– ముస్లిం వ్యక్తి నడుపుతున్న దాబాపై దాడి
– కుర్చీలు, సామగ్రి ధ్వంసం
– జైశ్రీరామ్ నినాదాలు.. హనుమాన్ చాలీసా పఠనం
– సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్
– హర్యానాలోని కురుక్షేత్రలో ఘటన.. తాజాగా వెలుగులోకి
న్యూఢిల్లీ : దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింల పట్ల ద్వేషపూరిత దాడులు తీవ్రమవుతున్నాయి. హిందూత్వ శక్తులు చేస్తున్న ఈ అరాచకాలను అక్కడి ప్రభుత్వాలు అడ్డుకట్ట వేయడం లేదు. ఫలితంగా దేశంలో ముస్లిం మైనారిటీల భద్రత ప్రమాదంలో పడటమే కాకుండా లౌకికవాదానికి విఘాతం కలుగుతోంది. తాజాగా హర్యానాలో హిందూత్వ శక్తులు రెచ్చిపోయాయి. ఒక ముస్లిం వ్యక్తి నడుపుతున్న పంజాబీ దాబాపై దాడికి దిగాయి. దాబాను ఒక ముస్లిం వ్యక్తి నడుపుతున్నాడన్న కారణంతో హిందూత్వ శక్తులైన విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ), బజరంగ్‌దళ్‌లు ఈ దాడికి తెగబడి, ఆస్తి ధ్వంసం చేశాయి. స్పందించాల్సిన పోలీసులు మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరించారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానాలోని కురుక్షేత్రలో ఈ ఘటన గతనెల 24న జరిగింది. ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి తాజాగా వెలుగులోకి వచ్చింది. చర్చనీయాంశంగా మారిన ఈ ఘటనను స్థానికులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు.వివరాళ్లోకెళ్తే… కురుక్షేత్రలో బాధిత ముస్లిం వ్యక్తి ఒక పంజాబీ దాబాను నడుపుతున్నాడు. అక్కడ ఉండే హిందూ వ్యాపారులు, స్థానిక హిందువులతో బాధిత వ్యక్తికి మంచి పరిచయాలే ఉన్నాయి. అయితే ఒక ముస్లిం వ్యక్తి పంజాబీ దాబాను నడపడాన్ని కొన్ని హిందూత్వ శక్తులు జీర్ణించుకోలేకపోయాయి. దీంతో హిందూత్వ సంస్థల కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో నిందితులు దాబాలోని కుర్చీలు, సామాను పగలగొట్టారు. తయారై ఉన్న ఆహారాన్ని నాశనం చేశారు. జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. హనుమాన్ చాలీసా పఠనం జరిపారు. మత ప్రసంగాలు ఇచ్చారు. ఇదంతా వీడియోలో రికార్డయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
అయితే ఈ ఘటనను విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ)కి చెందిన రాకేశ్ కత్వాద్ అనే వ్యక్తి నడిపించినట్టు తెలుస్తోంది. దాబా ఓనర్ ఒక ముస్లిం అనీ, దాబా పేరు మార్చి నడిపిస్తున్నాడని కత్వాద్ అంటున్నట్టు ఒక వీడియోలో రికార్డయ్యింది. తన మత గుర్తింపును దాచుకొని, హిందువులను ఆయన తన దాబాలోకి ఆకర్షిస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించాడు. అలాగే మాంసాహారం వడ్డిస్తున్నారని కూడా తెలిపారు. ”కురుక్షేత్ర ఒక మతపరమైన నగరం. ఇక్కడ దుకాణాలు నడిపేవారు తమ షాప్ ముందు వారి పేరు లేదా వారి మతం పేరు రాయాలని ఇప్పటికే హెచ్చరించాం” అని ఒక బజరంగ్దళ్ కార్యకర్త తెలిపాడు. ముస్లింలకు ఎవరూ ఇండ్లను కానీ, దుకాణాలను కానీ రెంట్‌కు ఇవ్వద్దని హిందూత్వ సంస్థలు హెచ్చరించాయి. అలా చేస్తే తదుపరి పరిణామాలకు మీరే బాధ్యులవుతారని బెదిరించాయి.
అయితే స్థానిక వ్యాపారులు మాత్రం హిందూత్వ సంస్థల కార్యకర్తల చర్యలను, ఆరోపణలను ఖండించారు. ఒక స్థానిక హిందూ వ్యాపారి ప్రకారం… ”ఇది పూర్తిగా గూండాగిరి. ముస్తాక్ అనే వ్యక్తి మాకు 35 ఏండ్లుగా తెలుసు. ఇక్కడ మాంసం వడ్డించడం లేదు. ఎవరైనా ఇక్కడ సిగరెట్ తాగితే వారికి ఆహారం వడ్డించరు” అని తెలిపారు. హిందూత్వ సంస్థలు చేసిన చర్యను ఆయన తప్పుబట్టారు. వారు సృష్టించిన ఈ బీభత్సంతో పొరుగున ఉండేవారికి కూడా ఇబ్బందికరంగా మారిందని ఆరోపించారు. అయితే ఈ దాడి రాజకీయ ప్రయోజనాల కోసం జరిగిందనీ, మత విద్వేషాన్ని పెంచడం ఇందులో భాగమని బాధిత దాబా యజమాని కుటుంబం వివరించింది. అయితే పక్కనే ఉన్న హౌటల్ యజమానులు వ్యాపార పోటీ కారణంగా ఈ దాడికి ప్రోత్సహించారని కూడా దాబా అసలు యజమాని మల్కిత్ సింగ్ ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కాగా ఈ ఘటనను పలువురు ఖండించారు. జన సంఘర్ష్ మంచ్ హర్యానా ఈ ఘటనను ఖండిస్తూ నిరసన తెలియజేసింది. ”భారత్ ఒక లౌకికదేశం. ఎవరైనా ఏ పేరుతోనైనా వ్యాపారం చేసుకోవచ్చు. ఈ దాడి చట్ట విరుద్ధం” అని ఆందోళన వ్యక్తం చేసింది. సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు చర్యలు తీసుకోకపోవడం పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తుందని అన్నారు.
రెచ్చిపోయిన హిందూత్వ శక్తులు
- Advertisement -
- Advertisement -



