ఆగస్టు 28న తొలి మ్యాచ్, సెప్టెంబర్ 13న ఫైనల్
పూర్తి షెడ్యూల్ ఖరారు చేయని ఏసీసీ
ముంబయి : మహిళల ఆసియా కప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) వేదికగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఎనిమిది జట్లు పోటీపడే కాంటినెంటనల్ టోర్నమెంట్ ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 13 వరకు జరుగనుంది. ఈ ఏడాది ఆసియా కప్ ఆరో సీజన్ జరుగనుండగా ఆతిథ్య వేదికపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) స్పష్టత ఇవ్వలేదు. జులై 22న సభ్య దేశాలకు రాసిన లేఖలో ఆగస్టు 27న జట్లు ఆతిథ్య దేశానికి చేరుకోవాల్సి ఉంటుందని, సెప్టెంబర్ 13న టైటిల్ పోరు ఉంటుందని వెల్లడించింది. కానీ, టోర్నమెంట్‌కు ఆతిథ్యం అందించే దేశం, నగరాలపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ఏసీసీ అధ్యక్షుడిగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మెన్ మోషిన్ నక్వీ కొనసాగుతున్నారు. ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్ సెప్టెంబర్ 17 నుంచి 24 వరకు షెడ్యూల్ చేయటంతో త్వరలోనే ఆసియా కప్ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఆసియా క్రీడలకు భారత జట్టును ఎంపిక చేసిన బీసీసీఐ.. ఆసియా కప్‌ను దాదాపుగా అదే జట్టును ఖరారు చేసే అవకాశం ఉంది. శ్రీలంక డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా.. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మలేషియా, థాయ్‌లాండ్, యుఏఈలో ఈ టోర్నీలో పోటీపడనున్నాయి. గత ఆసియా కప్ ఫైనల్లో భారత్, శ్రీలంక పోటీపడగా.. శ్రీలంక చాంపియన్‌గా నిలిచింది. ఆసియా కప్, ఆసియా క్రీడలు వరుసగా ఉండటంతో పూర్తి షెడ్యూల్ త్వరగా ఖరారు చేయాలని ఏసీసీని సభ్య దేశాల క్రికెట్ బోర్డులు కోరుతున్నాయి.



