Monday, March 30, 2026
E-PAPER
Homeదర్వాజబాధ పడేవాళ్లను ఓదార్చి బద్నాం అయ్యాను

బాధ పడేవాళ్లను ఓదార్చి బద్నాం అయ్యాను

- Advertisement -

నీవు ఏదైనా అడుగు ఇస్తాను
మనుసులో జాగా మాత్రం అడగకు
అది జనాల తొక్కిసలాటలో చెల్లా చెదురైంది
శిథిలమైన ప్రాంగణం లోకి
నేను ఎవరినీ ఆహ్వానించను
ఇంకా ఏదైనా అడుగు
ప్రయాణంలో తోడుకోసం
నా నీడనో, చేతిలో చేయినో అడుగు
నన్ను నేను వదిలేసి, నీ వెంట వస్తాను
మారిపోయే లోకం గురించి నన్ను అడగకు
బాధపడే వాళ్లను ఓదార్చి ఓదార్చీ
చాలా బద్నాం అయిపోయాను
ఈ జాతరలో
నన్నెవరూ గుర్తు పట్టకపోవచ్చు
బాంసురీలు అమ్మే వాడి పాటలతో
నా కథ ప్రతి గుండెనూ తాకుతుంది
నేను అందరు కవుల్లాంటి కవిని కాదు
ఈ మనుషుల మధ్యన తప్పిపోయిన ప్రేమను
పిలిచి పిలిచి గొంతు ఎండిపోయింది
మనుసు వర్షం వెలిసిన ఆకాశంలా వుంది
నవ్వడం నవ్వించడం నాకు నేర్పించకు
నేను మనుషుల్లోంచి వచ్చాను,
ఏ పంజరాల్లోంచి తప్పించుకొని రాలేదు
నాకు ఎవరూ శత్రువులు లేరు
కోపం వచ్చినపుడు
నా మీద నేనే ప్రతీకారం తీర్చుకొంటాను
నగరాలు తిరిగి, ప్రేమలో పడి,
రాసుకున్న కథను గందరగోళం చేసుకొన్నాను
ఇప్పుడు జీవితం మీద, సమాజం మీద
స్వప్నాల్లాంటి బాధ్యతలు పెరిగాయి
ఇక ఎప్పుడైనా, ఏ తుఫాన్ల దాడైనా
నా ఆలోచనలను చెదర గొట్టలేవు

  • ఆశారాజు, 9392302245
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -