బీఆర్ఎస్ నేత కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
న్యాయం కోసం ప్రశ్నిస్తే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. బుధవారం అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ అనంతరం ఆ పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభ ప్రాంగణంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మహిళా ప్రజా ప్రతినిధులపై దాడి చేశారనీ, ప్రజా సమస్యలు మాట్లాడనివ్వడం లేదనీ, వెయ్యి రోజుల కాంగ్రెస్ వైఫల్య పాలనపై చర్చించాలనీ, ఆడబిడ్డలను న్యాయం చేయాలనీ, 22ఏ పై చర్చించాలని కోరితే సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై చర్చించకుండా కాంగ్రెస్ సస్పెన్షన్ విధించిందని విమర్శించారు. ప్రజలు సమస్యలపై చర్చించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కోరుతుంటే సభలో ఉండకుండా సీఎం రేవంత్ రెడ్డి బయటికి పంపించారని తెలిపారు. నియంతృత్వం ఎంత పెరిగితే ప్రజల తిరుగుబాటు అంత బలపడుతుందని ఆయన హెచ్చరించారు.
ఫేక్ మార్ఫింగ్,ఏఐ జనరేటెడ్ చిత్రాలపై కఠిన చర్యలు : బీఆర్ఎస్
ఫేక్ మార్ఫింగ్,ఏఐ జనరేటెడ్ చిత్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ,బండారు లక్ష్మరెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, శాసనమండలి పక్షనేత మధుసూదన్ చారిలు డీజీపీకి మహేష్ మురళీధర్ భగవత్ కు ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా, వివిధ డిజిటల్ వేదికల్లో మార్ఫింగ్ చేసిన తప్పుడు, ఏఐ ద్వారా రూపొందించిన చిత్రాలు,దుష్ప్రచార కంటెంట్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తున్న వారిపై తక్షణమే దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. తప్పుడు సమాచారం ఎన్నికైన ప్రజా ప్రతినిధుల ప్రతిష్టకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ క్రైమ్, పరువునష్టం,తప్పుడు సమాచార ప్రచారం తదితర వర్తించే చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలో పోలీసుల వైఖరిపై, సంబంధిత కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలపై కూడా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
శంకరయ్యపై చర్యలు :
వేముల ప్రశాంత్ రెడ్డి
ప్రతిపక్ష నేత కేసీఆర్ చావాలని కోరుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్‌నగర్ ఎమ్మెల్యే కె. శంకరయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎథిక్స్ కమిటీ సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు, ఎథిక్స్ కమిటీ చైర్మెన్ రేవూరి ప్రకాష్ రెడ్డికి ఆయన లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేశారు.
ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



