”పాలకులం కాదు, ప్రజాసేవకులం” ఈ మాటలన్నది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. అంతేకాదు, ”ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించడమే పరిపాలన లక్ష్యం” అన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాటలోనే తమ ప్రభుత్వం నడుస్తున్నదని చెప్పుకున్నారు. అవునా…? బడ్జెట్ సైజు పెద్దగా పెరగలేదు. ఉన్నదాంట్లో సర్దుబాట్లు. ప్రభుత్వ విధానాల్లో మౌలిక మార్పు ఏమైనా ఉన్నదా? దీర్ఘకాలిక పరిష్కారాలు ఏమి చెప్పారు? ఇదొక భాగం. వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. రెండేండ్లు గడిచినా, అమలు పాక్షికమే. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. రెండేండ్లల్లో భర్తీ చేసిన ఉద్యోగాలు 67,763. నిర్దిష్ట కాల పరిమితితో జాబ్ కేలండర్ కూడా ప్రకటిస్తామన్నారు. ఉద్యోగం వచ్చేవరకు నిరుద్యోగులకు నెలకు రూ.4వేలు భృతి, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పునరుద్ధరణ, పెన్షన్ రూ.4వేలకు పెంపు, కౌలు రైతులకు, వ్యవసాయ కార్మికలకు, ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.12వేలు మాటలుగానే మిగిలాయి. పీఆర్సీ, డీఏల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు నిరాశే మిగిలింది.
విద్యా, వైద్యం, మహిళా, ఇతర సామాజిక తరగతులకు ఈ బడ్జెట్లో కేటాయింపులు తగ్గించారు. దళితుల బడ్జెట్ రూ.4076 కోట్లు కోత పెట్టింది. దీర్ఘకాలిక పరిష్కారాలు చూపింది కూడా లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయడం, ఇతర సౌకర్యాలు కల్పించడం గురించి మాట్లాడకుండా, కేవలం ఎంపిక చేసిన కొన్ని పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరుతో ఊరించారు. 1500 మంది విద్యార్థులతో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల గురించి గొప్పలు చెప్పారు. మరోవైపు మోడీ ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యా విధానాన్ని తెలంగాణ లో కూడా అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అంటే, ప్రభుత్వ పాఠశాలలను కుదించడం, ప్రయివేటు పాఠశాలలను విస్తరించడమే ఈ బడ్జెట్ సారాంశం. ఇప్పటికే బ్రిటన్ నుంచి 13 పాఠశాలల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేస్తున్నది. లాభాలు బ్రిటిష్ వ్యాపారులు దండుకుంటారు.
”అమ్మ కలలు-పిల్లల చదువు… ఇదే తెలంగాణకు భవిష్యత్తు” అన్నారు భట్టి విక్రమార్క. పేద కుటుంబాల అమ్మ కలలు నెరవేర్చే పద్ధతి ఇదేనా? పైగా, ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని ప్రారంభిస్తామని, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కూడా ప్రవేశపెట్టబోతున్నామన్నారు. ముఖ్యమైన సబ్జెక్టులకు టీచర్లే లేనప్పుడు అల్పాహారం కోసం, మధ్యాహ్న భోజనం కోసం విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతారా? ఉన్నతవిద్య పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీలేదు. బోధన సిబ్బంది కొరత, అరకొర హాస్టల్ సౌకర్యాలతో ఉన్న విశ్వవిద్యాలయాలకు తగిన నిధులు కేటాయించకుండానే ఆక్స్ఫర్డ్, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీల స్థాయికి అభివృద్ధి చేస్తామని చెప్పుకున్నారు.
చికిత్స ఆధారిత వైద్యం స్థానంలో రోగ నిరోధక చర్యల వైపు ధృష్టి సారిస్తామన్నారు. రోగ నిరోధక చర్యలకు ఆర్థిక, సామాజిక పరిస్థితులు కీలకం. వాటిలో మౌలిక మార్పులు తెచ్చేందుకు బడ్జెట్లో ఏమీ కనిపించదు. పైగా, హెల్త్ ప్రొఫైల్ గురించి ప్రకటించారు. వ్యక్తిగతంగా, గోప్యంగా ఉంచుకుంటూ వైద్యులకు మాత్రమే చెప్పుకునే ఆరోగ్య సమస్యల చిట్టా ప్రభుత్వం దగ్గర ఉండాలంటున్నారు, ఎవరి ప్రయోజనం కోసం? గృహ నిర్మాణం గురించి ప్రజలను మరొకసారి మభ్య పెట్టారు. నాలుగు సంవత్సరాలుగా పేదలు ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం పోరాడుతున్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క జిల్లాలో కేవలం 1800 కుటుంబాలకు ఇండ్లు లేదా స్థలాల పట్టా కాగితాలు ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల గురించి రోజూ మాట్లాడుతున్నారు. బడ్జెట్లో మాత్రం రూ.1344 కోట్లు తగ్గించారు. ఇండ్లు ఎట్లా నిర్మిస్తారు? వ్యవసాయం సాగునీటి రంగాలకు రూ.1567 కోట్లు కోత విధించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే శ్వేతపత్రం ప్రకటించింది. తాము అబద్ధాలు చెప్పబోమని, వాస్తవ ఆర్థిక పరిస్థితి ప్రాతిపదికనే బడ్జెట్ రూపొందిస్తామని చెప్పింది. గత రెండేళ్ల బడ్జెట్లలో ఈ ప్రయత్నాలేమీ లేవు. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి నడుస్తున్న బాటనే, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడా అనుసరించింది. రాని ఆదాయం వస్తుందని చెప్పడం, కేటాయింపులు పెంచి చూపించడం అలవాటుగా మారింది. గత బడ్జెట్ అనుభవం కూడా ఇదే. రూ.3,04,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి, సవరించిన అంచనాల్లో రూ.22,850 కోట్లు తగ్గించారు. వాస్తవ ఖర్చు ఇంకా తగ్గుతుంది. ఈ మొత్తం సామాజిక రంగాల నుంచే కోతపెట్టడం గమనించవచ్చు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అది నిజమే. 2024-25లో రూ.4,698.42 కోట్లు, 2025-26లో రూ.19,569.21 కోట్లు చట్టబద్ధంగా విడుదల చేయాల్సిన నిధులు కూడా మోడీ ప్రభుత్వం విడుదల చేయలేదు.
వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడికి చేసిన ప్రయత్నాలు శూన్యం. ప్రజలను సమీకరించవచ్చు. అన్ని రాజకీయ పార్టీల సహకారంతో కేంద్రంమీద ఒత్తిడి తేవచ్చు. ఇవేవీ చేయకపోగా, యూనియన్ గవర్నమెంట్ కో-ఆపరేటీవ్ ఫెడరలిజం గురించి చెబుతున్న మాటలనే రాష్ట్ర పాలకులు కూడా చిలుక పలుకులుగా పలుకుతు న్నారు. కేంద్రాన్ని ఒప్పించే ప్రయ త్నాలను ఎవరూ కాదనరు. చర్చలతోనే మోడీ ప్రభుత్వం విజ్ఞత ప్రదర్శిస్తుందని రాష్ట్ర పాలకులు నమ్ముతున్నారా? బీజేపీ ప్రభుత్వం మీద రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత నమ్మకం ఉన్నదా? బడ్జెట్ సైజు పెరగాలంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పెరగాలి. ఆర్థిక వనరులు పెంచుకోగల అవకాశాలు ప్రధానంగా కేంద్రం చేతుల్లోనే ఉన్నాయి. బడాబాబుల మీద సంపద పన్ను, వారసత్వపు పన్ను, కార్పొరేట్ పన్నులు పెంచడం ద్వారా ఈ పని చేయవచ్చు. బడా పారిశ్రామికవేత్తల మీద పన్నులు పెంచడానికి బీజేపీకే కాదు, కాంగ్రెస్‌కు కూడా మనసొప్పదు. అందుకే కేంద్రం మీద ఒత్తిడికి సిద్ధపడరు.
”తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025” గురించి పంచరంగుల చిత్రం చూపించారు.
వందకు పైగా ఎంవోయూలు జరగాయన్నారు. రూ.5,75,000 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి విదేశీ సంస్థలు సుముఖత వ్యక్తం చేసాయన్నారు. ”సుముఖత” మాత్రమే సుమా! పెట్టుబడులు వచ్చినట్టు కాదు. రాష్ట్రంలో గాని, జాతీయ స్థాయిలో గాని ఇలాంటి ”సుముఖత”ల తర్వాత నిజంగా వచ్చిన పెట్టుబడులెన్నో రాష్ట్ర పాలకులకు తెలియకకాదు. ఇవి ఆచరణ రూపు దాల్చాలంటే, ఉత్పత్తులకు మార్కెట్ గ్యారెంటీ కావాలి. గత ఆరేండ్లుగా దేశంలో శ్రామికుల నిజ ఆదాయాలు పడిపోతున్నాయని ఆర్థిక సర్వే చెబుతున్నది. ఎగుమతులకు కూడా దారులు మూసుకుపోతున్న విషయం కనిపిస్తూనే ఉన్నది. ఏ నమ్మకంతో ఈ పెట్టుబడులు వస్తాయనుకుంటున్నారు? దేశంలో ఇప్పటికే వేల కోట్ల నిధులు బడాబాబుల దగ్గర పెట్టుబడులు పెట్టకుండా మూలుగుతున్న విషయం పాలకులకు తెలుసు. ప్రచార ఆర్భాటాలతో పరిష్కారం సాధ్యం కాదు కదా! సింగరేణి సంస్థ గురించి, జైనూర్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ గురించి ఆర్థిక మంత్రి పొగిడారు. ప్రజలు నవ్విపోతారన్న స్పృహ లేదు. సింగరేణి బొగ్గు బ్లాక్‌ల వేలం పాటకు కేంద్ర మంత్రితో పాటు, సహకరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నోట సింగరేణి మాట రావడం హాస్యాస్పదం.
ఈ రెండు సంస్థల అభివృద్ధికి చేస్తున్న ప్రయత్నాలు మాత్రం చెప్పలేదు. అభినందిస్తూనే అమ్మకానికి పెట్టడాన్ని ఏమనాలి? పిర్రగిల్లి బుజ్జగించడమే కదా? విద్యుత్ రంగానికి కేటాయింపులు పెంచకపోగా, రైతు డిస్కం ప్రారంభిస్తామన్నారు. ఇదే కదా అసలు మోసం. ప్రభుత్వ సబ్సిడీతో నడవవలిసిన వ్యవసాయానికి సరఫరాను వేరు చేసి నడ్డి విరిచే ప్రయత్నమే. మోడీ ప్రభుత్వం ప్రతిపాదనలను అమలు చేయడమే ఇది. మరోవైపు రైతులను విద్యుత్ వినిమయ దారులుగా కాకుండా, ఉత్పత్తుదారులుగా మారుస్తామని మభ్య పెట్టారు. ఆ మేరకు సోలార్ విద్యుత్ అభివృద్ధికి అదనంగా కేటాయించకపోగా, 326 కోట్లు తగ్గించారు.హైదరాబాదు అభివృద్ధి పేరుతో మూసీ సుందరీకరణ మీద కేంద్రీకరించారు. మూసీనది ప్రక్షాళణ, పునరుద్ధరణ మంచిదే. కానీ ప్రభుత్వం తలపెట్టింది అదికాదు. కేవలం హైదరాబాదు వరకు మూసీ అభివృద్ధి పేరుతో వేలాది కుటుంబాలను తొలగించి, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు ప్రణాళిక వేసారు. పర్యాటక కేంద్రం పేరుతో వ్యాపార ప్రయోజనాలకు పెద్దపీట వేసారు.
మరోవైపు ఫ్యూచర్ సిటీ పేరుతో అరచేతిలో స్వర్గం చూపించారు. 30వేల ఎకరాలు సేకరించే క్రమంలో ఏం జరుగుతుందో తేలవలసి ఉంది. స్కిల్ యూనివర్సిటీ గురించి గొప్పగా చెప్పారు. ఉన్న యూనివర్సిటీలన్నింటినీ స్కిల్ యూనివర్సిటీలుగా మార్చాలి కదా! పైగా, పారిశ్రామికవేత్తల ప్రయోజనం మేరకు, వారి భాగస్వామ్యంతోనే ఈ విశ్వవిద్యా లయం నడుస్తుంది. అంటే ఫీజులు కట్టగలిగేవారే చేరాలి. 57 పాలిటెక్నిక్ కళాశాలలను అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్స్‌గా మార్పు చేస్తామన్నారు. ఐటీఐల గురించి మాట్లాడలేదు. పాలకుల ఆలోచనలన్నీ ”ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” మీదనే తప్ప, ఉపాధి అవకాశాల పెంపుదల మీద కాదు. అంటే పారిశ్రామికవేత్తల ప్రయోజనాలే తప్ప, ప్రజా ప్రయోజనాలు కాదు. దేశంలో జీడీపీ వృద్ధిరేటు తగ్గుతున్న కాలంలో తెలంగాణలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగిందని చెప్పుకొచ్చారు.
అందులో శ్రామికులకు అందిన వాటా సంగతి చెప్పలేదు. దేశంలో సగటు తలసరి ఆదాయం కన్నా, రాష్ట్రంలో దాదాపు రెట్టింపు ఉన్నదన్నారు. పెరిగింది శతకోటీశ్వరుల సంపద, తగ్గింది శ్రామికుల ఆదాయం. ఈ రెండూ కలిపి సగటు తీస్తారు కదా! ఎవరిని మోసం చేయడం కోసం ఈ అంకెలు చెబుతున్నారు? బడ్జెట్ అంటే సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదంటూనే, అంకెల చుట్టే తిప్పారు. స్థూలంగా సాధారణ ప్రజలకు సంబంధించిన విషయాల్లో గత బడ్జెట్లకు ఏమాత్రం భిన్నంగా లేదు. బడ్జెట్ ఫోకస్ మొత్తం వ్యాపార ప్రయోజనాల వైపే. ప్రజల అసంతృప్తిని అణచేందుకు పోలీస్ వ్యవస్థను కూడా బలోపేతం చేస్తున్నారు. అందుకే గత బడ్జెట్ల కంటే ఇది భిన్నమైనదే. తెలంగాణ ప్రజలకు సవాల్ విసురుతున్న బడ్జెట్. ఈ సవాల్‌ను ఎదుర్కోవాల్సింది ప్రజలే. ప్రభుత్వ విధానాల దిశ మార్చవలసింది ప్రజలే.
ఎస్.వీరయ్య



