బీసీలను కాంగ్రెస్ మోసం చేసిందన్న తలసాని
ఖండించిన మంత్రి శ్రీధర్‌బాబు
ఐక్యంగా కొట్లాడుదాం : మంత్రులు పొన్నం, సీతక్క, వాకిటి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కల్పన’ మరోసారి శాసనసభలో చర్చనీయాంశమయింది. గురువారం సభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఈ వాగ్వాదం చోటుచేసుకుంది. బీసీ సంక్షేమంపై బీఆర్‌ఎస్ సభ్యులు తలసాని శ్రీనివాసయాదవ్ ‘బీసీలను కాంగ్రెస్ నమ్మించి మోసం చేసింద’న్న వ్యాఖ్యలు సభలో దుమారంరేపాయి. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పొందుపరచకుండా బీసీల రిజర్వేషన్లు సాధ్యం కావనే విషయం తెలిసినా.. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించలేదని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కమిషన్‌ను పరిగణలోకి తీసుకోకుండా అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపిందని గుర్తుచేశారు.
బీసీ రిజర్వేషన్లు రావనే విషయం తెలిసినా కాంగ్రెస్ సర్కారు ముందుకు పోవడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంకెన్నాళ్లు బీసీలు అడుక్కు తినాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లు అమలు కాకపోయినా రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. కాంట్రాక్టుల్లో బీసీలకు 42 శాతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సబ్‌ప్లాన్‌కు కేటాయించిన నిధులన్నీ బీసీల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని కోరారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న స్థానాల్లో బీసీలకు అవకాశం ఇవ్వాలని కోరారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందన్న తలసాని వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్‌బాబు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ చేపట్టిన బీసీ రిజర్వేషన్లు అంశాన్ని బీఆర్‌ఎస్ నిర్వీర్యం చేసేలా ప్రవర్తిస్తోందన్నారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆలోచన మేరకే బీసీ రిజర్వేషన్ల విషయంలో తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. ఈ ప్రయత్నం ఇంతటితో ఆపబోమని స్పష్టం చేశారు. ఇందుకు ప్రతిపక్షాల మద్దతు కోరారు. రాహుల్‌గాంధీ ఆలోచనా విధానం మేరకే రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను ప్రారంభించామంటూ మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి ఢిల్లీ వరకు అనేక ఉద్యమాలు చేసిందనిగుర్తుచేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ ధర్నాకు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ను ఆహ్వానించినా రాలేదని వారు విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల ప్రయత్నం అడుక్కునేది కాదని, పోరాటం ద్వారానే సాధ్యమని మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల విషయంలో అనేక ప్రయత్నాలు చేశామని చెప్పారు. వాటిని సైతం తప్పు పట్టడం సరైనది కాదన్నారు. అందరం ఐక్యంగా ముందుకు వెళ్దామని, రిజర్వేషన్‌లు సాధించుకుందామని కోరారు.



