జీవోలు 104, 29, 46, 81లను రద్దు చేయాలి : కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గ్రూప్-1 తరహాలో డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులను తమవారికే కట్టబెట్టడానికి కాంగ్రెస్ పాలకులు కుట్రలు చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు దక్కకుండా ప్రతి నోటిఫికేషన్‌కు ఏదో ఒక జీవో అడ్డంకిగా పెడుతున్నారని ఆరోపించారు. డిగ్రీ లెక్చరర్ల పోస్టుల కోసం వేసిన నోటిఫికేషన్‌కు అడ్డుగా జీవో నంబర్ 4 తెచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పీహెచ్డీ చేసిన వారికి 25 మార్కుల వెయిటేజీ, ఇంటర్వ్యూకు 10 మార్కులంటూ నిబంధనలు తమ వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారని విమర్శించారు. పీహెచ్డీ అడ్మిషన్లే లేకుండా 25 మార్కుల వెయిటేజీ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. స్టేట్ ఎలిజిబుల్ టెస్ట్ మూడేళ్లుగా నిర్వహించకపోవటంతో ఎంతో మందికి అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
డీయస్సీకి జీవో నంబర్ 104, గ్రూప్స్‌కు జీవో నంబర్ 29, పోలీసు ఉద్యోగాలకు జీవో నంబర్ 46, గురుకులాలకు జీవో నంబర్ 81, మహిళా రిజర్వేషన్లు రాకుండా జీవో నంబర్ 4 ను తెచ్చారని కవిత చెప్పారు. గత ప్రభుత్వం గానీ ఈ ప్రభుత్వం గానీ ఈ జీవోలను కనీసం సమీక్షించలేదని విమర్శించారు. ప్రభుత్వానికి నిరుద్యోగులకు శాపంగా మారిన జీవోలపై సమీక్షించే సమయం లేదా అని కవిత ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్, రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే నిరుద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులతో కలిసి ఐక్య పోరాటం చేస్తామని హెచ్చరించారు. 15 లక్షల రేషన్ కార్డులను తొలగించేందుకు చేపట్టిన సర్వేను వెంటనే నిలిపివేయాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ఆమె హెచ్చరించారు.
దళిత క్రైస్తవుల అంశంపై అధ్యయనం
దళితులు క్రైస్తవులైతే వారికి అంతకు ముందున్న ఎస్సీ హోదా రద్దు అవుతుందంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును, ఆ అంశాన్ని అధ్యయనం చేస్తున్నట్టు కల్వకుంట్ల కవిత తెలిపారు. గురువారం మీడియా ప్రతినిధులతో ఆమె ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అధ్యయనం అనంతరం ఆ అంశంపై ఒక వైఖరి తీసుకుంటామని ఆమె తెలిపారు. అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాలు పరస్పర విమర్శలతో ఒకరి అవినీతిని మరొకరు బయటపెట్టుకున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ భుజంపై తుపాకీ పెట్టి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై గురి పెట్టారన్నారు. మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా కోసం పోరాడుతామని తెలిపారు. మావోయిస్టులది, తమది ఒకటే ఎజెండా అనీ, వారు తమతో కలిసి వస్తారని ఆమె తెలిపారు. కల్వకుర్తి నియోజక వర్గంలో కుర్మిద్దలో పేద గిరిజనుల భూములు టీజీఐసీసీ లాక్కొవడానికి వ్యతిరేకంగా త్వరలో పోరాటం చేస్తామని తెలిపారు. పార్టీ ఆవిర్భావం రోజు ఎజెండా చెప్పేందుకే ప్రాధాన్యమిస్తామన్నారు.
కొండగట్టు పనుల్లో ఇంత నిర్లక్ష్యమా?
కొండగట్టు అంజన్న ఆలయంలో చలువ పందిళ్లు కూలి 15 మంది గాయపడిన ఘటనపై కవిత విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. హనుమాన్ జయంతి వేడుకల కోసం నాసిరకంగా పందిళ్లు వేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఆమె విమర్శించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో గాయపడిన భక్తులకు మెరుగైన వైద్య చికిత్స అందించటంతో పాటు ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
డిగ్రీ లెక్చరర్ పోస్టుల్లో అక్రమాలకు కుట్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



