12 రాష్ట్రాల్లో 20 శాతానికి పైగా లోటు..
ఏపీ, బీహార్, ఈశాన్య రాష్ట్రాల్లో 40 శాతానికి మించి కొరత
కేంద్రం లక్ష్యాలకు భిన్నంగా వాస్తవ పరిస్థితులు
ఖరీఫ్ సాగుకు దెబ్బ. వరి 3 శాతం, మొక్కజొన్న 4 శాతం తగ్గుదల
దేశవ్యాప్తంగా ఆగస్టులో కొన్ని ప్రాంతాల్లో ఆశించిన దాని కంటే మెరుగైన వర్షాలు కురిసినా.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల లోటు మాత్రం తీరలేదు. జూన్ 1 నుంచి ఆగస్టు 29 వరకు దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు దాదాపు 14 శాతానికి తీరింది. మరోవైపు ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోవడం, ప్రధాన ఆహార పంట వరి సాగు మూడు శాతానికి పైగా పడిపోవడం వ్యవసాయ రంగంపై ఆందోళన పెంచుతోంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవసాయాన్ని బలోపేతం చేస్తున్నామని చెప్తున్నప్పటికీ.. వర్షాభావం, సాగువిస్తీర్ణం తగ్గుదల, రైతుల ఆదాయంపై పెరుగుతున్న ఒత్తిడి ప్రభుత్వ విధానాలపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
న్యూఢిల్లీ : ఆగస్టులో దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే మెరుగైన వర్షపాతం నమోదైనా.. భారత్ ఎదుర్కొంటున్న మొత్తం రుతుపవన వర్షపాతం లోటు మాత్రం తగ్గలేదు. జూన్ 1 నుంచి లెక్కించిన దేశవ్యాప్త వర్షపాతం లోటు జులై 31 నాటికి 13 శాతంగా ఉండగా.. ఆగస్టు ముగింపు నాటికి దాదాపు 14 శాతానికి పెరిగింది. ప్రధానంగా ఏపీ, బీహార్, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాభావం దేశ సగటు పరిస్థితిపై ప్రభావం చూపింది.
వర్షాలు పడుతున్నా..
పంటల సాగు తగ్గుదల
రుతుపవనాల విషయంలో చోటు చేసుకున్న అసమానత ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశవ్యా ప్తంగా అన్ని ఖరీఫ్ పంటల సాగు విస్తీ ర్ణం గతేడాది ఇదే కాలంలో పోలిస్తే దా దాపు రెండు శాతం తగ్గింది. జులై చివరి నాటికి ఈ లోటు సుమారు మూడు శాతంగా ఉండగా.. ఆగస్టులో కొంత భర్తీ అయినప్పటికీ పరిస్థితి పూర్తిగా మెరుగపడలేదు. ప్రధాన ఆహార పంట అయిన వరి సాగు మూడు శాతానికి పైగా తగ్గింది. ఇది కేవలం వ్యవసాయ గణాంకాలు మాత్రమే కాదు.. దేశ ఆహార భద్రత, రైతుల ఆదా యం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అంశంగా విశ్లేషకులు చెప్తున్నారు.
మొక్కజొన్న తగ్గితే..
ఇథనాల్‌కు కొత్త ఒత్తిడి
పశువుల దాణా, పారిశ్రామిక అవసరాలతో పాటు దేశంలో ఇథనాల్ తయారీకి ప్రధాన ఫీడ్‌స్టాక్‌గా ఉపయోగి స్తున్న మొక్కజన్న సాగు 2025తో పోలిస్తే నాలుగు శాతానికి పైగా తగ్గింది. మొక్కజన్న లభ్యత తగ్గితే ఇథనాల్ ఉత్పత్తిదారులు ప్రత్యామ్నాయ ఫీడ్స్టా క్ల వైపు వెళ్లాల్సి రావచ్చు. ముఖ్యంగా చెరకు వినియోగంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఇది కేంద్రం ప్రోత్స హిస్తున్న ఇథనాల్ బ్లెండింగ్ విధానానికి కూడా కీలకమైన అంశమే. ఒకవైపు ఇంధనంలో ఇథనాల్ మిశ్ర మాన్ని పెంచాలని ప్రభుత్వ లక్ష్యాలు నిర్దేశిస్తుండగా.. మరోవైపు దానికి అవసరమైన పంటల లభ్యత తగ్గితే ఆ విధానం ఆహార పంటలు, పశుగ్రాసం, చక్కెర పరిశ్రమలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
12 రాష్ట్రాల్లో 20 శాతానికి పైగా లోటు
జూన్ 1 నుంచి ఆగస్టు 29 వరకు వర్షాపాతాన్ని పరిశీలిస్తే 12 రాష్ట్రాల్లో 20 శాతానికి పైగా వర్షపాతం లోటు నమోదైంది. ముఖ్యంగా పరిస్థితి తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ, బీహార్, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్ ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో మొత్తం వర్షపాతం లోటు 40 శాతానికి పైగా నమోదైంది. అంటే.. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినా.. మరికొన్ని ప్రాంతాలు తీవ్ర వర్షాభావాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇదే ఈ ఏడాది రుతుపవనాల అసలు సమస్యగా విశ్లేషకులు చెప్తున్నారు.
‘ఎల్‌నినో’ అంచనాలను తిప్పికొట్టినా..
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో భారత్‌లో బలహీన రుతుపవనాలు, తీవ్రమైన వేసవి ఉంటాయని ముందస్తు అంచనాలు వెలువడ్డాయి. అయితే దేశంలోని అనేక ప్రాంతాలు ఆ అంచనాలను తిప్పికొడుతూ సాధారణ వర్షపాతం పొందాయి. కానీ ఒక ప్రాంతంలో భారీ వర్షాలు, మరో ప్రాంతంలో వర్షాభావం అనే అసమాన వర్షపాతం పంపిణీ రైతులకు సమస్యగా మారింది.
ప్రభుత్వ విధానాలపై మళ్లీ ప్రశ్నలు
వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేశామని, రైతుల ఆదాయాన్ని పెంచుతున్నామని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తోంది. కానీ వాస్తవ పరిస్థితుల్లో వర్షాధార వ్యవసాయంపై ఆధారపడే రైతులు ఇప్పటికీ రుతుపవనాలపై తీవ్రంగా ఆధారపడాల్సి వస్తోంది. వర్షాలు అసమానంగా కురిస్తే రైతుకు ప్రత్యామ్నాయ నీటి వనరులు ఎంతవరకు అందుబాటులో ఉన్నాయి? పంట నష్టానికి పరిహారం ఎంత వేగంగా అందుతోంది? సాగు విస్తీర్ణం తగ్గుతున్నప్పుడు రైతులకు రక్షణ చర్యలు ఏమిటి? ఆహార పంటలతో పాటు ఇథనాల్ కోసం పంటల వినియోగాన్ని పెంచుతున్న విధానంలో ఆహార భద్రతకు ప్రాధాన్యం ఎంత? అనే ప్రశ్నలు ఇప్పుడు కీలకంగా మారుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించే లక్ష్యాలు ఒకవైపు.. క్షేత్రస్థాయిలో రైతు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితి మరోవైపు ఉన్నప్పుడు… కేవలం విధాన ప్రకటనలతో వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించలేమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
దక్షిణాది రాష్ట్రాలపై మరింత ప్రభావం
దక్షిణాది పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో 23 శాతానికి పైగా లోటు వర్షపాతం నమోదైంది. ఏపీ, కర్నాటక, కేరళ రాష్ట్రాలు నైరుతి రుతుపవనాల సీజన్లో ఎక్కువ కాలం వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొన్నాయి. ఇక వచ్చే వారం కూడా దక్షిణ భారత్‌లో వర్షపాతాలు బలహీనంగానే ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. దీంతో ఇప్పటివరకు ఏర్పడిన లోటును త్వరగా పూడ్చే అవకాశం పరిమితంగానే కనిపిస్తోంది.
దేశవ్యాప్తంగా ఉపశమనం కష్టమే
నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలను ఆనుకుని ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తూర్పు భారత్‌లో రానున్న రెండు, మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అయితే ఈ వర్షాలు తూర్పు ప్రాంతంలోని లోటును కొంత తగ్గించినా.. దేశవ్యాప్తంగా ఉన్న వర్షాభావాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం లేదని అంచనా.



