నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గ్రామ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన వివాదాల్లో నేరుగా కోర్టును ఆశ్రయించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇలాంటి అంశాలు ఎన్నికల పిటిషన్ ద్వారా సంబంధిత అధికారుల ముందే పరిష్కరించుకోవాలంది. పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనల ప్రకారం ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. కొమరంభీం అసిఫాబాద్ జిల్లా టి. సిర్పూర్ మండలం దోరపల్లి సర్పంచ్‌గా ఎన్నికైన తనకు 21 ఏండ్లు లేవని చెప్పి సర్పంచ్ పదవి నుంచి తొలగిస్తూ ఆర్డీవో ఇచ్చిన ఉత్తర్వులను సోయం సమీర హైకోర్టులో సవాలు చేశారు. తనను కాదని సర్పంచ్‌గా రాసపల్లి మంగక్కను ఆర్డీవో ఎంపిక చేయడాన్ని సవాల్ చేశారు. ఇది ఎన్నికల వివాదమనీ, ఎలక్షన్ పిటిషన్ వేసుకోవాలని జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ఇటీవల తీర్పు చెప్పారు. ఆర్డీవో ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని చెప్పి పిటిషన్‌ను కొట్టేశారు.
కేంద్రం కౌంటర్ వేయాలి
ఇంటర్ పోల్ ఆదేశాల మేరకు వెలువడిన రెడ్‌కార్నర్ నోటీసును సవాలు చేస్తూ కాంగ్రెస్ నేత కేవీపీ.రామచంద్రరావు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. కేంద్ర హోం, విదేశాంగ శాఖలు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌ను ఆదేశించింది. అమెరికా కోర్టులో ఎఫ్‌బీఐ పెట్టిన కేసులో 2014 ఏప్రిల్ 28న ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్‌ను జారీ చేసింది. దీనిపై కేవీపీ సవాలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ తుకారాంజీ విచారించారు. నాడు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ కుట్రతో పెట్టిన కేసనీ, కేంద్రం కౌంటరు దాఖలు చేయలేదని పిటిషనర్ వాదించారు. గతంలోని స్టేను ఎత్తివేయాలని సీబీఐ కోరింది. కౌంటర్లు వేస్తామని కేంద్రం చెప్పింది. దీంతో విచారణ మూడు వారాలకు వాయిదా పడింది.
కొడుకులతో పాటు కూతుళ్లు బాధ్యుల
తల్లిదండ్రుల్ని చూడాల్సిన బాధ్యత కొడుకులతోపాటు కూతుళ్లకు కూడా ఉంటుందని హైకోర్ట్ పేర్కొంది. తన కొడుకు పట్టించుకోవడం లేదనీ, ఆస్తి తమ పేరిట తిరిగి బదలాయించేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ సూర్యాపేట జిల్లాకు చెందిన వ్యక్తి వేసిన పిటిషన్‌ను జస్టిస్ బి.విజరుసేన్‌రెడ్డి విచారించారు. దీనిపై వివరాలివ్వాలని సూర్యాపేట జిల్లా అధికారులను ఆదేశించారు. అయితే తల్లి దండ్రులు రాజీ ప్రయత్నాలు చేసిన తర్వాతే కోర్టుకు రావాలని సూచించారు. విచారణను ఈనెల 15వ తేదీకి వాయిదా వేశారు.
ఎన్నికల ట్రిబ్యునల్‌లో తేల్చుకోండి : హైకోర్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



