నవతెలంగాణ-హైదరాబాద్ : ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు 2027 వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఐర్లాండ్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన రెండో వన్డేలో 3 వికెట్ల తేడాతో విజయం సాధించి ఈ ఘనతను అందుకుంది. కెప్టెన్ రషీద్ ఖాన్ బంతితో, బ్యాట్‌తో అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆఫ్ఘనిస్థాన్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికా దేశాల్లో జరిగే ప్రపంచకప్ టోర్నమెంట్‌లో వరుసగా నాలుగోసారి తమ స్థానాన్ని ఖాయం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 47 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 128 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, తొమ్మిదో వికెట్‌కు గేవిన్ హోయ్ (36), జై మూంద్రా (31) రికార్డు స్థాయిలో 76 పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు.
అనంతరం 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్‌కు ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (71) అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. అయితే, ఐర్లాండ్ యువ లెగ్ స్పిన్నర్ గేవిన్ హోయ్ (4/34) అద్భుతమైన బౌలింగ్‌తో ఆఫ్ఘనిస్థాన్‌ను దెబ్బతీశాడు. మధ్య ఓవర్లలో వరుసగా వికెట్లు పడటంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది.
ఈ క్లిష్ట సమయంలో కెప్టెన్ రషీద్ ఖాన్ (37 నాటౌట్) ఒత్తిడికి తలొగ్గకుండా నిలబడ్డాడు. కీలకమైన ఇన్నింగ్స్ ఆడి మరో 5 ఓవర్లు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఆఫ్ఘన్ శిబిరంలో సంబరాలు మిన్నంటాయి.



