Thursday, September 10, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంకాగ్ని జెంట్‌కు గ్రీన్‌కార్డు దరఖాస్తుల నిలిపివేత

కాగ్ని జెంట్‌కు గ్రీన్‌కార్డు దరఖాస్తుల నిలిపివేత

- Advertisement -

వైట్‌హౌస్ ఫ్రాడ్ టాస్క్‌ఫోర్స్‌తో
కలిసి సంయుక్తంగా దర్యాప్తు


శాన్‌‌ఫ్రాన్సిస్కో : ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్‌కు అమెరికా కార్మిక శాఖ షాక్‌ ఇచ్చింది. ఆ సంస్థకు చెందిన ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డు ప్రక్రియకు అత్యంత కీలకమైన పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ (పీఈఆర్‌ఎం) దరఖాస్తులను అమెరికా కార్మిక శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. వీసా నిబంధనల ఉల్లంఘనలు, మోసాల ఆరోపణలపై జరుగుతున్న సమగ్ర విచారణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అమెరికా కార్మిక శాఖ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆంథోనీ డి ఎస్పొసిటో సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. వైట్‌హౌస్ ఫ్రాడ్ టాస్క్‌ఫోర్స్‌తో కలిసి సంయుక్తంగా ఈ దర్యాప్తు చేపట్టినట్టు ఆయన తెలిపారు. అమెరికా కార్మికులకు వ్యతిరేకంగా జరిగే ఎలాంటి మోసాలను లేదా బెదిరింపులను సహించేది లేదని, విచారణ పూర్తయ్యే వరకు కాగ్నిజెంట్ కొత్తగా పీఈఆర్‌ఎం దరఖాస్తులు సమర్పించడానికి అనుమతి ఉండదని ఆయన స్పష్టం చేశారు. కాగ్నిజెంట్‌తో పాటు క్లౌడెరా సంస్థకు సంబంధించిన దరఖాస్తులను కూడా నిలిపివేసినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ నిలిచిపోవడం వల్ల కాగ్నిజెంట్‌లో పనిచేస్తున్న విదేశీ నిపుణులు, ముఖ్యంగా భారత్‌కు చెందిన టెకీల గ్రీన్‌కార్డు దరఖాస్తుల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ పడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఆమోదం పొందిన వాటిపై లేదా ప్రస్తుత ఉనికిలో ఉన్న వీసాలపై దీని ప్రభావం ఉంటుందా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -