– అమరావతికి వ్యతిరేకం కాదంటూనే జగన్ కొత్త ప్రతిపాదన
– దేశంలోనే అతిపెద్ద కుంభకోణం
– అన్నిటిపైనా విచారణ జరిపిస్తాం
– నిధులన్నీ ఒకేచోట పెడితే ఇతర ప్రాంతాలకు నష్టం
అమరావతి : అమరావతికి వ్యతిరేకం కాదంటూనే ప్లాన్-బి పేరిట వైసిపి అధినేత జగన్ కొత్త ప్రతిపాదన చేశారు. తాడేపల్లిలో వైసిపి కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన పోర్టు సిటీ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుల హైవేలను కలుపుతూ కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలని అన్నారు. మచిలీపట్నంలోని ‘మ’ విజయవాడలోని ‘వి’ గుంటూరులోని ‘జియుఎన్-గన్’లను తీసుకుని మావిగన్ అని పేరు పెట్టాలని సూచించారు. ఆ పేరులో ‘గన్’ ఉందనుకుంటే వేరే పేరు ఏదైనా పెట్టవచ్చని అన్నారు. మచిలీపట్నం నుండి విజయవాడ; విజయవాడ నుండి గుంటూరు మధ్య ఇప్పటికే 110 కి.మీ హైవే ఉందని, ఈ హైవేకు అటుఇటూ క్యాపిటల్ కారిడార్‌గా ప్రకటిస్తే మంచి గ్రోత్ ఇంజిన్ తయారవుతుందని ప్రభుత్వానికి సూచించినట్లు చెప్పారు. రాష్ట్రంలో అమరావతి అభివృద్ధి పేరుతో పెద్దఎత్తున కుంభకోణం జరుగుతోందని, ఒకేచోట రెండు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించడం అంటే రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు పూర్తిగా అన్యాయం చేయడమేనని అన్నారు. దీనికి బదులుగా తాము సూచించినట్లు చేస్తే తక్కువ మొత్తం ఖర్చు కావడంతో పాటు, స్కామ్‌లు చేయాల్సిన అవసరం కూడా ఉండదని చెప్పారు. గతంలోనూ తాము అమరావతిని వ్యతిరేకించలేదని, ఒకేచోట నిధులు ఖర్చు పెట్టడంవల్ల ఉపయోగం లేదనే చెప్పామని అన్నారు. అందువల్లే అభివృద్ధి చెందిన పోర్టుసిటీ విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించామని అన్నారు. అమరావతిని శాసన రాజధానిగా కర్నూలును న్యాయరాజధానిగా కొనసాగిస్తామని చెప్పామని తెలిపారు. తనకు ప్రాంతీయ విబేధాలు ఉంటే రాజధానిని రాయలసీమలో పెట్టేవాడినని అన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి వరకూ ఉన్న టెండర్లను రద్దుచేసిందని, మరలా పాత కంపెనీలకే పనులు అప్పగించిందని పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి అమరావతి వేదికవుతోందని చెప్పారు. . సెక్రటేరియట్ 1, 2 టవర్ల నిర్మాణంలో 2018లో రూ.932 కోట్లు కాంట్రాక్టు వ్యయంకాగా ప్రస్తుతం రూ.1423 కోట్లకు పెంచారని, పైగా ఇసుక, జిఎస్టి, ఎన్ఎసి, ఇతర పన్నులు అన్నీ ఉచితమని, వీటిరూపంలో రూ.275 కోట్లు అంటే మొత్తంగా రూ.1762 కోట్లకు చేరిందని పేర్కొన్నారు.గతంలో ఉన్న కాంట్రాక్టరే ఇప్పుడూ పనులు చేస్తున్నారని, టెండర్ల రద్దుపేరుతో అంచనాలు పెంచి వాటాలు పంచుకుంటున్నారని ఆరోపించారు. అలాగే 3,4 టవర్లు, జిఎడి టవర్ల ఖర్చును కూడా భారీగా పెంచారన్నారు. అన్నీ ఉచితంగా ఇచ్చినా చదరుపు అడుగు రూ.11 వేల నుండి రూ.14 వేలు ఖర్చవుతోందని తెలిపారు. తెలంగాణా సెక్రటేరియట్ రూ.615 కోట్లు, పార్లమెంటు భవనం రూ.970కోట్లతో కట్టారని, ఎపిలో అసెంబ్లీ కోసం రూ.1449 కోట్లు, హైకోర్టు కోసం రూ.1480 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. కొండవీటివాగు వద్ద ఫ్లైఓవర్ కోసం కిలోమీటర్లుకు రూ.170 కోట్లు ఖర్చు పెడుతున్నారని అన్నారు. అమరావతిలో ఆరులైన్ల రోడ్డుకు కిలోమీటరుకు రూ.53 కోట్లు పెడుతున్నారని, జాతీయ రహదారి విభాగమే కిలోమీటరుకు రూ.25 కోట్లు వెచ్చిస్తోందని తెలిపారు. అయితే రెండు లక్షల కోట్లు ఖర్చు చేయలేని చంద్రబాబునాయుడు దాన్నుండి బయటపడేందుకు అసెంబ్లీ తీర్మానం పేరుతో డైవర్షన్ చేస్తున్నారని అన్నారు. అమరావతి సెల్ఫ్‌ఫైనాన్స్ ప్రాజెక్టు అని చెబుతూ రూ.47 వేల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. సెల్ఫ్ ఫైనాన్స్ పక్కకుపోయి అప్పులు మాత్రమే మిగిలాయని, ఈ దోపిడీకి సంబంధించిన అంశాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయని తెలిపారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత వీటిపై విచారణ చేయిస్తామని, బాధ్యులను శిక్షిస్తామని, అన్నీ ప్రజల ముందు పెడతామని అన్నారు. రాష్ట్ర రాజధానులకు ఇప్పటి వరకూ ఎక్కడా కేంద్రం చట్టబద్ధత ఇవ్వలేదని, ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఇదే అసెంబ్లీలో మరలా తీర్మానం చేయలేమా అని అన్నారు.గతంలోనే రాజధాని కేంద్రం పరిధిలోలేదని రాష్ట్ర హైకోర్టుకు కేంద్రం వివరణ కూడా ఇచ్చిందని జగన్ తెలిపారు.
రాజధానిగా ‘మావిగన్’!
- Advertisement -
- Advertisement -



