డేటా సెంటర్లపై అమెరికాలో తీవ్ర వ్యతిరేకత
ప్రజాగ్రహాన్ని ప్రతిబింబించిన ప్రైమరీ ఎన్నికల ఫలితాలు
పలు రాష్ట్రాల్లో నిషేధ బిల్లులు
అయినా ట్రంప్ కంటికి మాత్రం అవి అద్భుతాలే
వాషింగ్టన్ : అమెరికాలో డేటా సెంటర్లపై వ్యతిరేకత రోజురోజుకూ తీవ్రమవుతోంది. వివిధ రాష్ట్రాలలో రెండు పార్టీలకూ చెందిన ప్రజా ప్రతినిధులు, రాబోయే మధ్యంతర ఎన్నికల బరిలో నిలుస్తున్న అభ్యర్థులు ఈ కేంద్రాల విస్తరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల దేశంలో జరిగిన ప్రైమరీ ఎన్నికలలో వెలువడిన ఫలితాలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. అయితే ‘ఊరంతా ఒక దారి… ఉలిపికట్టెది మరో దారి’ అన్న చందంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అధికారులు మాత్రం వాటిని గట్టిగా సమర్ధిస్తున్నారు. తాము డేటా సెంటర్లను కోరుకోవడం లేదంటూ పలు రాష్ట్రాలలో ఆందోళనలు ఉధృతమవుతున్నా పాలకులకు మాత్రం ఇదేమీ పట్టడం లేదు.
కాసుల పంట పండిస్తాయి : ట్రంప్
కొత్త డేటా సెంటర్ల నిర్మాణాన్ని నిలిపివేస్తూ న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్ గత నెలలో కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. దీనిపై ట్రంప్ మండిపడ్డారు. డేటా సెంటర్లు ‘పెద్దవి…బలమైనవి…సాహసోపేతమైనవి…డబ్బు సంపాదించే యంత్రాలు’ అంటూ ప్రశంసలు కురిపించారు. తక్కువ పన్నులతో రికార్డు స్థాయిలో ఉద్యోగాలను సృష్టించి కాసుల పంట పండిస్తాయని ఊదరకొట్టారు. డేటా సెంటర్లు పన్నులను తగ్గిస్తాయని, ఆస్తుల విలువను పెంచుతాయని గత వారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. ఏఐని నిరాకరించే ఏ సమాజమైనా పెద్ద తప్పు చేసినట్లే అని నిందించారు. అసలు డేటా సెంటర్ అంటేనే అద్భుతమైన విషయమని వ్యాఖ్యానించారు. వాటిని ఎవరైనా ఎలా వ్యతిరేకిస్తారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. డేటా సెంటర్ల నిర్మాణాన్ని మరింత కఠినంగా నియంత్రించడానికి చర్యలు తీసుకున్న టెక్సాస్‌పై నిప్పులు చెరిగారు. డేటా సెంటర్లు చమురు కంటే పెద్దవని చెప్పారు. తాను ఇప్పటి వరకూ చూసిన అత్యంత అద్భుతమైన భవనాలు డేటా సెంటర్లేనని, అవి రెండున్నర నుంచి మూడు మైళ్ల వరకూ విస్తరించి ఉంటాయని తెలిపారు.
అన్ని సర్వేలలోనూ అదే మాట
ట్రంప్, ఆయన అధికారులు ఎంతగా మెచ్చుకుంటున్నప్పటికీ డేటా సెంటర్లను మాత్రం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ చెబుతున్న ప్రతి మాట ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగానే ఉంది. జూన్‌లో రాయిటర్స్ – ఇప్సోస్ నిర్వహించిన పోల్‌లో నూతన డేటా సెంటర్ల నిర్మాణాన్ని నలభై ఐదు శాతం మంది వ్యతిరేకించారు. కేవలం 16 శాతం మంది మాత్రమే వాటిని సమర్ధించారు. నివాస ప్రాంతానికి పది మైళ్ల దూరంలో డేటా సెంటర్ ఉంటే ఏకంగా 59 శాతం మంది వ్యతిరేకించారు. పది శాతం మంది మాత్రమే సానుకూలత వ్యక్తం చేశారు. మార్చిలో గ్యాలప్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం…తమ ప్రాంతంలో డేటా సెంటర్లను నిర్మించవద్దని ప్రతి పది మందిలో ఏడుగురు తేల్చి చెప్పారు. తమ ప్రాంతంలో డేటా సెంటర్ల నిర్మాణాన్ని గట్టిగా సమర్ధించిన వారి సంఖ్య ఏ పోల్‌లో చూసినా మూడు నుంచి ఏడు శాతం దాటలేదు. 44 – 48 శాతం మంది వాటిని తీవ్రంగా వ్యతిరేకించారు.
తమ నివాస ప్రాంతానికి దూరంగా డేటా సెంటర్లు నిర్మించాలని రాయిటర్స్ పోల్‌లో పాల్గొన్న 77 శాతం మంది చెప్పారు. డేటా సెంటర్లు ఉద్యోగాలను సృష్టిస్తాయని, ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయని కేవలం యాభై శాతం మంది అమెరికన్లు మాత్రమే భావిస్తున్నారు. డేటా సెంటర్ల కారణంగా విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయని 77 శాతం మంది తెలిపారు. ప్యూ రిసెర్చ్ సెంటర్ మార్చిలో నిర్వహించిన పోల్‌లో మూడింట రెండు వంతుల మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. డేటా సెంటర్ల వలన కలిగే ప్రయోజనాల కంటే ఖర్చులే ఎక్కువగా ఉన్నాయని మే నెలలో మార్క్వెట్ లా స్కూల్ నిర్వహించిన పోల్‌లో 71 శాతం మంది చెప్పారు. ఏ పోల్‌ను విశ్లేషించినా అవన్నీ డేటా సెంటర్లపై ప్రజల వ్యతిరేకతకు అద్దం పడుతున్నాయి.
చైనాతో పోటీ పడాలంటే కావాల్సిందేనట
ఇటీవలి కాలంలో డేటా సెంటర్లను ట్రంప్ గట్టిగా సమర్ధిస్తున్నారు. కృత్రిమ మేధలో చైనాతో పోటీ పడాలంటే ఇవి చాలా కీలకమని, అంతేకాక అమెరికా సమాజాలకు ప్రయోజనకరమైనవని ట్రంప్ ఊదరకొడుతున్నారు. మార్చి నెలలో ట్రంప్ ప్రభుత్వం ‘రేట్పేయర్ ప్రొటెక్షన్ ప్లెడ్‌జ’ పేరిట ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. డేటా సెంటర్ల నిర్మాణం కారణంగా ప్రజలకు విద్యుత్ బిల్లులు పెరగబోవని హామీ ఇచ్చేలా వాటిని అభివృద్ధి చేసే వారిని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. డేటా సెంటర్లు విద్యుత్ బిల్లులను పెంచడం లేదని అధ్యక్షుడే స్వయంగా చెప్పారు కూడా. ‘డేటా సెంటర్లకు ప్రచారం కోసం కొంత సమయం అవసరం. ఎందుకంటే డేటా సెంటర్లు వస్తే విద్యుత్ బిల్లులు పెరుగుతా యని ప్రజలు అనుకుంటున్నారు’ అని అన్నారు.
ప్రధాన పార్టీలదీ అదే దారి
ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ అధికార రిపబ్లికన్లు, ప్రతిపక్ష డెమొక్రాట్ల పాలిత రాష్ట్రాలు చర్యలు చేపట్టాయి. పదిహేను రాష్ట్రాలలో డేటా సెంటర్ల నిర్మాణాన్ని నిషేధించే బిల్లులను ప్రవేశపెట్టారు. గత వారం కాన్సాస్‌లో జరిగిన రెండు పార్టీల గవర్నర్ ప్రైమరీ ఎన్నికలలో కూడా డేటా సెంటర్లే ప్రచారాంశం అయింది. ఈ రెండు ప్రైమరీలలోనూ డేటా సెంటర్ల విమర్శకులే విజయం సాధించారు. ఓహియాలో రెండు పార్టీల గవర్నర్ అభ్యర్థులు డేటా సెంటర్ల నిర్మాణాన్ని వ్యతిరేకించడం గమనార్హం. మిచిగాన్ ప్రైమరీలో విజయం తర్వాత డెమొక్రటిక్ పార్టీ సెనెట్ అభ్యర్థి, వామపక్ష వాది అబ్దుల్ ఎల్ – సయీద్, హౌస్ అభ్యర్థి విలియం లారెన్స్ ఈ సమస్యనే ప్రధానంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా వ్యతిరేకత ప్రబలుతున్నా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం తన ఒంటెత్తు పోకడను వీడడం లేదు.



