భూసేకరణకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన రైతులు
రణరంగంగా పరిగి బస్టాండ్
రైతులను ఈడ్చుకు వెళ్లి వాహనాల్లో కూర్చోబెట్టిన పోలీసులు
చిరిగిన అన్నదాతల చొక్కాలు
మద్దతు తెలిపిన ఆయా పార్టీల నాయకులు
నవతెలంగాణ-పరిగి
ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో తమ జీవనాధారమైన భూములను లాక్కోవద్దంటూ భూ సేకరణకు వ్యతిరేకంగా కాడ్లాపూర్ రైతులు గురువారం వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలో ధర్నా నిర్వహించారు. కొడంగల్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, హైదరాబాద్ టూ బీజాపూర్ హైవేపై రైతులు బైటాయించి, నిరసనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనతో బీజాపూర్ హైవేపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రైతులను పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతులను పోలీసులు అరెస్టు చేసే క్రమంలో రైతుల చొక్కాలు చిరిగాయి. తమకు న్యాయం చేయాలని ఓ రైతు పోలీసు కాలు మొక్కి వేడుకున్నాడు.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామం శివారులో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం ప్రభుత్వం 1,197 ఎకరాల భూమిని సేకరించేందుకు పూనుకుంది. రాపోలు గ్రామంలో 610 ఎకరాలు.. ఇందులో పట్టా భూమి 101ఎకరాలు, అసైన్డ్ భూమి 507 ఎకరాలు, కాడ్లాపూర్ గ్రామంలో 587 ఎకరాలు.. ఇందులో పట్టా 159 ఎకరాలు, అసైన్డ్ 428 ఎకరాలు సేకరించేందుకు అధికారులు ఫిబ్రవరి 25వ తేదీ అసైన్డ్ ల్యాండ్ రైతులకు, మార్చి 21న పట్టా భూమి రైతులకు నోటీసులు ఇచ్చారు. రాపోల్ గ్రామంలో దాదాపు 285 మంది రైతులు, కడ్లాపూర్ గ్రామంలో 378 మంది రైతులు తమ భూమిని కోల్పోతుండటంతో ఆందోళనకు దిగారు.
అడ్డుకున్న పోలీసులు
రైతుల నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు, రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఓ రైతు తమ బాధను పట్టించుకోవాలని పోలీసుల కాలు మొక్కాడు. మహిళా రైతులు తమ భూములు పోతున్నాయంటూ తమకు సహకరించాలని కన్నీరు మున్నీరయ్యారు. కలెక్టర్, ఎమ్మెల్యే వచ్చేంతవరకూ ధర్నా విరమించేది లేదని భీష్మించి కూర్చున్నారు. పోలీసుల అత్యుత్సాహంతో కొందరు రైతులను ఈడ్చుకెళ్లి వాహనాల్లో కూర్చోబెట్టడంతో రణరంగంగా మారింది.
ఈ సందర్భంగా కొంతమంది రైతులను పోలీసులు పక్కకు తోసేశారు. దాంతో మహిళ రైతులు, మరికొందరు రైతులు పోలీసు వాహనాలకు అడ్డంగా పడుకున్నారు. ఓ మహిళా రైతు తమ తోటి రైతులను విడిచి పెట్టాలంటూ ఏకంగా పోలీస్ వాహనానికి తలబాదుకుంది. ఈ గుంజులాటలో కొంతమంది రైతుల చొక్కాలు చిరిగిపోయాయి. పరిస్థితి ఉధృతంగా మారడంతో చేసేది ఏమీ లేక పోలీసులు రైతులను వదిలిపెట్టారు. అక్కడి నుంచి రైతులు నేరుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే, అధికారులు తమకేమీ తెలియదంటూనే భూసేకరణ చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎలాగైనా తమ భూములు పోకుండా చూడాలని తహసీల్దార్‌ను వేడుకున్నారు. రెండు రోజుల్లో భూ సేకరణ రద్దు చేయకుంటే.. ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. ఈ పోరాటానికి సీపీఐ(ఎం), బీఆర్ఎస్, టీజేసీ నేతలు మద్దతు తెలిపి, ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వెంకటయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రవీణ్‌కుమార్, టీజేసీ నాయకులు ముకుంద నాగేశ్వర్, గ్రామ సర్పంచ్ పులేందర్ మాట్లాడారు. రైతులు భూమిని నమ్ముకుని జీవిస్తున్నారని తెలిపారు. 2013 చట్టం ప్రకారం సోషల్ ఇంపాక్ట్ అసైస్మెంట్ చేయకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా భూములు లాక్కోవడం దుర్మార్గమన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి వెంటనే కలెక్టర్‌కు చెప్పి భూసేకరణను ఆపాలని, లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.



