బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే మత అల్లర్లు : తమిళనాడు సీఎం స్టాలిన్
తిరుచిరాపల్లి : ‘తమిళనాడులో కుల ఘర్షణలు లేవు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోలా ఇక్కడ మత అల్లర్లు లేవు. ఉత్తరప్రదేశ్‌లోలా ఇక్కడ మూక హింస లేదు. మణిపూర్‌లోలా నిరంతర అశాంతి లేదు. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితులను సృష్టించేందుకు బీజేపీ పన్నిన కుట్రలను మేము భగం చేశాం. మా పాలనలో శాంతియుత వాతావరణం, సమర్థవంతమైన పరిపాలన కారణంగానే తమిళనాడులోకి పెట్టుబడులు నిరంతరాయంగా వస్తున్నాయి. దీనికి మద్దతుగా మేము ఒక వివరణాత్మక కార్యాచరణ ప్రణాళికను, ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశాం. నేను చేసిన ప్రకటనలన్నీ రాబోయే రోజుల్లో నెరవేరుస్తా. మేము చెప్పినట్లే చేస్తాం. చేసేదే చెబుతాం. నేను కరుణానిధి కుమారుడిని.’ అని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె స్టాలిన్ అన్నారు. తిరుచిరాపల్లి జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ‘పదేండ్లపాటు అధికారంలో ఉన్న ఏఐఏడీఎంకే తమిళనాడును పతనంవైపు నెట్టింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమిళనాడుకు ఎలాంటి నిధులు అందించలేదు. ఎడప్పాడి పళనిస్వామి తన బంధువులకు కాంట్రాక్టులు ఇవ్వటానికే ప్రభుత్వాన్ని నడిపారు’ అని అన్నారు. ‘గత ఐదేండ్లుగా తిరుచిరాపల్లి ప్రజల ప్రయోజనం కోసం రూ.26 వేల కోట్ల విలువైన సంక్షేమ పథకాలను అమలు చేశాం. అందుకే సముచితమైన విశ్వాసంతో మీ ఓటును అభ్యర్థిస్తున్నా. మా పథకాన్ని చూసి ఇతర రాష్ట్రాలు కూడా మహిళా హక్కుల భత్యం వంటి పథకాలను అమలు చేయడం ప్రారంభించాయి. మేం విద్యార్థుల కోసం అల్పాహార పథకాన్ని కూడా అందిస్తున్నాం. విద్యార్థులకోసం ప్రవేశపెట్టిన నాన్ ముధల్వన్ పథకం కూడా విజయవంతంగా అమలవుతోంది. ఈ ఎన్నికల్లో డీఎంకే, దాని మిత్రపక్షాల అభ్యర్థులందరికీ మద్దతు ఇవ్వాలి’ అని ఆయన ఓటర్లను కోరారు. గత ఎన్నికల్లో తిరుచిరాపల్లిలో డీఎంకే క్లీన్‌స్వీప్ సాధించిందని, ఈసారి కూడా ప్రజలు అదే తీర్పును పునరావృతం చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. మునుపటి విజయం వల్ల జిల్లాకు ఇద్దరు మంత్రులు లభించారని తెలిపారు.



