అమెరికా తరహాలోనే ఖమేనీ ఒత్తిడి పెంచే వ్యూహమా?
ఇరాన్ గార్డులు సముద్ర మైన్లు పెట్టినట్టు చార్ట్‌లు విడుదల
హార్ముజ్ మార్గంలో డేంజర్ జోన్ గుర్తింపు.. నౌకాయానంపై ప్రభావం!
టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాలని భావించిన సమయంలో తాజా పరిణామాలు పరిస్థితిని మళ్లీ సంక్లిష్టంగా మార్చుతున్నాయి. ఇరాన్‌కు చెందిన పలు వార్తాసంస్థలు విడుదల చేసిన చార్ట్‌లు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారి తీస్తున్నాయి. ఆ చార్ట్‌ల ప్రకారం, ఇరాన్ పారామిలటరీ రివల్యూషనరీ గార్డులు (ఐఆర్‌జీసీ) హార్ముజ్ జలసంధిలో సముద్ర మైన్లు అమర్చినట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి.
డేంజర్ జోన్ గుర్తింపు
హార్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో చమురు, సహజ వాయువు రవాణా జరుగు తుంది. ఒక అంచనా ప్రకారం, గ్లోబల్ ఎనర్జీ ట్రేడ్‌లో సుమారు 20 శాతం ఈ మార్గం మీదుగా సాగుతుంది. ఇరాన్ వార్తా సంస్థలు ఐఎస్‌ఎన్‌ఏ, తస్నీమ్ విడుదల చేసిన చార్ట్‌లలో డేంజర్ జోన్‌గా ఒక పెద్ద వలయం గుర్తించారు.
మైన్లు తొలగించారా లేదా?
ఇది సాధారణంగా నౌకలు ప్రయాణించే ట్రాఫిక్ సెపరేషన్ స్కీమ్‌పై ఉంది. ఈ ప్రాంతంలోనే మైన్లు అమర్చినట్టు సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో నౌకలు సాధారణ మార్గాన్ని వదిలి, ఇరాన్ తీరానికి దగ్గరగా, లారక్ దీవి వైపు ఉత్తర దిశగా ప్రయాణించినట్టు యుద్ధ సమయంలో తెలుస్తోంది. ఆ చార్ట్‌లు ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్ 9 వరకు ఉన్న కాలాన్ని సూచిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఆ మైన్లు తొలగించారా లేదా అన్న విషయంపై స్పష్టత లేదు.
ఒత్తిడి పెంచే వ్యూహమా?
దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ చర్య ఇరాన్ వైపు నుంచి ఒత్తిడి పెంచే వ్యూహంగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఇదే సమయంలో ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ మధ్య తాజాగా కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ.. పలు ప్రాంతాల్లో డ్రోన్లు, క్షిపణి దాడులు కొనసాగుతున్నట్టు సమాచారం. దీంతో కాల్పుల విరమణపై అనిశ్చితి నెలకొంది. ట్రంప్ తన ప్రకటనలో హార్ముజ్ జలసంధి ఎప్పటికీ తెరిచి, సురక్షితంగా ఉండాలని పేర్కొన్నారు. అంతే కాకుండా, ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా నిరోధించడమే తమ ప్రధాన లక్ష్యమని మరోసారి వెల్లడించారు. అయితే అమెరికా మాట ఇచ్చి బేఖాతరు చేస్తున్న ట్రంప్ తీరును సునిశితంగా ఇరాన్ గమనిస్తోంది. అందులో భాగంగా హార్ముజ్ జలసంధిపై పట్టు సాధించేదిశగా అడుగులేస్తోంది.
ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడిన దేశాలు పరిస్థితిని దగ్గరగా గమనిస్తున్నాయి. ఈ మార్గం లో ఎలాంటి అంతరాయం కలిగినా ఇంధన ధరలు పెరగడం, సరఫరా లోపాలు ఏర్పడే అవకాశం ఉంది. మొత్తం మీద, కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ, పశ్చిమాసియాలో శాంతి ఇంకా దూరంగా ఉన్నట్టే కనిపిస్తోంది. ఇరాన్ చర్యలు, అమెరికా హెచ్చరికలు, ప్రాంతీయ సంఘర్షణలు అన్నీ కలిపి పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో జరగబోయే చర్చలు ఈ సంక్షోభానికి పరిష్కారం చూపుతాయా లేదా అన్నది ఇప్పుడు ప్రపంచం ఎదురు చూస్తోంది.
సురక్షిత ప్రయాణానికి తమ సాయుధ దళాలు పాల్గొంటాయని, ”సాంకేతిక పరిమితులు” ఉన్నాయని ఇరాన్ చెబుతోంది. అయితే, అమెరికా అధ్యక్షుడు మాత్రం ”పూర్తిగా, తక్షణమే సురక్షితంగా తెరవడం” గురించి మాట్లాడారు. అంతర్జాతీయ సముద్రయాన సంస్థ సెక్రెటరీ-జనరల్, ఆర్సెనియో డొమింగెజ్, జలసంధి గుండా నౌకల సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించడానికి తగిన యంత్రాంగాన్ని అమలు చేయడానికి తాను సంబంధిత వర్గాలతో కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు.”ఓడ జమానుల విషయానికొస్తే, ఆ జలసంధిపై ప్రభావవంతమైన నియంత్రణ ఇప్పటికీ ఇరాన్ చేతిలోనే ఉంది.
ఓడ యజమానులు, చార్టరర్లు, ఏజెంట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న అంతర్జాతీయ సంస్థ అయిన బిమ్‌కో చీఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ జాకబ్ లార్సెన్ మాట్లాడుతూ, హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా ఎలా దాటాలనే దానిపై షిప్పింగ్ పరిశ్రమ ప్రస్తుతం అమెరికా , ఇరాన్ నుంచి సాంకేతిక వివరాల కోసం ఎదురు చూస్తోందని చెప్పారు. ఇదిలా ఉండగా చైనాలోని ఇరాన్ రాయబారి అబ్దుల్ రెజా రహ్మానీ ఫజ్లీ బీజింగ్‌లో మీడియాతో మాట్లాడుతూ, హార్ముజ్ జలసంధికి రవాణా రుసుము విధించే విషయాన్ని ఇరాన్ పరిశీలిస్తోందని చెప్పారు. ఆ జలసంధి గుండా సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించడానికి ఇరాన్ పొరుగు దేశాలతో కలిసి పనిచేస్తుందని, అయితే ”ప్రధాన భద్ర తా హామీ ఇరాన్ నుంచే వస్తుందని” ఆయన అన్నారు.
మాపై అణు ఆంక్షలు విధించి శత్రువులు విజయం సాధించలేరు : ఇరాన్ అణు సంస్థ అధిపతి కీలక వ్యాఖ్యలు
అమెరికాతో జరగనున్న శాశ్వత కాల్పుల విరమణ చర్చల్లో యురేనియంను శుద్ధి చేసుకునే ఇరాన్ హక్కును కాపాడుకోవడం అత్యవసరమని ఆ దేశ అణు ఇంధన సంస్థ అధిపతి మొహమ్మద్ ఎస్లామీ స్పష్టం చేశారు. ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సంస్మరణ కార్యక్రమాల సందర్భంగా టెహ్రాన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. శాశ్వత కాల్పుల విరమణ కోసం ఇరాన్ ప్రతిపాదించిన 10-అంశాల ప్రణాళికలో యురేనియం శుద్ధి అనేది ఒక ప్రధాన భాగమన్నారు. అయితే దీనిని అంగీకరించడానికి అమెరికా నిరాకరిస్తోందని ఎస్లామీ పేర్కొన్నారు. ఇరాన్‌పై శత్రువులు విజయం సాధించలేరని తెలిపారు. పశ్చిమాసియాలో ఇటీవల చోటుచేసుకున్న భీకర దాడులు, ఉద్రిక్తతల నడుమ అమెరికా, ఇరాన్ దేశాల ప్రతినిధులు ఈ వారాంతంలో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ముఖాముఖి శాంతి చర్చల కోసం సమావేశం కానున్నారు. ఈ కీలక చర్చలకు ముందు ఇరాన్ అణు సంస్థ చీఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
వైమానిక దాడిలో హిజ్బొల్లా నాయకుడి కార్యదర్శి మృతి
ఇజ్రాయిల్, లెబనాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో బీరూట్‌పై జరిపిన వైమానిక దాడుల్లో హిజ్బొల్లా సెక్రెటరీ-జనరల్ నయీమ్ ఖాసెమ్ వ్యక్తిగత కార్యదర్శి అలీ యూసుఫ్ హర్షీని హతమార్చి నట్టు ఇజ్రాయిల్ రక్షణ దళాలు గురు వారం ప్రకటించాయి. ”ఖాసెమ్‌కు అత్యంత సన్నిహితుడు, వ్యక్తిగత సలహాదారు అయిన హర్షీ, ఆయన కార్యాలయాన్ని నిర్వహించడంలో, భద్రపరచడంలో కీలకపాత్ర పోషించారు. లిటానీ నదికి దక్షిణంగా ఆయుధాలను తరలించడానికి హిజ్బొల్లా ఉపయోగించే రెండు కీలక క్రాసింగ్‌లపై, అలాగే దక్షిణ లెబనాన్‌లోని సుమారు 10 ఆయుధ నిల్వ కేంద్రాలు, లాంచర్లు, కమాండ్ సెంటర్లపై కూడా దాడి చేసింది” అని ఐడీఎఫ్ తెలిపింది. ఇరాన్, అమెరికా కాల్పుల విరమణ ప్రకటించిన కొద్దిసేపటికే, గత 24 గంటల్లో లెబనాన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో వందలాది మంది మరణించారు.
లెబనాన్‌పై కొనసాగుతున్న ఇజ్రాయిల్ దాడులు.. ఏడుగురు మృతి
లెబనాన్‌పై గురువారం కూడా ఇజ్రాయిల్ దాడులు చేపట్టింది. అబ్బాసియే పట్టణంపై ఇజ్రాయిల్ జరిపిన దాడిలో సుమారు ఏడుగురు మరణించారని, మరికొంత మంది గాయపడ్డారని మీడియా తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ దాడుల్లో హెజ్బుల్లా ప్రధాన కార్యదర్శి నయీమ్ ఖాసేం మేనల్లుడిని హతమార్చినట్లు ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. నదీ మార్గాలపై సైతం దాడులు చేపట్టినట్లు పేర్కొంది. బుధవారం అర్థరాత్రి, గురువారం తెల్లవారుజామున లెబనాన్ రాజధాని బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలపై దాడి చేసినట్లు లెబనాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఉదయం కూడా దాడులు కొనసాగాయని, దక్షిణ ప్రాంతంలోని పట్ణఆలపై ఇజ్రాయిల్ దాడిచేసినట్టు వెల్లడించింది. కస్మియా వంతెన సమీపంలోని కాఫ్రా, జెమాజ్మ్హె, సఫద్ అల్ బతిఖ్, మజ్దల్ సెల్మ్, దైర్ అంటార్ సహా పలు పట్టాణాలపై ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు వరుస దాడులు జరిపినట్టు తెలిపింది. హారిస్ పట్టణం పూర్తిగా దెబ్బతిందని పేర్కొంది.
దాడుల్లో 200 మందికిపైగా మృతి
లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడుల్లో అనేక భవనాలు కుప్పకూలగా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడుల్లో 200 మందికిపైగా మరణించారని వందలాది మంది గాయపడ్డారని లెబనాన్ తెలిపింది. గురువారం ఉదయం నుంచి సహాయ చర్యలను మరింత ముమ్మరం చేశారు. లెబనాన్ రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో శిథిలాల కింద ప్రాణాలతో ఉన్నవారి కోసం, మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ఈ దాడుల్లో ఎక్కువగా అమాయక ప్రజలే ప్రాణాలు కోల్పోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. హిజ్బొల్ల్లా పేరుతో చిన్నారులు, మహిళల ప్రాణాలను ఇజ్రాయిల్ సైన్యం బలి తీసుకుంటోందని ఆరోపించారు. కేవలం 10 నిమిషాల వ్యవధిలో బీరుట్, దక్షిణ లెబనాన్, తూర్పు బెక్కా వ్యాలీలోని 100కు పైగా హిజ్బొల్లా లక్ష్యాలపై దాడులు చేసినట్టు ఇజ్రాయిల్ ప్రకటించింది.
హార్ముజ్‌లో ఇరాన్ సముద్ర మైన్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



