వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా..రైతన్నకు మాత్రం సాగు కష్టాలు తప్పడం లేదు.వారికి ప్రతీ సీజన్ ఓ గండం లానే ఉంటోంది. సకాలం లో వర్షాలు పడక, ప్రకృతి విపత్తులతో నష్టాలు ఒకవైపైతే.. మరోవైపు సకాలంలో యూరియా అందక అష్టకష్టాలు పడుతున్నారు. గత రెెండు పంటలకు ఎరువుల కొరతతో ఇబ్బందులు పడ్డా..వచ్చే వానాకాలం పంటకూ ఈ సమస్య తీవ్రతరం కానున్నట్లు తెలుస్తోంది. దీనికంతటికి పాలకుల నిర్లక్ష్యమే కారణం. మనది వ్యవసాధారిత దేశం. జనాభాలో అరవై శాతం వరకు ప్రత్యక్షంగా సాగుపై ఆధార పడి జీవిస్తుండగా. .పరోక్షంగా మరో ఇరవై శాతం వరకు ఉపాధి పొందుతున్నట్లు లెక్కలు. ఆ మేరకు ప్రభుత్వాలు సాగుకు ప్రాధాన్యత ఇచ్చి..బడ్జెట్లో ఈ మేరకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉండగా అత్తెసరు నిధులే కేటాయిస్తున్నాయి. దీనివల్ల రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదు.
సాగు ప్రారంభం మొదలు కొని పంట చేతికొచ్చే వరకు అనేక కష్ట నష్టాలు పడుతున్నారు. గడచిన రెండు పంటలకు యూరియా కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వచ్చే వానాకాలం సాగుకూ ఈ ఎరువుల కొరత మరింత తీవ్రతరం అయ్యే ప్రమాదం పొంచి ఉంది. దేశ వ్యాప్తంగా ఎరువుల కర్మాగారాల్లో ఉత్పత్తి గణనీయంగా తగ్గడంతో పాటు ఇతర దేశాల నుండి రైతులకు అవసరం మేరకు కేంద్రం దిగుమతికి చర్యలు చేపట్టక పోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా 2684.95 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నట్లు అంచనా. ఆయా పంటల సాగుకు 650 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అని గుర్తించినా..ఈ మేరకు మన దేశంలో ఉత్పత్తి చేయడం లేదు. చైనా, ఒమన్, ఖతార్, రష్యా, సౌదీ లాంటి దేశాల నుండి దిగుమతి చేసుకుంటోంది. భారత్‌లో ఆర్ఎఫ్సీఎల్ లాంటి ఫ్యాక్టరీల్లో ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య యుద్ధం వల్ల గ్యాస్ కొరత నెపంతో యూరియా ఉత్పత్తి గణనీయంగా తగ్గింది.
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తోంది. ఇందుకు కేటాయింపులే నిదర్శనం. క్రమ క్రమంగా యూరియా సబ్సిడీని తగ్గిస్తూ చివరకు ఎత్తివేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2025-26కు ఎరువుల రాయితీలకు కేంద్రం రూ. 1, 86, 460 కోట్లు కేటాయించగా 2026-27కు లక్షా 70 వేలా 805 కోట్లు మాత్రమే కేటాయించింది. రూ.15, 655 కోట్ల రాయితీని తగ్గించింది కేంద్ర సర్కారు. ప్రతీ సంవత్సరం యూరియా వినియోగం పెరుగుతుండగా ఎన్డీయే సర్కారు బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ వస్తోంది. రైతులు తమ పంటలకు అనవసరంగా ఎరువులు వినియోగిస్తున్నారని, ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని మోదీ సర్కారు ఉచిత సలహా ఇస్తోంది. అయితే..ఎరువుల వినియోగానికి ప్రత్యామ్నాయంగా జీవామృతం లాంటి వాటికి ప్రోత్సాహాన్ని ఇచ్చేలా బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. తెలంగాణలో ఈ వానాకాలం పంటలకు ఎరువుల ఇబ్బందులు తప్పేలా లేవు. ఖరీఫ్ సాగు ప్రారంభానికి మరో రెండు మాసాల కాలం ఉంది. ఇప్పటి నుండే రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆ మేరకు కేంద్రంపై ఒత్తిడి పెంచి స్టాక్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఖరీఫ్‌లో సుమారు కోటీ 30 లక్షల ఎకరాల పంటలు సాగయ్యే అవకాశాలున్నాయి.
ఇందులో సగానికి పైగా వరి, 40 లక్షల నుండి 50 లక్షల ఎకరాల వరకు పత్తి సాగు కానుంది. మొక్కజొన్న, పప్పు దినుసులు, ఉద్యాన వన పంటలు సాగు చేయనున్నారు రైతులు. వరి, పత్తి పంటలకు ఎక్కువ మొత్తంలో ఎరువులు అవసరం పడతాయి. మొత్తంగా 25 లక్షల టన్నులకు పైగా యూరియా అవసరం కానున్నట్లు రైతు సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం సంవత్సరం మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 12.7 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఈ ఏడాది ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. ఇక్కడి కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే మొత్తం యూరియాను తెలంగాణాకే కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. గతేడాది కూడా ఇదే తరహా డిమాండ్ వచ్చినా..మోడీ ప్రభుత్వం ససేమీరా అంది. దీంతో కేంద్రం నుండి దశల వారీగా వచ్చే యూరియా కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ సంవత్సరం గత రబీ కంటే ఎక్కువగా వానాకాలం పంటలకు యూరియా కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నందున.. పార్టీలకతీతంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి సకాలంలో ఇక్కడి పంటలకు యూరియా అందించాలని రైతులు కోరుతున్నారు.
చిలగాని జనార్ధన్
8121938106



