Friday, March 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం2 నుంచి 5 మండలాల్లో ఇంటిగ్రేటెడ్‌ 'భూభారతి'

2 నుంచి 5 మండలాల్లో ఇంటిగ్రేటెడ్‌ ‘భూభారతి’

- Advertisement -

సర్వే నుంచి రిజిస్ట్రేషన్‌ వరకు అంతా ఒకే గొడుగు కిందకు
ఒక్క క్లిక్‌తో సమస్త భూ సమాచారం
ప్రతి సర్వేనెంబర్‌కు భూధార్‌ నెంబర్‌: సమీక్షలో మంత్రి పొంగులేటి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర భూపరిపాలనలో సరికొత్త శకం ఆరంభం కాబోతుందనీ, గత ప్రభుత్వ హయాంలో ధరణి తెచ్చిన చిక్కుముడులను విప్పుతూ, రైతులకు అత్యంత పారదర్శకంగా, సులభతరమైన సేవలను అందించడమే లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అందుకోసం కొత్తగా రూపొందించిన ఇంటిగ్రేటెడ్‌ భూభారతి పోర్టల్‌ (ఇంటిగ్రేటెడ్‌ డిజిటల్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌)ను వచ్చేనెల రెండో తేదీ నుంచి ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్టు ప్రకటించారు. గురువారం హైదరాబాద్‌లోని సచివాల యంలోని తన కార్యాలయంలో రెవెన్యూ, సర్వే, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌, ఎన్‌ఐసీ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచన మేరకు తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా భూపరిపాలన సేవలను మరింత వేగవంతంగా అందించడానికి రెవెన్యూ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ భూభారతి పోర్టల్‌ను అభివృద్ధి చేశామన్నారు. ప్రతి భూలావాదేవీ వివరాలు కనిపించేలా పారదర్శకంగా ఈ పోర్టల్‌ను రూపొందించామని వివరించారు. ఈ ఇంటిగ్రేటెడ్‌ భూభారతి పోర్టల్‌ను నారాయణ పేట జిల్లా కోస్గి, రంగారెడ్డి జిల్లా అమన్‌గల్‌, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి, ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలాల్లో వచ్చేనెల రెండో తేదీ నుంచి అమలు చేస్తామన్నారు. ఈ పైలట్‌ మండలాల్లో మెరిట్‌- డీమెరిట్‌లను క్షుణ్నంగా పరిశీలించి వాటికి అవసరమైన మార్పులు చేర్పులు చేసి రెండో దశలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేస్తామని వివరించారు.

ఇచ్చిన హామీ మేరకు ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని అన్నారు. వ్యవసాయ భూములకు సంబంధించి క్రయ, విక్రయదా రులకు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్‌ సమయంలో సర్వే మ్యాపును జతపరచే నిబంధనను ఈ ఐదు మండలాల్లో అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. తద్వారా రాష్ట్రంలో భూవివాదాలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ ఐదు మండలాల్లో ప్రతి సర్వే నెంబరుకు ఆధార్‌ నెంబర్‌ మాదిరిగానే భూధార్‌ నెంబర్‌ను కూడా ఇస్తామని అన్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా నక్షాలేని ఐదు గ్రామాల్లో రీసర్వే నిర్వహించి భూధార్‌ నెంబర్‌ను కేటాయించామన్నారు. ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజా కోణంలోనే ఉంటుందని అన్నారు. ఒక్క క్లిక్‌తో రైతులకు సంబంధించిన భూముల సమస్త సమాచారం లభించేలా ఇంటిగ్రేటెడ్‌ భూభారతి పోర్టల్‌ను రూపొందించామని చెప్పారు. ఆధార్‌ నెంబర్‌తో అనుసంధానమైన మొబైల్‌ నెంబర్‌ ద్వారా లాగిన్‌ అయిన వెంటనే కావాల్సిన సమాచారం లభిస్తుందన్నారు.

ఈ పోర్టల్‌లో సమాచారం సేవలు, సర్వే సేవలు, కరెక్షన్‌ సేవలు, అప్పీల్‌ సేవలు, రిజిస్ట్రేషన్‌ సేవలతోపాటు సిటిజన్‌ డాష్‌ బోర్డు సేవలకు సంబంధించి మైల్యాండ్‌ పోర్ట్‌ఫోలియో, నాలా ఆర్డర్లు, రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ వివరాలు, ఫీడ్‌బ్యాక్‌, సంబంధిత అధికారుల వివరాలు, ఆర్వోఆర్‌, భూధార్‌ నెంబర్‌, దరఖాస్తు వివరాలు, మ్యూటేషన్‌, ఈసీ, మార్కెట్‌ విలువ, విలేజ్‌ మ్యాప్‌, ప్రతి సర్వేనెంబర్‌కు మ్యాప్‌, ఆర్వోఆర్‌, గ్రామాల నక్షా, పాస్‌ బుక్‌ కరెక్షన్‌ వంటి పూర్తి సమాచారం లభించేలా మూడు విభాగాలను అనుసంధానం చేస్తూ భూభారతి పోర్టల్‌ను ప్రజలకు చేరువ చేయబోతున్నామని చెప్పారు. రిజిస్ట్రేషన్‌, ఇతర భూసేవలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి ఆ ప్రక్రియ పూర్తయ్యేవరకు ప్రతి స్టేజ్‌లో దాని వివరాలను తెలియజేస్తూ ఎస్‌ఎమ్‌ఎస్‌ ద్వారా ఖాతాదారునికి సమాచారం అందుతుందన్నారు. ధరణి పోర్టల్‌లో 36 మాడ్యూల్స్‌ ఉంటే భూభారతి పోర్టల్‌లో ఒకే చాప్టర్‌ కింద తెచ్చామన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి డిఎస్‌ లోకేశ్‌ కుమార్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఐజీ రాజీవ్‌ గాంధీ హనుమంతు, ఎన్‌ఐసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -