నవతెలంగాణ-హైదరాబాద్ : ఒడిశాలో తీవ్ర కలకలం రేపిన ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఐదు నెలల గర్భవతి అని తేలడంతో స్థానికంగా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు సంబంధించి బాలికకు పాఠాలు చెప్పే ప్రయివేటు ట్యూటర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మయూర్‌భంజ్ జిల్లాలో ఈ విచారకర ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఈ వారం ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థినులకు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో తొమ్మిదో తరగతి చదువుతున్న సదరు బాలిక ఐదు నెలల గర్భవతి అని వైద్యులు ధృవీకరించారు. దీంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం వెంటనే ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించింది.
కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లి ఆరా తీయగా, బాలిక అసలు విషయాన్ని వెల్లడించింది. వేసవి సెలవుల్లో తాను ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ప్రయివేటు ట్యూటర్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపింది. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిందితుడు బెదిరించడంతో, భయంతో ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నట్లు వివరించింది.
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, శుక్రవారం నిందితుడైన ట్యూటర్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.



