- మాజీ మంత్రి బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు
నవతెలంగాణ-హైదరాబాద్: కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చినట్టే.. కేసీఆర్ ప్రారంభించిన టిమ్స్ (TIMS) హాస్పిటల్స్ ప్రారంభోత్సవాల పేరుతో కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది(KCR) అయితే.. ప్రచారం కాంగ్రెస్‌ది అన్నట్లు ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. నేడు సనత్‌నగర్‌లోని(Santhnagar) టిమ్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవంపై ఆయన స్పందించారు. డేట్లు, డెడ్‌లైన్లు మార్చుకుంటూ పోయి, చివరకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తున్న దవాఖానలో కూడా పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురాకపోవడం శోచనీయమన్నారు.
వెయ్యి కోట్ల రూపాయలతో నిర్మించిన హాస్పిటల్‌ను కేవలం ఓపీ సేవలకే పరిమితం చేయడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ ఎంతో ముందుచూపుతో మొదలు పెట్టిన టిమ్స్, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పేదల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయకుండా పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని బీఆర్‌ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.



