నవతెలంగాణ-మల్హర్ రావు
అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం తీపి కబురు అందజేసింది. డేటా ఎంట్రీతో పాటు సజావుగా పోషణ్ అభియాన్ కార్యక్రమం, కేంద్రాల నిర్వహణ కోసం కొత్త సెల్ ఫోన్లను ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వారికి సెల్ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ప్రారంభించారు.అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కాగిత రహితంగా ఆన్లైన్లోనే పనులు జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో టీచర్లకు సాంకేతికపరంగా ఇబ్బందులు తొలగిపోతాయని భావిస్తున్నారు.
మండలంలో మొత్తం 38 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఈకేంద్రాల్లో పనిచేసే టీచర్లకు 2019లో అప్పటి ప్రభుత్వం సెల్ఫోన్లు మంజూరు చేయగా,ఇప్పటివరకు వాటినే విని యోగించారు.ఇవి 2జీ ఫోన్లు కావడంతో చాలావరకు పాడయ్యాయి. చాలా ఫోన్లలో బ్యాటరీలు చెడిపోయి డిస్ప్లే పగిలిపోయాయి. టీచర్లు తమ సొంత డబ్బులతో వాటికి మరమ్మతులు చేయించి నెట్టుకొస్తున్నారు.ప్రస్తుతం అవి పనిచేయక మొరాయిస్తుడటంతో డేటా ఎంట్రీ కోసం టీచర్లు ఇబ్బందులపాలవుతున్నారు.వాస్తవానికి ఐదేళ్లకోసారి వారికి కొత్త సెల్ఫోన్లు ఇవ్వాల్సి ఉండగా, ఎవరూ పట్టించు కోలేదు. పోషణ్ ట్రాకర్ యాప్ ద్వారా ప్రతి రోజూ విద్యార్థులు, గర్భిణులకు సంబంధించి 14 రకాల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. వాటితో పాటు గర్భిణులు, బాలింతల రిజిస్ట్రేషన్, చిన్నారుల ఎత్తు, బరువు, వ్యాక్సిన్ షెడ్యూలు, విటమిన్ డోసులు, నెలవారీ హెల్త్ చెకప్ వివరాలు, హోమ్ విజిట్స్, బాలామృతం పంపిణీ వంటి పూర్తి సమాచారాన్ని ఏరోజుకారోజు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు కేంద్రాల్లో విద్యార్థుల హాజరు శాతం, సెంటర్ తెరిచిన టైం,వంటి ఇతర కార్యకలాపాలను మొబైల్లోనే నమోదు చేయాల్సి ఉంటుంది.
ఒక్కో ఫోన్ కు రూ.11,650
అంగన్వాడీ టీచర్లకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కొత్తగా ఫోన్లు కొనుగోలు చేసింది. 4 జీబీ ర్యాం, 5జీ స్పీడ్,64 జీబీ మెమోరీతో పనిచేసే విధంగా ప్రభుత్వం స్యామ్సంగ్ ఫోన్లను కొనుగోలు చేసింది. ఈమేరకు ప్రభుత్వం ఒక్కో ఫోన్ ను రూ. 11,650కు కొనుగోలు చేసినట్లు సమాచారం. త్వరలో మండలంలోని అన్ని కేంద్రాలకు వీటిని సరఫరా చేయన్నారు.



