Friday, March 27, 2026
E-PAPER
Homeమానవిసంగీతమే ఆమె ప్రపంచం

సంగీతమే ఆమె ప్రపంచం

- Advertisement -

సంగీతమంటే ఆమెకు ప్రాణం. బాల్యం నుండి స్వరాలతో కలిసి పెరిగారు. తల్లి నుండి సాహిత్యాన్ని తండ్రి నుండి సంగీతాన్ని స్వీకరించి తనలోని ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అదే ప్రపంచంగా ఎంతో మంది కళాకారులను తీర్చిదిద్దుతున్నారు. ఆమే మహాభాష్యం అమృత. సంగీత కళాకారిణిగా సమాజానికి తన వంతు సేవలు అందిస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…

మహాభాష్యం వారిది సంగీత కుటుంబం. ఆ ఇంట్లో మొదటి కళాకారిణి పెరిందేవమ్మ. హార్మోనియం వాయిస్తూ సంగీత పాఠాలు చెబుతుండేవారు. వారి పెద్ద కొడుకు చిత్తరంజన్‌ మహాభాష్యం గురించి తెలియని వారు ఉండరేమో. లలిత సంగీత చక్రవర్తి, వాగ్గేయకారులు. వీరి సతీమణి పద్మిని గొప్ప రచయిత్రి, వక్త. ఉభయ భాషా ప్రవీణ. వీరికి ముగ్గురు అమ్మాయిలు. విజయలక్ష్మీ , వందన, అమృత.

బాల్యం నుంచే…
మహాభాష్యం వారింట్లో అందరూ పాడుతారు. నిత్యం సంగీతంతో ఆహ్లాదకరంగా ఉండే మహాభాష్యం వారింట ఒక బాల మేధావి జన్మించింది. ఆ చిన్నారి పేరు అమృత మహాభాష్యం. అతి చిన్న వయసులోనే రాగాలు గుర్తుపట్టి వాటి పేర్లు చెప్పడం, అక్షరాలు కూడా రాని వయసులో స్వరాలు చెప్పడం ఆ చిన్నారికి ఎలా సాధ్యమైందో మరి. ఐదేండ్ల చిరు ప్రాయంలో కళ్యాణి రాగంలో అనర్గళంగా రాగాలాపన చేస్తుండడం చూసి ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఆమెలోని నైపుణ్యానికి మెరుగులు దిద్దడం కోసం రేవతి రత్న స్వామి వద్ద సంగీతం నేర్పించడానికి తీసుకువెళ్లారు. ఆవిడ చిన్నారి అమృతను రకరకాలుగా పరీక్షించి, ఆమెలోని ప్రతిభను మెచ్చుకొని ఎంతో ప్రేమతో సంగీత విద్య నేర్పించారు. అలా సంగీత ప్రయాణం మొదలుపెట్టి, అటు తర్వాత ప్రొఫెసర్‌ ఎస్‌.కె. వెంకటాచారి వద్ద కూడా సంగీతం నేర్చుకున్నారు.

మరో ప్రపంచం లేదు
అతి చిన్న ప్రాయం నుండే స్కూల్‌లో, బాలానందం, కళాసాగరం వంటి ఎన్నో సంస్థలలో కర్ణాటక సంగీతం, లలిత సంగీత, సినిమా పాటల పోటీలు, పద్య పఠనం లాంటి ఎన్నో పోటీలలో బహుమతులు పొందారు. అంతే కాక ఇంటర్‌ స్కూల్‌ కాంపిటీషన్‌లో తన పాఠశాల తరపు న కూడా బహుమతులు గెలుపొందారు అమృత. అయితే చదువు లేదా సంగీతం తప్ప మరో ప్రపంచం ఎరుగని విధంగా సాగింది ఆమె బాల్యం. ఆకాశవాణి, దూరదర్శన్‌ లో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. తన తండ్రి చిత్తరంజన్‌ వద్ద లలిత సంగీతం, గురువుల వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం వల్ల అన్ని రకాల పాటలు పాడగలిగే నైపుణ్యాన్ని సంపాదించారు.

సంగీత దర్శకత్వం
తండ్రి ఏ పాట స్వరపరిచినా అమృతకు మొట్టమొదటగా పాడి వినిపించే వారట. ఆమె విని ఏదైనా సలహా చెప్పినా చాలా ఆనందంగా స్వీకరించి మార్పులు చేసేవారట. అమృతలోని సృజనాత్మకత, పరిశీలనా శక్తి ఆయనకు బహుమక్కువ. ఆయన స్వర రచనలే కాక, ఆయనకు సంగీత దర్శకత్వంలో కుడి భుజంగా ఉంటూ ఎన్నో మేళకువలు నేర్చుకున్నారు అమృత. కేవలం గాయని మాత్రమే కాదు పదేండ్లకే లలిత గీతాలకు బాణీ కట్టడం ఆరంభించారు. తండ్రి తర్వాత ఆయన లాగే గాయనిగా, స్వరకర్తగా పేరు తెచ్చుకున్నారు. తన తల్లితో సహా ఎందరో గీత రచయితల గీతాలకు బాణి కట్టడం ‘ప్రహ్లాద విజయం’, ‘గిరిజా కళ్యాణం’, ‘వందేమాతరం’ వంటి నాట్య రూపకాలకు సంగీతం అందించారు. పాటకు బాణీ కట్టడంతో పాటు వాటికి చాలా ఆకర్షణీయమైన వాద్య సంగీతం రూపొందించడం కూడా వీరి ప్రత్యేకత. అన్నమాచార్య సంకీర్తనలు, లలిత గీతాలు, ఇవేకాక ఎన్నో వైవిధ్యభరితమైన సంగీతం వీరి ప్రత్యేకత.

బహుముఖ ప్రజ్ఞాశాలి
తల్లి నుండి సాహిత్యం, తండ్రి నుండి సంగీతం.. రెండింటిలో ప్రతిభను పొందారు అమృత. తొమ్మిదేండ్ల వయసు నుండి కవితలు, కథానికలు, నాటకాలు రాస్తూ సాహిత్య రంగంలో కూడా ప్రతిభను చాటుకున్నారు. కొన్ని పాటలు కూడా రాశారు. వ్యాసాలు, కథలు రాయడమే కాదు, అనర్ఘళంగా స్టేజి మీద అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడగలరు. ఎన్నో కార్యక్రమాలకు, అందులోనూ సంగీత కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా బహు చక్కగా వ్యవహరించారు. తెలియడం వేరు, చాలా సులువుగా తెలియ చెప్పడం వేరు. సంగీత, సాహిత్యంశాల గురించి ఎన్నో విషయాలు విశ్లేషణాత్మకంగా, ఆహ్లాదకరంగా చెప్తూ ఉపన్యాసాలు కూడా ఇచ్చారు వీరు. ఎందరికో సంగీత విద్యను నేర్పిస్తూ, తీర్చిదిద్దుతూ, గాయనిగా, సంగీత స్వరకర్తగా ఎదుగుతూ ఎందరికో స్ఫూర్తిదాయకమై నిలుస్తున్నారు అమృత మహాభాష్యం.

పురస్కారాలు
ఈమె కర్ణాటక సంగీతంలో ఎంఏ చేశారు. చదువులోనూ టాపర్‌. అలాగే సీఎంఏ, ఎంబీఏ (ఫైనాన్స్‌) చదువుకున్నారు. సంగీతంలో అమృతకు దక్కిన సన్మానాలు, బిరుదులు ఎన్నో. లలిత సంగీత పురస్కారం – రసమయి సంస్థ (2017), మధుర గాయని- రాగ రాగిణి ఆర్ట్స్‌ అసోసియేషన్‌ (2017), ఉత్తమ స్వరకర్త’ – లైన్స్‌ క్లబ్‌ ఇంటర్‌నేషనల్‌ (2018) సంగీతామృత నిధి’… అంతేకాక బాలానందం, నవ్య నాటక సమితి, కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌ వారిచేత అనేక సన్మానాలు అందుకున్నారు. తన గాన మాధుర్యంతో శ్రోతలను ఆకట్టుకోవడమే కాక, సంగీతం సమకూర్చడంలో ప్రావీణ్యం కనబరుస్తున్నారు. ఇలా సంగీతాన్నే తన ప్రపంచంగా మలచుకుని మహాభాష్యం వారి 4వ తరాన్ని కూడా సంగీతంలో తీర్చిదిద్దుతున్నారు. ఫుల్‌ టైమ్‌ గాయనిగా తండ్రి బాటలోనే నడుస్తున్నారు.

మెళకువలు నేర్పిస్తూ…
కర్ణాటక సంగీతం, లలిత సంగీతం మాత్రమే కాదు సినిమా పాటలు కూడా పాడడంలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు అమృత. గాయనీ గాయకులకు పాడడానికి కావలసిన మెళకువలు నేర్పిస్తూ తీర్చి దిద్దుతారు. వీరి వద్ద సంగీతం నేర్చుకున్న ఎందరో వివిధ పాఠశాలలో సంగీతం టీచర్లుగా పని చేస్తూ ఉపాధిని పొందుతున్నారు. 25 ఏండ్లకు పైగా గడించిన అనుభవంతో విద్యార్థులు ఎన్నో కొత్త టెక్నిక్స్‌తో సంగీతం అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా నేర్పించడం వీరి ప్రత్యేకత. త్వరలో ఒక అకాడమీ ఏర్పరచి మరింత మందికి విద్యను అందించాలనే ఆలోచన చేస్తున్నారు.

  • అచ్యుతుని రాజ్యశ్రీ
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -