Friday, March 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంచిన్నారులకు నాణ్యమైన విద్య.. పోషకాహారం

చిన్నారులకు నాణ్యమైన విద్య.. పోషకాహారం

- Advertisement -

ప్రముఖ ఆర్థికవేత్త కార్తీక్‌ మురళీధరన్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి
సమగ్ర మానవాభివృద్ధి అంశంపై సమీక్ష
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పోషకాహారం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి తెలిపారు. సీఎంతో ప్రముఖ ఆర్థికవేత్త కార్తీక్‌ మురళీధరన్‌ గురువారం హైదరాబాద్‌లోని శాసన మండలి హాల్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు చర్చించారు. రాష్ట్రంలో 0-10 ఏండ్లలోపు పిల్లల్లో పోషకాహారం లోపం.. విద్యాభ్యాసన స్థాయి సామర్థ్య లోపాలకు సంబంధించి పలు నివేదికలను మురళీధరన్‌ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. చిన్న వయస్సులో పోషకాహారం లోపం వల్ల భవిష్యత్‌లో తలెత్తే ఆరోగ్య సమస్యలు.. ప్రాథమిక స్థాయిలో సరైన బోధన లభించకపోతే విద్యార్థి భావి జీవితంలో పడే మానసిక వేదనను ఆయన వివరించారు. వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన అంశాలను సీఎంకు సూచించారు. ఆయా అంశాలపై తాము ఇప్పటికే ప్రత్యేక శ్రద్ధ పెట్టామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతోపాటు అల్పాహారం పెట్టేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు చేసినట్టు వివరించారు.

అంగన్‌వాడీల్లో కార్యకర్తలు, ఆయాలతో పాటు పోషకాహారం అందజేసేందుకు అదనంగా మరొకరిని నియమించాలని మురళీధరన్‌ సూచించారు. అంగన్‌వాడీల్లో పిల్లలకు పోషకాహారం అందజేసేందుకు పోషణ సఖి పేరుతో మరొకరిని నియమించేందుకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మురళీధరన్‌ సూచించే అంశాలను కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌) పరిధిలోని 29 స్కూల్‌ కాంప్లెక్స్‌ల పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం అధికారులకు సూచించారు. ఆయనతో సమన్వయం చేసుకుని ఈ అంశంపై ప్రత్యేక నివేదిక రూపొందించి సమర్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్‌ సెక్రెటరీ వి.శేషాద్రి, సీఎం కార్యదర్శి మాణిక్‌ రాజ్‌, సీఎం స్పెషల్‌ సెక్రెటరీ అజిత్‌ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణాతో పాటు పలువురు ఉన్నతస్థాయి అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -