- ఆటోల పార్కింగ్‌కు మారిందా…?
-ప్రజల సౌకర్యమే లక్ష్యం…కానీ అమలు ఎక్కడ..? - నవతెలంగాణ-రాయికల్
- పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికులకు వేసవికాలంలో ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గత నెల 29న గ్రీన్ (షేడ్) నెట్‌ను ఏర్పాటు చేశారు.పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఎండలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.అయితే,వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు విరుద్ధంగా కనిపిస్తోంది.మధ్యాహ్న సమయంలో గ్రీన్ షేడ్ నెట్ కింద ఆటోరిక్షాలు వరుసగా పార్క్ చేయబడుతున్నాయి.
- దీంతో ప్రయాణికులు షేడ్ సదుపాయం ఉపయోగించుకోలేక,సమీపంలోని దుకాణాల ముందు లేదా రోడ్డుపక్కనే ఎండలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది.ముఖ్యంగా వృద్ధులు, మహిళలు,చిన్నపిల్లలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇంకా ఆశ్చర్యకర విషయం ఏమిటంటే,ఈ ఘటన మున్సిపల్ కార్యాలయానికి చాలా సమీపంలోనే చోటుచేసుకోవడం.అధికారుల కంటికి కనిపించే దూరంలోనే ఈ విధంగా నిబంధనలు ఉల్లంఘించబడుతున్నా, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
“ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన గ్రీన్ షేడ్… ఆటోల పార్కింగ్ కోసమేనా?” అంటూ స్థానికులు మండిపడుతున్నారు. ప్రజల సౌకర్యం కోసం తీసుకున్న చర్యలు సరైన విధంగా అమలు కాకపోతే వాటి ప్రయోజనం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి,షేడ్ ప్రాంతంలో ఆటోలు పార్కింగ్‌ను నిషేధించి,ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.అలాగే బస్టాండ్ పరిసరాల్లో ట్రాఫిక్ నియంత్రణ,పార్కింగ్ వ్యవస్థపై కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.ప్రయాణికుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలు నిజంగా వారికి ఉపయోగపడేలా ఉండాలంటే,సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.



