పదిరోజుల వ్యవధిలోనే నాలుగు విగ్రహాలు ధ్వంసం
దళిత ఓట్లలో చీలిక కోసం బీజేపీ రాజకీయాలు!
భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహాలకు రక్షణ కరువు
యోగి ప్రభుత్వంపై నెటిజన్ల విమర్శలు
లక్నో : భారత రాజ్యాంగ నిర్మాత, అపర మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్‌ను బీజేపీ తీవ్రంగా అగౌరవపరుస్తోంది. దళిత గౌరవం, సమానత్వం, సామాజిక న్యాయం ప్రతీక అయిన అంబేద్కర్ విగ్రహాల ధ్వంసం ఘటనలు బీజేపీ పాలిత రాష్ట్రం యూపీలో వరుసగా పెరిగిపోతున్నాయి. మార్చిలోనే ఇలాంటి ఘటనలు నాలుగు చోటు చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 2027లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు దళిత ఓట్లలో చీలిక కోసం బీజేపీనే ఇలాంటి ‘విధ్వంస’ రాజకీయాలు చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటు యోగి సర్కారు పైనా సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూపీలో అంబేద్కర్ విగ్రహాల ధ్వంసం ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మార్చిలో నాలుగు విగ్రహాలు ధ్వంసం అయ్యాయి. మీరట్ జిల్లా భగవాన్‌పూర్ గ్రామంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఒక విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
విగ్రహం నుంచి తలను వేరు చేశారు. ఒక వారంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాల్సి ఉండగా.. అంతలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం అక్కడి స్థానికుల్లో తీవ్ర ఆందోళనను కలిగించింది. అయితే ఈ దాడి ఘటనకు బీజేపీకి అనుబంధంగా ఉన్న పెత్తందారీ కులాలకు చెందిన వ్యక్తులే కారణమని అక్కడి గ్రామస్థులు చెప్తుండటం గమనార్హం. ఈ ఘటన స్థానిక బీజేపీ నాయకుల మధ్య అంతర్గత విభేదాల ఫలితమని గ్రామస్థుడు ఆనంద్‌పాల్ అన్నారు. దళిత ఓట్లను ఆకర్షించడానికి కొందరు హిందూత్వ నాయకులు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారనీ, కానీ మరో వర్గం దాన్ని ధ్వంసం చేసిందని చెప్పారు. దళితుల ఓట్ల కోసం అంబేద్కర్ పేరును రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నించిన బీజేపీ.. ఇప్పుడు ఆయనకు అవమానం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై గ్రామంలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి.
గతంలో జరిగిన ఘటనలు
ఈనెల 22న అలహాబాద్ జిల్లాలోని రతౌరా గ్రామంలో కొందరు దుండగులు మరొక అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు. ఈనెల 20న ఘాజీపూర్ జిల్లాలోని డిల్లా గ్రామంలోనూ అంబేద్కర్ విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పోలీసులు ఇప్పటికీ నిందితులను పట్టుకోలేకపోయారు. మార్చి 14న లఖింపూర్ ఖేరీ జిల్లాలోని పిపారా మారోడా గ్రామంలో కూడా అంబేద్కర్ విగ్రహం ధ్వంసమైంది.
యోగి సర్కారు నిర్లక్ష్యం
అంబేద్కర్ విగ్రహాల ధ్వంసం వరుస ఘటనలపై అక్కడి స్థానికులు, రాజకీయ పార్టీల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో అంబేద్కర్ కు ఇంత అవమానం జరుగుతున్నా.. నిందితులను పట్టుకొని శిక్షించడంలో యోగి ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని అంటున్నారు. ఇక నెటిజన్లు బీజేపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సహజంగానే బీజేపీకి దళితులంటే చిన్న చూపనీ, ఇందులో భాగంగానే అంబేద్కర్‌కు ఉద్దేశపూర్వకంగానే అవమానాన్ని కలిగేలా చేస్తోందని విమర్శిస్తున్నారు.
ఇలాంటి ఘటనలను పోలీసులు సీరియస్‌గా తీసుకోవడం లేదు. చాలా ఘటనలు జరిగినప్పటికీ.. అరెస్టులు జరగడం లేదు. నిరసనలు చేసిన తర్వాత ప్రజలు అలసిపోయి వెళ్లిపోతారు, ప్రభుత్వం వాటిని త్వరగా మర్చిపోతుంది.
-నీరజ్ పాసి, బీఎస్పీ నాయకుడు
గతంలో పెత్తందారీ కులాల వ్యక్తులు ఈ విగ్రహాలను ధ్వంసం చేసేవారు. ఇప్పుడు దళిత ఓట్లు కోల్పోతామన్న భయం రాజకీయ పార్టీల్లో నెలకొంది. ఇలాంటి అభద్రతా భావంతో వారే అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసి దళిత ఓట్లలో చీలిక తెచ్చే చర్యలకు దిగుతున్నారు.
-ఓ పోలీసు అధికారి, లక్నో



