ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా దర్యాప్తు సంస్థలతో మోడీ టార్గెట్
ఈడీ చర్యలను నిరసించిన సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో
ఏజెంట్‌గా వ్యవహరించొద్దంటూ సతీశన్ ప్రభుత్వానికి హెచ్చరిక
న్యూ ఢిల్లీ : కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన కుమార్తె వీణ, అల్లుడు, సీపీఐ(ఎం) నేత మహ్మద్ రియాజ్‌లపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేరళం పోలీసులను కోరడాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా నిరసించింది. రాజకీయంగా, చట్టపరంగా తమ శాయశక్తులా ఈ రాజకీయ ప్రతీకార చర్యలను వ్యతిరేకిస్తామని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. వీణపై జరిగిన దర్యాప్తు అప్పటి ముఖ్యమంత్రి పినరయి విజయన్ను లక్ష్యంగా చేసుకునేందుకు సాకు అన్నది మొదటినుంచే స్పష్టమైందని పేర్కొంది. ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకోవడానికి మోడీ ప్రభుత్వం ఇలా కేంద్ర సంస్థలను ఉపయోగించుకునే తీరుకు ఇది ఒక ఉదాహరణ అని తెలిపింది. ‘‘ఈడీ చర్యను కేపీసీసీ అధ్యక్షుడు సమర్థించడమే కాక కేసు నమోదు చేయాలని కోరుతున్నారు. ఇది, కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలను ఎత్తి చూపుతోంది. అదే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ సహా పలువురు నేతలపై ఈడీ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పినరయి విజయన్‌పై కేసు నమోదు చేయాలంటూ గతంలో కేరళంకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విజిలెన్స్ కోర్టుకు తర్వాత హైకోర్టు, ఆపై సుప్రీంకోర్టుకు వెళ్ళిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి ఉంది. అయితే, ఈ విషయంలో ఆయన విజ్ఞప్తిని కోర్టులు తిరస్కరించాయి. అదే కేసును ఇప్పుడు మళ్ళీ తిరగదోడుతున్నారు’’ అని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఈడీ ఏజెంట్‌గా వ్యవహరించొద్దంటూ సతీశన్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.



