భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, గౌరవప్రద జీవన హక్కులకు హామీనిస్తుంది. శతాబ్దాలుగా సామాజికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడం కూడా అందులో భాగమే. కులవివక్ష, అంటరానితనం, ఆర్థిక వెనుకబాటు వంటివి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హక్కులు ఒక లక్ష్యంతో రూపుదిద్దుకున్నవి అయితే, మతం మార్పిడి చేసుకున్న వ్యక్తికి షెడ్యూల్ కులాల హక్కులు వర్తించవని భారత అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేయడం ఇప్పుడు అనేక సందేహాలకు తావిస్తోంది. ఓ కేసు సందర్భంగా చెప్పిన ఈ మాట మత మార్పిడి తర్వాత షె డ్యూల్ కుల హక్కులపై అనేక సందేహాలను లేవనెత్తింది. ఇది తుది తీర్పు కాకపోయినప్పటికీ సామాజిక న్యాయం దిశలో కీలకమైన ప్రశ్నలకు ముందుకుతెచ్చింది.
అసలు రిజర్వేషన్లకు మతానికి సంబంధం ఉందా? లేదంటే అది సామాజిక వాస్తవాల ఆధారానికి ప్రతిబింబమా? ఇదీ ఇప్పుడు జరుగుతున్న చర్చ. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు వ్యక్తి జీవన పరిస్థితులను మెరుగుపరచ డానికి ఉపయోగపడాలి కానీ, వాటిని పరిమితం చేయడానికి కాదు. సుప్రీంకోర్టు ఏ ఆలోచనతో మాట్లాడినా రిజర్వేషన్లను మతంతో అనుసంధానిం చడం సరైంది కాదనేది న్యాయ నిపుణుల భావన. దేశంలో అట్టడుగు నుంచి మొదలుకుంటే అగ్రస్థాయి వరకు కులవివక్ష ఏదో ఓ రూపంలో చాపకింద నీరులా కొనసాగుతున్న మాట వాస్తవం. ఒక వ్యక్తి క్రైస్తవ మతానికి మారినంత మాత్రాన అతను ఎదుర్కొనే సామా జిక వాస్తవాలు వెంటనే సమసిపోవు. దీన్ని కోర్టు గుర్తించకపోవడం అనడం కంటే, ఒక అభిప్రాయాన్ని వెల్లడి చేయడం రిజర్వేషన్లను పక్కనపెడుతున్నారనే భావనకు అవకాశం కల్పిస్తుంది.
షెడ్యూల్ కులాల రిజర్వేషన్లు భారత రాజ్యాంగంలోని సమానత్వ సూత్రాలపై ఆధారపడి ఉన్నాయి. తరాలుగా వెనుకబాటుతానికి గురైనవారికి అండగా నిలిచాయి. ఇది కేవలం న్యాయపరమైన సమస్యకాదు, సామాజిక అంతరాల అంశం. ఒకే కులానికి చెందిన ఇద్దరిలో ఒకరు మతం మార్చుకున్నారని హక్కులు నిరాకరించడం సమానత్వానికి పూర్తి విరుద్ధమవుతుంది. ఇంకా చెప్పాల్సి వస్తే మత స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చిన హక్కు. వ్యక్తి తన విశ్వాసాన్ని ఎంచుకునే స్వేచ్ఛను రక్షిస్తుంది. ఇప్పుడు మతం మారితే హక్కులు కోల్పోతామన్న భావన వస్తే పరోక్షంగా అతని స్వేచ్ఛను కూడా పరిమితం చేసినట్టే. అందుకే ఇలాంటి అంశాల్లో విస్తృతంగా, రాజ్యాంగపరమైన అంశాలన్నీ పరిశీలించి నిర్ధారణకు రావాలే కానీ, అభిప్రాయాల ద్వారా సామాజిక నిర్ణయాలను నిర్ణయించడం భావ్యం కాదు.
హిందూ సామాజిక వ్యవస్థలోనే కుల వ్యవస్థ ఉనికిలో ఉందని, క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కులగుర్తింపు వర్తించదనే న్యాయస్థానం భావనగా ఉంది. ఇది ఏ రకంగా చూసినా వాస్తవ పరిస్థితులకు పోలదు. ఎందుకంటే, భారత సమాజంలో కులం అనేది కేవలం మతానికే పరిమితం కాదు, అది అడుగడుగునా వేళ్లూనుకుని ఉన్న మర్రిచెట్టు. గ్రామీణ ప్రాంతాల్లోనూ, పట్టణాల్లోనూ, మతం మారిన వ్యక్తిపై ఉన్న కులముద్ర తొలగిపోదు. అయితే, వివక్ష రూపం మారవచ్చు, కానీ అంతరించదు. అధ్యయనాలు, కమిషన్లు కూడా ఈ విషయాలనే స్పష్టంగా చెప్పాయి. క్రైస్తవం లేదా ఇస్లాం మతంలోకి మారిన దళితులు కూడా సామాజికంగా అదే స్థితిలో కొనసాగుతారని, వారి జీవన పరిస్థితుల్లో పెద్దగా మార్పులేమీ ఉండవని పలు నివేదికలు పేర్కొన్నాయి. రిజర్వేషన్ల వ్యవస్థను రూపొందించినప్పుడు రాజ్యాంగ నిర్మాతలు ప్రధానంగా చెప్పిన విషయం -కుల ఆధారిత అణచివేతను రూపుమాపడం. ఇది కేవలం ఆర్థిక వెనుకబాటునే కాదు, సామాజికంగా వెనుకబడిన వర్గాల జీవితాలను సమానస్థాయికి తీసుకురావాలనే ప్రయత్నం.
అది రక్షణ అనడం కన్నా హక్కుగా గుర్తించడం అవసరం. న్యాయస్థానం ఇదే అభిప్రాయంతో ఉంటే గనుక అది అనేక వర్గాలపై ప్రభావం చూపడం ఖాయం. ముఖ్యంగా అణగారిన వర్గాల్లో విభజనకు దారితీస్తుంది. దళితుల ఐక్యతను బలహీనపరుస్తుంది. మతం ఆధారంగా వారి హక్కులను వేరుచేయడం సామూహిక శక్తిని తగ్గిస్తుంది. మొత్తంగా ఇది సామాజిక న్యాయపోరాటాన్నే ప్రశ్నార్థకం చేస్తుంది. ఇది అమలైతే భవిష్యత్తులో ఇతర వర్గాల హక్కులపై ఇలాంటి ప్రమాణాలు అమలు చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి మతాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే అది మరిన్ని హక్కులను పరిమితం చేస్తుంది. అందుకే ఇలాంటి కీలక విషయాలను ఒక నిర్దిష్ట కేసు పరిశీలన ఆధారంగా నిర్ణయానికి రావడం సరైంది కాదనే భావన అన్ని వర్గాల నుంచి వస్తోంది. దీనిపై సమగ్రంగా విచారణ జరిపి, సామాజిక వాస్తవాలను పరిగణలోకి తీసుకోవాలి. సమా జంలో నిజమైన సమానత్వం సాధించాలంటే, రిజర్వేషన్లను మతంతో ముడిపెట్టకుండా క్షేత్రస్థాయి పరిస్థితులతో అనుసంధానించాలి.
మతం మారితే హక్కులు మాయమా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



