఇచ్చింది హెగ్‌సేథేనని తెలిపారు. సమావేశంలో పక్కనే కూర్చున్న హెగ్‌సేథ్‌ను ఉద్దేశించి ‘పీట్‌…దీనిపై తొలుత మాట్లాడింది నువ్వే అనుకుంటా. ఇరాన్‌ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని, కాబట్టి మనమే దాడి చేద్దామని మీరు అన్నారు’ అంటూ చెప్పుకొచ్చారు. ట్రంప్‌ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో చర్చకు దారి తీశాయి. అయితే వీటిపై హెగ్‌సేథ్‌ ఇప్పటి వరకూ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇరాన్‌తో యుద్ధానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ పెద్దగా ఆసక్తి చూపలేదని కూడా ట్రంప్‌ చెప్పారు. యుద్ధంలో గల్ఫ్‌ దేశాలను ఇరాన్‌ లక్ష్యంగా చేసుకుం టుందని తాము అనుకోలేదని ట్రంప్‌ అంగీకరించారు.

చర్చలకు మీరే రండి : అమెరికాకు ఇరాన్‌ షరతు
ఇరాన్‌-అమెరికా మధ్య దౌత్యం నెరిపేందుకు అనేక ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి. వీటిలో ఈజిప్ట్‌ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఆ దేశానికి చెందిన ఇంటెలిజెన్స్‌ అధికారులు ఐఆర్‌జీసీతో సంబంధా లను నెలకొల్పుకోగలిగారు. దీంతో ట్రంప్‌ కూడా ఓ అడుగు వెనక్కి వేసి యుద్ధానికి ఐదు రోజుల విరామం ప్రకటించారు. దౌత్య యత్నాలు జరిపిన దేశాలలో భారత్‌ కూడా ఉన్నదని బ్లూమ్‌బర్గ్‌ నివేదిక తెలిపింది. ఒమన్‌, టర్కీ వంటి దేశాలు కూడా ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈజిప్ట్‌, టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రు లు కొద్ది రోజుల క్రితం రియాద్‌లో సమావేశ మై దౌత్య అవకాశాలపై చర్చించారు. చివరికి ఈజిప్ట్‌ అధికారులు ఐఆర్‌జీసీని సంప్రదించగలిగారు. టర్కీ, ఈజిప్ట్‌, పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రులు శ్వేతసౌధం దౌత్యవేత్త స్టీవ్‌ విట్‌కాఫ్‌, ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీలీతో విడివిడిగా చర్చలు జరిపారని మీడియా వార్తలు సూచిస్తున్నాయి. మధ్యవర్తుల ద్వారా అమెరికా నుంచి ఇరాన్‌కు ఓ సందేశం వచ్చిందని, అందులో చర్చలకు సానుకూల సంకేతం ఇచ్చిందని సీబీఎస్‌ న్యూస్‌ తెలిపింది. అమెరికా నుంచి వచ్చిన సందేశాన్ని పరిశీలిస్తున్నామని ఇరాన్‌ విదేశాంగ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. అయితే అమెరికాయే నేరుగా చర్చలలో భాగస్వామి కావాలని ఇరాన్‌ షరతు పెట్టింది. యుద్ధం మొదలు పెట్టింది అమెరికాయే కనుక చర్చలకు ముందుకు రావాల్సింది కూడా ఆ దేశమేనని స్పష్టం చేసింది.

దాడులను తిప్పికొడతాం : అరాగ్చీ
విద్యుత్‌ మౌలిక సదుపాయాలపై దాడులు జరుగు తాయన్న ఆందోళన వద్దని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఒకవేళ అలాంటి దాడులు జరిగితే వాటిని తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాగా అమెరికా-ఇజ్రాయిల్‌ జరుపుతున్న దాడులలో ఇప్పటి వరకూ 208 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని ఇరాన్‌ అత్యవసర సర్వీసుల విభాగం తెలియజేసింది. ఓ బాలికల పాఠశాలపై అమెరికా జరిపిన క్షిపణి దాడిలలో 168 మంది పిల్లలు బలయ్యారని చెప్పింది. మొత్తంమీద అమెరికా, ఇజ్రాయిల్‌ సేనల దాడులలో 1,500 మందికి పైగా ప్రజలు చనిపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -