– ప్రభుత్వ స్థలాలు, పంట కాలువల్లో వ్యర్థాల డంపింగ్..
– దెబ్బతింటున్న పరిసరాలు, పైర్లు ొ స్లర్రీ అన్లోడ్ ఆసరాతో స్థలాలకబ్జాకూ యత్నం
– రోడ్ల వెంట డంపింగ్ ొ శ్వాసకోశ వ్యాధుల బారిన ప్రజలు
– పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నియంత్రణలేమి
పచ్చని పల్లెలపై గ్రానైట్ పరిశ్రమలు కాలుష్య విషం చిమ్ముతున్నాయి. ప్రభుత్వ భూములు, పంట కాలువలు గ్రానైట్ వ్యర్థాలతో నిండుతున్నాయి. గ్రానైట్ వ్యర్ధాల పొడి పంట చేలను కమ్మేస్తోంది. పంటల ఆకులపై పడిన గ్రానైట్ డస్ట్ కిరణజన్య సంయోగ క్రియ జరగకుండా అడ్డుపడుతోందని రైతులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. కొన్ని గ్రానైట్ కటింగ్, పాలీషింగ్ యూనిట్లు ఇష్టారాజ్యంగా వ్యవరిస్తున్నాయి. అధికారుల బాధ్యతారాహిత్యం ప్రజలకు ప్రాణసంకటంగా మారింది.
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం జిల్లాలోని ఖమ్మం రూరల్, అర్బన్, ముదిగొండ మండలాలు, నగరంలోని ఇండిస్టియల్ ఏరియా ప్రాంతాలు, అటు కరీంనగర్ జిల్లాలోని ఆసిఫ్‌నగర్, ఖాజీపూర్, ఎలగందుల, శ్రీరాములపల్లి, కమాన్పూర్తోపాటు గంగాధర, కొత్తపల్లి మండలాల్లో గ్రానైట్ పరిశ్రమలతో గ్రామాలు వాయు, శబ్ద కాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయి. గ్రానైట్ పాలీషింగ్ యూనిట్ల నుంచి దుమ్ము, ధూళితోపాటు రసాయనాలు గాలిలో కలుస్తున్నాయి. పాలీషింగ్ యూనిట్ల నుంచి వెలువడే వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ డంప్ చేస్తున్నారు. దాంతో ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. అనుమతుల్లేకుండా, పన్నులు చెల్లించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న గ్రానైట్ కటింగ్, పాలీషింగ్ పరిశ్రమలపై అధికారులు చర్యలు చేపట్టడం లేదు.
కటింగ్ పరిశ్రమలతో ఇక్కట్లు
రాష్ట్రంలో ఖమ్మం, కరీంనగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు గ్రానైట్ పరిశ్రమలకు నెలవుగా ఉన్నాయి. వీటికి అనుబంధంగా గ్రానైట్ కటింగ్, పాలీషింగ్ పరిశ్రమలు నెలకొల్పారు. గ్రామాల పరిసరాలు కాలుష్యంతో నిండిపోతున్నాయి. జలం, వాయు కలుషితమైన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. పంటలు దెబ్బతింటున్నాయి. పొలాల మధ్యలో గ్రానైట్ మిషన్లు ఏర్పాటు చేయడంతో పంటల సాగుపై ప్రభావం పడుతోంది. చెరువులు, కుంటలు, పంట కాల్వల్లోకి గ్రానైట్ వ్యర్థాలు చేరడంతో చేప పిల్లలు చనిపోతున్నాయని మత్స్యకారులు అంటున్నారు. గ్రానైట్ పరిశ్రమలు ఉన్న మార్గాల్లోని రోడ్లపై ప్రయాణించే వారు సైతం ఇబ్బంది పడుతున్నారు. కొన్ని గ్రానైట్ పరిశ్రమల నుంచి డస్ట్‌ను తరలించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలూ తీసుకోవడం లేదు.
స్థలాల కబ్జాకు సైతం..
ప్రభుత్వ స్థలాలు, వృథాగా ఉంటున్న పంట కాలువలు, చెరువుల బఫర్ జోన్లను నెమ్మదిగా కబ్జా చేసేందుకు సైతం కొందరు ఈ గ్రానైట్ వ్యర్థాలను ఓ ఆయుధంగా వాడుకుంటున్నారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి వెంకటగిరి ప్రాంతంలో ఓ పంట కాలువ బఫర్ జోన్‌ను పూర్తిగా గ్రానైట్ వ్యర్థాలతో నింపారు. ఆ పక్కనే ఉన్న స్థల యజమాని నెమ్మదిగా బఫర్ జోన్‌ను ఆక్రమించడం మొదలు పెట్టాడు. కొంత మొత్తాన్ని ఇప్పటికే తన స్థలంలో కలిపేసుకున్నాడు. ఇలా అనేకమంది ఆక్రమణలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఏ ఒక్కరూ కన్నెత్తి చూడటం లేదు.
పర్యావరణ నియంత్రణ బోర్డుకు కొరవడిన పట్టింపు
గ్రామ శివారులు, రోడ్ల పక్కనే కాకుండా ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ గ్రానైట్ చూర్ణం (స్లర్రీ) అన్లోడ్ చేస్తున్నారు. పర్యావరణ నియంత్రణ బోర్డు అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. పర్యావరణ నియంత్రణ బోర్డు అధికారులు రామగుండంకే పరిమితమవుతున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రాణాలకు ముప్పుగా పరిణమించిన డస్ట్ (స్లర్రీ) నియంత్రణకు చర్యలు చేపట్టాల్సి అవసరం ఉందని ప్రజలు కోరుతు న్నారు. ప్రభుత్వ భూముల్లో సైతం డస్ట్ అన్లోడ్ చేస్తుండ గా, సంబంధిత రెవెన్యూ అధికారులు కనీసం అభ్యంతరం తెలిపే పరిస్థి తుల్లో లేకపోండం గమనార్హం. కొందరు గ్రానైట్ వ్యాపారుల రాజకీయ పలుకుబడి ముందు అధికారులు ఏం చేయలేని స్థితి నెలకొందనే ఆరోపణలు ఉన్నాయి.



