ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వాలకు ప్రాధాన్యం కావాలి : మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ప్రొఫెసర్ కె.నాగేశ్వరరావు
కార్మిక హక్కులను కాలరాసే విధానాలను విడనాడాలి : సీఐటీయూ
రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్
ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ మహాధర్నా
నవతెలంగాణ – ముషీరాబాద్
సేల్స్ ప్రమోషన్ రంగంలో శ్రమిస్తున్న ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, వారి సంక్షేమానికి ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ప్రొఫెసర్ కె. నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కంటే సాధారణ కార్మికుల సంక్షేమానికే ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. సేల్స్ ప్రమోషన్ ఉద్యోగుల హక్కులను చట్టబద్ధంగా రక్షించాలని, చట్టబద్ధమైన పని విధానాలను రూపొందించాలని కోరారు. సేల్స్ ప్రమోషన్ ఉద్యోగుల పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ.. సేల్స్ ప్రమోషన్ రంగం ఉద్యోగుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే గుర్తించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాక్రోచ్ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని డిమాండ్లను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల సంక్షేమం కంటే కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చే విధానాలను విడనాడాలని కోరారు. కార్మికుల హక్కులను హరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలను రూపొందిస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెడికల్ రిప్రజెంటేటివ్‌ల ప్రవేశంపై ఆంక్షలను తొలగించి స్వేచ్ఛగా పనిచేసే హక్కు కల్పించాలని అన్నారు. సేల్స్ ప్రమోషన్ ఉద్యోగులకు ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ విధానాన్ని వర్తింపజేయకూడదని కోరారు.
ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త ప్రధాన కార్యదర్శి కే బి కదమ్ మాట్లాడుతూ.. కార్మిక హక్కులను కాలరాసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా సేల్స్ ప్రమోషన్ ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు ఎఫ్‌ఎంఆర్‌ఏఐ ఆధ్వర్యంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. టీఎంఎస్‌ఆర్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాను కిరణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్‌లకు నిబంధనలు రూపొందిస్తున్న నేపథ్యంలో టీఎంఎస్‌ఆర్‌యూ సమర్పించిన అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నిబంధనలు రూపొందించాలని కోరారు. కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవ తీసుకుని సేల్స్ ప్రమోషన్ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉండే నిబంధనలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం టీఎంఎస్‌ఆర్‌యూ రాష్ట్ర కార్యవర్గ బృందం కార్మిక శాఖ మంత్రి, కార్మిక శాఖ కమిషనర్‌కు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను అందజేశారు. ఈ ధర్నాకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చికోటి శ్రీధర్ అధ్యక్షత వహించగా.. రాష్ట్ర ఉపాధ్యక్షులు విద్యాసాగర్, సంయుక్త ప్రధాన కార్యదర్శి గుండా శ్రీనివాస్, కోశాధికారి ఏ. నరసింహచారి, రాష్ట్ర కార్యదర్శులు దుర్గాప్రసాదరావు, సదానందచారి, లోకేశ్వర్‌రెడ్డి, వి. శ్రీనివాస్, సాగర్‌రెడ్డి తదితర యూనియన్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.
సేల్స్ ప్రమోషన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



