– సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ
– ఉపాధి హామీని దెబ్బతీస్తే సహించం
– లేబర్కోడ్లను రద్దు చేయాలి
– విత్తన, విద్యుత్ చట్ట సవరణను ఉపసంహరించాలి
– లేదంటే నిరసనలే సునామీలా ముంచేస్తాయి : మోడీ ప్రభుత్వానికి జన ఆక్రోశ్ ర్యాలీ హెచ్చరిక
– ఈ విధానాలు సరిదిద్దుకోకపోతే భూస్థాపితమే : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ
ఢిల్లీ నడిబొడ్డున ఎర్రజెండా రెపరెపలాడింది. అది ప్రజల ఆగ్రహంగా, హెచ్చరికగా, ప్రతిఘటనగా ఎగిసిపడింది. ఉత్తర భారతం నలుమూలల నుంచి తరలివచ్చిన కార్మికులు, రైతులు, యువత రామ్‌లీలా మైదానాన్ని క్షణాల్లోనే ఎర్రసముద్రంగా మలిచారు. ఒక్కో నినాదం, ఒక్కో కేక ‘జన్ ఆక్రోశ్’గా గర్జించింది. ‘ధరల దోపిడీ ఆపాలి’, ‘ఇంధన భారం తగ్గించాలి’, ‘లేబర్ కోడ్లు రద్దు చేయాలి’, ‘విద్యుత్ ప్రయివేటీకరణను ఉపసంహరించుకోవాలి’, ”వ్యవసాయాన్ని కాపాడాలి’, ‘ ఉద్యోగాలు ఇవ్వాలి’… అంటూ మారుమోగిన డిమాండ్లు కేంద్ర విధానాలపై నేరుగా సవాల్ విసిరాయి. జీవన భారం, నిరుద్యోగం, హక్కుల క్షీణత … ఈ మూడు ఒత్తిళ్లతో మగ్గుతున్న ప్రజల అసహనం ఇక్కడ ఒకే స్వరంగా వెల్లువెత్తింది.
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
”రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించిన ర్యాలీ నిరసనలో మొదటి దశ మాత్రమే. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన ప్రజా వ్యతిరేక విధానాలను సరిదిద్దుకోవాలి. లేనిపక్షంలో ప్రస్తుతం కొనసాగుతున్న నిరసనలు సునామీలా మోడీ ప్రభుత్వాన్ని ముంచేస్తాయి” అని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ హెచ్చరించారు. దేశంలో ఎర్రజెండా శకం ముగిసిపోయిందని అంటున్న ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్‌కు ”జన ఆక్రోశ్” ర్యాలీ గట్టి హెచ్చరిక అని తెలిపారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించిన ‘జన ఆక్రోశ్’ ర్యాలీకి ఉత్తర భారతదేశంలోని 13 రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో సీపీఐ(ఎం) కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎంఏ బేబీ మాట్లాడుతూ ”ఎర్ర జెండా కేరళలో మాత్రమే మిగిలి ఉందని, ఈ అసెంబ్లీ ఎన్నికలతో అది అంతమవుతుందని మోడీ, షా అంటున్నారు. దేశంలో కమ్యూ నిజాన్ని నిర్మూలించడానికి సంఫ్‌ు పరివార్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ, రామ్‌లీలా మైదా నంలో ఎర్ర జెండా ఊపుతూ వేలాది గొంతు కలు చేస్తున్న నినాదాలు సంఫ్‌ు పరివార్ నీచమైన ఎత్తుగడలూ ఫలించవన డానికి నిదర్శనంగా నిలిచాయి” అని అన్నారు.
”రామ్‌లీలా మైదాన్లోనిర్వహించిన ఈ ర్యాలీకి ముందు సీపీఐ(ఎం) ఆధ్వర్యాన చేపట్టిన పలు ‘జన ఆక్రోశ్’ జాతాలు జమ్మూ కాశ్మీర్ నుంచి జార్ఖండ్ వరకు, గుజరాత్ నుంచి హిమాచల్‌ప్రదేశ్ వరకు కొనసాగాయి. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఉత్తర భారతదేశంలో ఆయా రాష్ట్రాల్లోని ప్రతి గ్రామానికి చేరుకుని ప్రజలతో మమేకమ య్యారు. ప్రజల సమస్యలను వారు అర్థం చేసుకున్నారు. ప్రధానమంత్రి నియోజకవర్గమైన వారణాసిలో జరిగిన జాతాలో నేనూ పాల్గొన్నాను. అక్కడ, ప్రసిద్ధ అన్నపూర్ణ ఆలయంలో మూడొందల ఏండ్లుగా జరుగుతున్న అన్నదానం, వంటగ్యాస్ కొరత కారణంగా మొదటిసారి నిలిచిపోయింది. ఇదీ మోడీ నియోజకవర్గంలో దుస్థితి” అని బేబీ అన్నారు. ”అంబానీ, అదానీల కోసం కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక కోడ్లను తీసుకొచ్చిన ప్రభుత్వం, కార్మికుల హక్కులన్నింటినీ హరించి వేసింది. దీనికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న ట్రేడ్ యూనియన్లు నిర్వహించిన సమ్మెలో 30 కోట్ల మంది పాల్గొన్నారు. ఉపాధి హామీలను దెబ్బతీయడం, విద్యుత్, విత్తన చట్టాలను సవరించడానికి సిద్ధమవడం, కనీస మద్దతు ధర వ్యవస్థను బలహీనపరచడంతో ప్రభుత్వం రైతులకు, కార్మికులకు హాని చేస్తోంది” అని ఆయన విమర్శించారు.
కేరళలోని వామపక్ష ప్రభుత్వం ప్రజలను ఐక్యంగా ఉంచుతోంది : విజ్జూ కృష్ణన్
కేరళలోని వామపక్ష ప్రభుత్వం అక్కడి ప్రజలను ఐక్యంగా ఉంచుతోందని పొలిట్‌బ్యూరో సభ్యులు విజ్జూ కృష్ణన్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ పాలనతో కేరళ పాలనను పోలుస్తూ, వామపక్ష ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఎలా ఉపశమనం కలిగిస్తోందో వివరించారు. ”దేశంలో తీవ్ర పేదరికం నుంచి విముక్తి పొందిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది. కేరళలో 62 లక్షల మంది సామాజిక భద్రతా పింఛన్లు పొందుతున్నారు. మూడు లక్షలకు పైగా మహిళలకు నెలకు రూ.1,000 పింఛను అందుతోంది. నర్సరీ నుంచి డిగ్రీ వరకు విద్య ఉచితం. గత పదేండ్ల వామపక్ష పాలనలో రాష్ట్రంలో ఒక్క మత ఘర్షణ కూడా జరగలేదు. కాంగ్రెస్ – బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్ రాజ్, గుడిసెల కూల్చివేత విధానాలు ఉంటే, కేరళలోని వామపక్ష ప్రభుత్వం పేదలకు నీడను అందిస్తోంది. లైఫ్ పథకం కింద ఐదు లక్షల కుటుంబాలకు మంచి ఇండ్లు అందుతున్నాయి” అని తెలిపారు. ”ఉత్తర ప్రదేశ్‌లో ఆశా కార్యకర్తలకు నెలకు రూ.3,500 లభిస్తుండగా, కేరళలో ఆశా కార్యకర్తలకు రూ.15,500 లభిస్తుంది. యూపీలో అంగన్వాడీ హెల్పర్లకు రూ.4,000, వర్కర్లకు రూ.8,000 ఇస్తుంటే, అదే కేరళలో హెల్పర్లకు రూ.11,500, వర్కర్లకు రూ.16,000 లభిస్తుంది. అదే విధంగా యూపీలో పాఠశాల మధ్యాహ్న భోజన కార్యకర్తలకు రూ.2 వేలు లభిస్తుండగా, కేరళలో వారికి రూ.14 వేలు లభిస్తున్నాయి” అని తెలిపారు.
ర్యాలీలో సామ్రాజ్యవాద వ్యతిరేక సందేశం వ్యాప్తి
ఇటీవల సామ్రాజ్యవాద వ్యతిరేక సందేశాన్ని అందించిన యూఎస్ పౌరుడు బెంజమిన్ కమ్మింగ్స్ జన ఆక్రోశ్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ పోరాటానికి సంఘీభావం తెలిపేందుకు చికాగోకు చెందిన బెంజమిన్ తరలివచ్చారు. కొద్దిగా మలయాళీ వచ్చిన బెంజమిన్ భాగస్వామి మేఘా పాపచాన్ కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఈ సందర్భంగా బెంజమిన్ మాట్లాడుతూ ”సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలకు సంఘీభావం తెలుపుతున్నాం. డోనాల్డ్ ట్రంప్‌నకు వ్యతిరేకంగా మేము, అమెరికన్లు పోరాడుతున్నాం. సామాన్యులకు మేలు చేసే అన్ని సంక్షేమ పథకాలను ట్రంప్ రద్దు చేశారు. డబ్బంతా యుద్ధంపై ఖర్చు చేస్తున్నారు. మోడీని మిత్రుడిగా చేసుకుని ట్రంప్ భారతదేశాన్ని, ఇక్కడి రైతులను దోచుకోవడానికి యత్నిస్తున్నారు. వాణిజ్య ఒప్పందాలు అమెరికాలోని సామాన్యులు, రైతుల కోసమేనన్న ట్రంప్ వాదన పచ్చి అబద్ధం. కార్పొరేట్లకు సహాయం చేయడం తప్ప ట్రంప్ రైతులకు ఏమీ చేయడం లేదు” అని అన్నారు.
అమెరికాకు మోకరిల్లిన మోడీ
సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు అశోక్ ధావలే
ప్రధాని మోడీ అమెరికా ముందు ‘లొంగిపోయిన’ మోడీగా మారారని పొలిట్‌బ్యూరో సభ్యులు అశోక్ ధావలే విమర్శించారు. ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన జన ఆక్రోశ్ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ”మోడీ ప్రభుత్వాన్ని మూడు శక్తులు నడిపిస్తున్నాయి. ఒకటి ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని సంఫ్‌ు పరివార్, వారి మతతత్వ భావజాలం. మరొకటి అంబానీ – అదానీ వంటి పెద్ద కార్పొరేట్లు. ప్రభుత్వం వెనుక ఉన్న ఇంకొక వర్గం ట్రంప్, నెతన్యాహు వంటి సామ్రాజ్యవాద శక్తులు” అని అన్నారు. ”మోడీ తన ఛాతీ 56 అంగుళాలు అని చెప్పేవారు. కానీ ట్రంప్ ముందు అది 16 అంగుళాలకు కుంచించుకు పోతోంది. సంఫ్‌ు పరివార్ యొక్క మతతత్వ, కార్పొరేట్, సామ్రాజ్యవాద వైఖరిని సీపీఐ(ఎం), వామపక్షాలు మాత్రమే బహిరంగంగా వ్యతిరేకిస్తున్నాయి” అని తెలిపారు. ”సంఫ్‌ు పరివార్, బీజేపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఇటీవల సీపీఐ(ఎం), వామపక్షాలు భారీ ఆందోళనలు నిర్వహించాయి. మహారాష్ట్రలో సీపీఐ(ఎం) పాల్ఘర్, నాసిక్ నుంచి ముంబయి వరకు రెండు పాదయాత్రలు నిర్వహించింది. వ్యవసాయ భూమిపై హక్కులను కల్పించడం, పంటలకు సరసమైన ధరలు అందించడం, రైతు రుణాలను మాఫీ చేయడం వంటి డిమాండ్లను ఈ ప్రదర్శనలు లేవనెత్తాయి. ఈ రెండు యాత్రల్లో వేలాది మందికిపైగా ప్రజలు పాల్గొన్నారు. ఈ ప్రదర్శన ముంబయికి చేరుకున్నప్పుడు బీజేపీ ప్రభుత్వం తలొగ్గింది. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరిలో కార్మిక సంఘాలు నిర్వహించిన సమ్మెకు కూడా ప్రజల నుంచి భారీ మద్దతు లభించింది” అని ఆయన అన్నారు. ”ఉత్తర భారతదేశంలో రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘జన ఆక్రోశ్’ జాతాలో భాగంగా ఉత్తరప్రదేశ్, బీహార్లలో జరిగిన ప్రదర్శనలో అక్కడి రైతులతో మాట్లాడాం. ఈ సందర్భంగా వారు తమ ఉత్పత్తులకు సరసమైన ధరలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.800 నుంచి రూ.1,600 మాత్రమే ధర లభిస్తోందని తెలిపారు. వామపక్షాలు పాలిస్తున్న కేరళలో వరి ధాన్యానికి మద్దతు ధర రూ.3,000గా ఉంది” అని ధావలే తెలిపారు.
ఎర్రజెండా రెపరెపలు
ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన ‘జనఆక్రోశ్’ ర్యాలీలో ఎర్రజెండా రెపరెపలాడింది. ఈ ర్యాలీకి బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్‌లకు చెందిన వేలాది మంది సీపీఐ(ఎం) కార్యకర్తలు రైళ్లు, ఇతర వాహనాల్లో సోమవారమే రామ్ లీలా మైదాన్‌కు చేరుకున్నారు. రాజ్‌ఘాట్, జాకిర్ హుస్సేన్ కళాశాల పరిస రాల నుంచి పలువురు కార్యకర్తలు మంగళవారం ఉదయమే రామ్‌లీలా మైదాన్ వరకు ప్రదర్శన చేపట్టారు. ఉదయం 10గంటలకల్లా మైదాన్ ప్రజలతో నిండిపోయింది. వివిధ రాష్ట్రాల కార్యకర్తలు, జన నాట్య మంచ్ కార్యకర్తలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విప్లవ గీతాలు, వివిధ అంశాలపై నృత్య ప్రదర్శన చేశారు. ఈ ర్యాలీని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ ప్రారంభించారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు, లోక్‌సభ ఎంపీ అమ్రారామ్ దీనికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బేబీ మాట్లాడుతూ కమ్యూనిస్టు భావాలను నిర్మూలించవచ్చనేది సంఫ్‌ు పరివార్ భ్రమ మాత్రమేనన్నారు. అనంతరం పొలిట్‌బ్యూరో సభ్యులు తపన్‌సేన్, అశోక్ ధావ్లే, మరియం ధావలే, విజ్జూకృష్ణన్, కేంద్రకమిటీ సభ్యులు మహమ్మద్ యూసుఫ్ తరిగామి, విక్రమ్‌సింగ్, సుదీప్‌దత్తా, బీహార్ కార్య దర్శి లాలన్చౌదరి, హర్యానా కార్యదర్శి ప్రేమ్‌చంద్, పంజాబ్ కార్యదర్శి సుఖ్వీం దర్సింగ్ షెఖోన్ మాట్లాడారు. ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయిల్ దురాక్రమణ ను ఖండిస్తూ పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్.అరుణ్‌కుమార్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ. రాఘవులు, నీలోపాల్ బసు, సీనియర్ నాయకులు ప్రకాశ్కరత్, బృందా కరత్, సుభాషిణి అలీ, కె.హేమలత, రాజ్యసభ పక్షనేత జాన్ బ్రిట్టాస్ పాల్గొన్నారు.



