సాగర్ ఎడమ కాలువ మరమ్మతులు చేపట్టాలి
లిఫ్ట్‌లకు వెంటనే రిపేర్లు చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ టౌన్
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇటీవల ఎకరానికి మాత్రమే రైతుభరోసా అందించిందని, మిగతా వారికి వెంటనే ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి కోరారు. గతంలో మూడు విడతలుగా ఇవ్వాల్సిన భరోసా డబ్బులను సైతం రైతులకు ఇవ్వాలన్నారు. నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో బుధవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిగిలిన రెండు విడతల రైతు భరోసాకుగాను రూ.18 వేల కోట్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలన్నారు. వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. నాణ్యమైన వరి, మిర్చి, పత్తి విత్తనాలు అందించాలని ప్రభుత్వానికి సూచించారు.
యూరియా యాప్‌ను ఎత్తేసి రైతులకు యూరియా సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ మరమ్మతు పనులు వేసవిలోనే ప్రారంభించాలని, జూన్, జులైలో చేపట్టడం వల్ల ప్రయోజనం ఉండదని చెప్పారు. సాగర్ ఎడమ కాలువ పరిధిలోని లిఫ్ట్‌లకు వెంటనే మరమ్మతులు చేయించి, అదనంగా స్టాండింగ్ మోటార్లకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు. రబీ సీజన్‌లో పెట్టుబడులు పెరిగాయని, యూరియా సకాలంలో లభించలేదని అన్నారు. ఫలితంగా వరి దిగుబడి తగ్గిందన్నారు. రైస్ మిల్లర్లు రైతుల కష్టనష్టాలు, ఇబ్బందులు అర్థం చేసుకుని క్వింటాల్ ధాన్యానికి రూ.3వేలు చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేశం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎం) నాయకులు మల్లు గౌతమ్‌రెడ్డి, మంగారెడ్డి, సైదులు, లక్ష్మీనారాయణ ఉన్నారు.
పెండింగ్ రైతుభరోసా విడుదల చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



