యుద్ధ విరమణ ఒప్పందం కోసం కాళ్లబేరానికి ట్రంప్
ఖమేనీ బృందమే రాజీకి వస్తానంటోంది
ఇరాన్ సుప్రీంలీడర్‌గా ఉండాలన్నారు : అమెరికా అధ్యక్షుడు
అంతా ఉత్తదే… వెనక్కి తగ్గం : ఇరాన్
వాషింగ్టన్ : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌లు చేపట్టిన యుద్ధం మొదలై నెల రోజులు సమీపిస్తోంది. అయితే వెనక్కి తగ్గేందుకు మాత్రం ఇరాన్ ససేమిరా అంటోంది. ఇందుకోసం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ డెడ్‌లైన్‌లు, చర్చలంటూ హెచ్చరికలు, విరుద్ధ ప్రకటనలు జారీ చేస్తున్నారు. అయితే ఇరాన్ మాత్రం వీటిని బేఖాతరు చేస్తోంది. ఇజ్రాయిల్, అమెరికాలపై ప్రతిదాడులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే వెంటనే చర్చలకు దిగాలని ట్రంప్ ఇరాన్‌కు అల్టిమేటం జారీ చేశారు. మరింత ఆలస్యం చేస్తే ”వెనక్కి తగ్గే అవకాశం ఉండదని, దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని” హెచ్చరిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడి ప్రకటన ప్రస్తుత ఉద్రిక్తతల మధ్య ఆయన మీద పెరుగుతున్న ఒత్తిడికి సంకేతంలా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. యుద్ధ విరమణ ఒప్పందం కోసం అమెరికా అధ్యక్షుడు ”బతిమిలాడు తున్నారని”, చర్చలను కేవలం ప్రతిపాదనలుగా మాత్రమే పరిశీలిస్తున్నారని ఇరానీయులు చెప్తున్నారు. అయితే ఇరానే స్వయంగా బతిమిలాడుతున్నదంటూ ట్రంప్ మైండ్‌గేమ్ ఆడుతున్నట్టు స్పష్టమవుతోందని విశ్లేషకులు చెప్తున్నారు. వార్‌ప్లేస్ ఇవ్వటానికి శ్రీలంక నిరాకరించటంతో భారత్‌ను పావుగా వాడుకునేందుకు ట్రంప్ కుయుక్తులు పన్నుతున్నట్టు వారు అభిప్రాయపడుతున్నారు.
హెచ్చరికకు ముందు ట్రంప్ వాదనలు
దాదాపు నాలుగు వారాలుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ఒక ఒప్పందానికి రావాలని కోరుకుంటోందనీ, యుద్ధాన్ని ముగించడానికి జరుగుతున్న చర్చలను టెహ్రాన్ అధికారులు బహిరంగంగా చెప్పడానికి భయపడి దాచిపెడుతున్నారని ట్రంప్ తన హెచ్చరికలకు కొన్ని గంటల ముందు పేర్కొన్నారు. కాగా, ఇరాన్ ఈ వాదనలన్నింటినీ తోసిపుచ్చింది. తాము ఎలాంటి చర్చలకూ సిద్ధంగా లేమని స్పష్టం చేసింది.
మరో మార్గాన్ని కూడా దిగ్బంధించొచ్చు :ఇరాన్
హార్ముజ్ జలసంధితోపాటు, బాబ్-ఎల్-మండబ్ జలసంధి అనే మరో మార్గాన్ని కూడా తాము దిగ్బంధించ వచ్చని ఇరాన్ పేర్కొంది. ఈ మార్గం ఎర్ర సముద్రం నుంచి హిందూ మహాసముద్రం, సూయజ్ కాలువకు చమురును అనుసంధానించడంలో సహాయ పడుతుంది. రవాణ కయ్యే ఖర్చులను తగ్గిస్తుంది. ఇది ఇరాన్ మద్దతుదారులుగా పరిగణించబడే యెమెన్, హౌతీల చేతుల్లో ఉంది. వారు ఈ మార్గంపై దాడి చేసి దిగ్బంధించగలరు. తమపై ఒత్తిడి లేదా సైనిక చర్య తీసుకుంటే ఈ మార్గాన్ని కూడా మూసివేయగలమని, దానితో చమురు ధరలు విపరీతంగా పెరగవచ్చని ఇరాన్ హెచ్చరిస్తోంది.
ఇరాన్ సుప్రీంలీడర్‌గా ఉండాలన్నారు : ట్రంప్ ప్రగల్భాలు
యుద్ధం ముగింపునకు సంబంధించి అమెరికాతో ఎలాంటి చర్చలూ జరగట్లేదని ఓవైపు ఇరాన్ చెబుతుండగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం చర్చలు కొనసాగుతున్నట్టు పదే పదే చెబుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై మరోసారి స్పందించిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రిపబ్లికన్ పార్టీ విరాళాల సేకరణకు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ట్రంప్ ఈ విధంగా మాట్లాడారు. ”ఇరాన్‌పై సైనిక విధ్వంసానికి పాల్పడ్డాం. ఈ యుద్ధంలో మేం భారీ విజయాన్ని సాధించబోతున్నాం.
ఇంతవరకూ పశ్చిమాసియాలో ఎవరూ చూడని విక్టరీ అది. ఇక, యుద్ధం ముగింపు విషయంలో మేం చర్చలు జరుపుతున్నాం. ఆ ఒప్పందం కోసం ఇరాన్ ప్రాధేయపడింది. కానీ, ఆ విషయాన్ని బయటకు చెప్పట్లేదు. ఎందుకంటే సొంత ప్రజల చేతుల్లోనే హత్యకు గురవుతామని భయపడుతోంది” అని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ తదుపరి సుప్రీంలీడర్‌గా ఉండాలని ఆ దేశ నేతలు తనను అడిగినట్టు ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే, అలాంటి పదవిని తాను కోరుకోవట్లేదని, అందుకే వారి అభ్యర్థనను తిరస్కరించానంటూ ప్రగల్భాలు పలికారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ సంయుక్త ఆపరేషన్ ప్రారంభించిన తొలిరోజే సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీని సుప్రీంలీడర్‌గా ఎన్నుకున్నారు. అయితే, ఇప్పటివరకు ఆయన బహిరంగంగా కన్పించలేదు. మరోవైపు, అమెరికా దాడుల్లో మొజ్తాబా తీవ్రంగా గాయపడ్డారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నాటో దేశాల నుంచి ప్రపంచంలోని అన్ని దేశాలూ ట్రంప్ యుద్ధవైఖరిని తూర్పారబడుతుంటే.. ట్రంప్ బుర్ర వేడెక్కుతోంది. అందుకే తమను ట్రాప్‌లో పడేయటానికి ఆయన వేస్తున్న ఎత్తుగడగా ఇరాన్ భావిస్తోంది. గతంలో ఓవైపు.. చర్చలు జరుగుతున్న దశలోనే.. ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా ఖమేనీని అమెరికా, ఇజ్రాయిల్ కలిసి హత్య చేసిన విషయం విదితమే. అందుకే ఇప్పుడు ఇరాన్ ఆచితూచి ట్రంప్ ఎత్తుగడల్ని చిత్తుచేసేలా వ్యూహాలు పన్నుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.



