కొనుగోలుదారు అఫిడవిట్ ఇస్తే చాలు
దరఖాస్తుదారులకు మేలు జరిగేలా జీవో 76 : శాసన మండలిలో మాత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో 2020 నుంచి పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను వీలైంనంత త్వరితగతిన పరిష్కరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. శాసనమండలి సభ్యులు నెల్లికంటి సత్యం అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఆనాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం సాదబైనామాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించిందనీ, కానీ 2020 ఆర్.ఓ.ఆర్. చట్టంలో పరిష్కార మార్గం చూపించలేదన్నారు. భూ భారతి చట్టంలో ఈ సమస్యకు పరిష్కారం చూపించినట్టు తెలిపారు. అయితే కొనుగోలుదారు అమ్మకం దారు ఇద్దరి నుంచి అఫిడవిట్ తీసుకోవాలన్న నిబంధనతో క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. వీటిని దృష్టిలో పెట్టుకొని కొనుగోలుదారు నుంచి మాత్రమే అఫిడవిట్ తీసుకోవాలని నిర్ణయించామనీ, ఈ మేరకు జీవో 76ను విడుదల చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో 9 లక్షలకుపైగా దరఖా స్తులు పెండింగ్ లో ఉన్నాయనీ, వీటన్నింటికీ పరిష్కారం లభించబోతుందన్నారు.
ఆధార్ మాదిరిగానే భూధార్
నక్షా లేని 413 గ్రామాలకు గాను 5 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా రీ సర్వే నిర్వహించామనీ, ఇందులో ప్రతి సర్వే నెంబర్‌కు ఆధార్ నెంబర్ మాదిరిగానే భూధార్ కేటాయించామన్నారు. త్వరలో హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో 70 గ్రామాల్లో భూసర్వే నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. దశల వారిగా భూ సర్వే నిర్వహించి భూధార్‌ను ఇస్తామనీ, రాష్ట్రంలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని చెప్పారు.
అవినీతికి పాల్పడితే ఉపేక్షించబోం
ధరణి పోర్టల్‌లోని లోసుగులను ఆసరాగా చేసుకుని కొంత మంది మీ-సేవ నిర్వాహకులతో కలిసి రూ.3.99 కోట్ల ప్రభుత్వ సొమ్మును కాజేశారని మంత్రి పొంగులేటి తెలిపారు. దీనిపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించామనీ, తప్పుచేసిన వారి నుంచి ఆ సొమ్మును రికవరీ చేస్తామని ప్రకటించారు. ఇందులో అధికారుల పాత్ర ఉంటే ఏ స్థాయిలో ఉన్నా కూడా ఉపేక్షించబోమని తెలిపారు. శాసన మండలిలో సభ్యులు తాతా మధుసుదన్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, ధరణి పోర్టల్‌ను ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా అర్ధరాత్రి తీసుకొచ్చారని విమర్శించారు. దీంతో కొత్తగా భూ సమస్యలు పుట్టుకొచ్చాయని తెలిపారు. ధరణి పోర్టల్ లో 40, 41 మాడ్యుల్స్ ఉంటే భూ భారతి పోర్టల్‌లో 6కు కుదించామనీ, ధరణి పోర్టల్ అర్ధరాత్రి ఒక్కరోజు మార్చడం సాధ్యం కాదనీ, దశలవారీగా మార్పులు చేస్తున్నామన్నారు. ఈ ఏప్రిల్ చివరి నాటికి పూర్తి స్థాయిలో భూ భారతి పోర్టల్‌ను తెస్తామని మంత్రి తెలిపారు.
త్వరలో ”సాదాబైనామా” పరిష్కారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



