నవతెలంగాణ – సిర్పూర్ (టి )
మండలంలోని ఆదివాసీ గ్రామమైన మేడిపల్లిలో గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. సంబంధిత శాఖ మంత్రులతో చర్చించి సమస్యలకు పరిష్కారం చూపించే దిశగా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. సోమవారం మేడిపల్లిలో నిర్వహించిన దక్షిణ గోండ్వానా గోండు రాజు మోకాసి స్మారక జెండా పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన రాయ్ దర్బార్లో పాల్గొని గ్రామ సమస్యలపై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడిపల్లి గ్రామానికి 154 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. ఫారెస్ట్ శాఖ ఆంక్షల కారణంగా కొన్ని ఇండ్ల నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదని, ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సిర్పూర్(టి) నుండి మాలిని వరకు బీటీ రోడ్డు నిర్మాణంతో పాటు రెండు బ్రిడ్జిల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు కేటాయింపులు, అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పోడు భూముల సమస్యపై సంబంధిత శాఖ మంత్రులతో చర్చించి పరిష్కారం తీసుకువస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు పోడు భూముల విషయంలో రైతులపై బలవంతపు చర్యలు చేయవద్దని సూచించారు. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో సాగు చేసుకునే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
రాయ్ దర్బార్లో గిరిజనుల సమస్యలను అధ్యయనం చేసిన అనంతరం వారి స్థితిగతులను మెరుగుపరిచే విధంగా ఐటిడిఏలను బలోపేతం చేయాలని తీర్మానించారు. తద్వారా ఆదివాసులకు మెరుగైన సదుపాయాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రహీముద్దీన్, ఎంపీడీఓ సత్యనారాయణ, ఆదివాసీ నాయకులు సిడామ్ అర్జు మాస్టర్, కూర్సెంగా మోతిరాం, సుర్పం మారు, సర్పంచులు వెడ్మా భీమ్రావు, మానేపల్లి శ్రీనివాస్, సిడామ్ మాణిక్ రావు, చణకపురే లావణ్య, ఒడ్డేటి నాగమణి, నానయ్య, దుర్గం ప్రశాంత్, సాయి, గణేష్, బాబు దండిగ, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.



