Wednesday, March 25, 2026
E-PAPER
Homeజాతీయంముసుగులన్నీ తొలగించేశారా ?

ముసుగులన్నీ తొలగించేశారా ?

- Advertisement -

బీజేపీ స్టాంప్‌తో ఈసీ లేఖపై సీపీఐ(ఎం) ప్రశ్న
తిరువనంతపురం :
ఎన్నికలకు సంబంధించిన మార్గదర్శకాలపై ఇటీవల రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్‌ పంపిన లేఖపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కేరళ శాఖ ముద్ర వుండడంపై సోమవారం కేరళలో పెద్ద వివాదం రేగింది. ఏప్రిల్‌ 9న కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ నామినేషన్లు దాఖలు చేయడానికి సోమవారమే ఆఖరు తేదీ. ఈ ఘటనపై సీపీఐ(ఎం) తీవ్రంగా స్పందించింది. ”సీళ్ళను (ముద్ర లేదా స్టాంప్‌లను) చాలా సర్వసాధారణంగా మార్చేస్తున్నారా! ” అని వ్యాఖ్యానించింది. బీజేపీ తన ముసుగులన్నింటినీ తొలగించేసిందా అని ప్రశ్నించింది. బీజేపీ ముద్ర వున్న 2019 మార్చి19 నాటి ఎన్నికల కమిషన్‌ లేఖ కాపీని సీపీఐ(ఎం) తన ఎక్స్‌ హ్యాండిల్‌లో షేర్‌ చేసింది. ”బీజేపీ అన్ని ముసుగులను తొలగించేసిందా ? కేంద్రంలోని అధికార కేంద్రమే ఎన్నికల కమిషన్‌ను, బీజేపీని రెండింటినీ నియంత్రిస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకవేళ అలా అయినా, కనీసం రెండు వేర్వేరు డెస్క్‌లనైనా నిర్వహించుకోవాలి. ఇప్పుడు అదంతా కూడా అనవసరం అనుకున్నట్లు కనిపిస్తోంది. సీల్స్‌ను కూడా చాలా సర్వసాధారణంగా మార్చేస్తున్నారు.” అని సీపీఐ(ఎం) కేరళ శాఖ ఆ ఎక్స్‌ పోస్టులో పేర్కొంది. ఆ లేఖ ప్రతిని, పార్టీలకు పంపిన ఇ మెయిల్‌ను ఆ పోస్టులో షేర్‌ చేశారు. చాలా పార్టీలకు ఇదే లేఖ అందిందని, ఇద్దరితో మాట్లాడి నిర్ధారించుకున్నామని తెలిపింది. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఈఓలకు ఈ లేఖ రాశారు. రాజకీయ పార్టీలు, అభ్యర్ధులకు సంబంధించి నేర చరిత్ర ప్రచారంపై ఈసీ మార్గదర్శకాలకు సంబంధించి ఈ లేఖ జారీ అయింది.
క్లరికల్‌ తప్పిదమేనన్న సీఈఓ
కాగా ఈ మొత్తం వ్యవహారమంతా కేవలం క్లరికల్‌ తప్పిదమేనని కేరళ సీఈఓ కార్యాలయం వివరణ ఇచ్చింది. పొరపాటున రాజకీయ పార్టీలకు తాజాగా ఆ లేఖ కాపీలను జారీ చేసినట్టు పేర్కొంది. తప్పుడు సందేశం ప్రచారం చేయవద్దని కోరింది.
‘అభ్యర్ధుల నేరచరిత్రను ప్రచురించడానికి సంబంధించి 2019 నాటి మార్గదర్శకాలపై వివరణ కోరుతూ ఇటీవల బీజేపీ కేరళ శాఖ, సీఈఓ కార్యా లయాన్ని ఆశ్రయించింది. వారి అభ్యర్ధనతో పాటూ, 2019 నాటి ఒరిజినల్‌ ఆదేశాలకు సంబంధించిన ఫోటోకాపీని కూడా ఆ పార్టీ అందచేసింది. వారిచ్చిన ఆ కాపీపై వారి పార్టీ స్టాంప్‌ వుంది. పొరపాటున, ఆ గుర్తును చూసుకోకుండా కార్యాలయం ఆ డాక్యుమెంట్‌నే తిరిగి అన్ని రాజకీయ పార్టీలకు జారీ చేసింది. వారు కోరిన వివరణ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఇది జరిగింది. 2019 నాటి నుంచి ఈ మార్గదర్శకాలన్నీ సవరించబడుతూ వచ్చా యి. వాటినే అన్ని రాజకీయ పార్టీలకు అందచేశాం. ఈ తప్పును గుర్తించిన వెంటనే చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ (సీఈఓ) కార్యాలయం దాన్ని అంగీకరించింది.”అని సీఈఓ వివరణ ఇచ్చారు. ఈ విషయంలో వివరణ ఇవ్వడంతో పాటూ సిఇఓ కార్యాలయంలోని అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ను దీనిపై విచారణ జరిగేవరకు సస్పెండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -