నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో సోమవారం జరిగిన సంతలో గుర్తు తెలియని దుండగులు సెల్ ఫోన్లు అపహరించారు. దీంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. కూరగాయలు కొందమని వస్తే మా జేబులకు చిల్లులు పెట్టి ఫోన్లు ఎత్తుకెళ్లిపోతున్నారని జనాలు వాపోతున్నారు. సెల్ ఫోన్ల దొంగతనం ఇప్పటిది కాదని, ఇంతకు ముంకు కూడా ఇదే తంతు ఉండేదని ప్రజలు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. ప్రస్తుతం సెల్ ఫోన్ లేకపోతే ఏ పనీ కావట్లేదని, ప్రతిదీ మొబైల్ తోనే ముడిపడి ఉందని అంటున్నారు.
ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు యూపీఐ ద్వారా పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయని, ఉన్న డబ్బులంతా అకౌంట్లలోనే ఉన్నాయని అంటున్నారు. జేబుల్లో ఎవరిదగ్గరా చిల్లిగవ్వకూడా కనిపించడం లేదని చెబుతున్నారు. ఇదే అదునుగా భావించిన దుండగులు మొబైల్ చోరీలకు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో బాదితులు ఫిర్యాదు చేశారు. వెంటనే దుండగులను పట్టుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృత్తం కాకుండా పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.



