Thursday, September 10, 2026
E-PAPER
Homeజాతీయంసీఎం విజయ్‌కు స్టాలిన్‌ కౌంటర్‌

సీఎం విజయ్‌కు స్టాలిన్‌ కౌంటర్‌

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి, టివికె అధ్యక్షుడు విజయ్‌ చేసిన బాడీ షేమింగ్‌ వ్యాఖ్యలకు డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్‌ ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. ఎమర్జెన్సీ సమయంలో పోలీసులు తనపై జరిపిన దాడిలో దవడ ఎముకలు విరిగిపోయాయని, ఆ గాయాల మచ్చలు ఇప్పటికీ ఉన్నాయని తెలిపారు. గురువారం సోషల్‌ మీడియాలో విడుదల చేసిన వీడియోలో జైలులో తనకు ఎదురైన చేదు అనుభవాలను స్టాలిన్‌ వివరించారు.

‘‘తమ్ముడు విజయ్‌.. మీరు చేసిన సైగ వాస్తవమే. పోలీసుల దాడిలో నా దవడ ఎముకలు విరిగిపోయాయి. ఆ గాయాల మచ్చలు ఇప్పటికీ ఉన్నాయి’’ అని స్టాలిన్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం విజయ్‌ తన ఇంటికి మర్యాదపూర్వకంగా వచ్చిన సందర్భాన్ని గుర్తుచేశారు. అప్పట్లో ఎన్నికల ప్రచారంలో తనపై చేసిన కఠిన వ్యాఖ్యలకు విజయ్‌ విచారం వ్యక్తం చేశారని, తాను ఆ విషయాలను మనసులో పెట్టుకోలేదని చెప్పానన్నారు. ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు హుందాతనాన్ని పాటించాలని కూడా సూచించానని తెలిపారు. ‘‘మీరు ఆ విషయాన్ని మర్చిపోయినట్లున్నారు. ముఖ్యమంత్రికి తగిన హావభావాలు, మాటతీరు అలవర్చుకుని ఇతరులకు ఆదర్శంగా నిలవాలి. మీ స్థానం ఏమిటో గుర్తించి, అందుకు అనుగుణంగా వ్యవహరించాలి’’ అని విజయ్‌కు స్టాలిన్‌ సూచించారు. పరిపాలనను సినిమా షూటింగ్‌లా, అసెంబ్లీని ‘రీల్స్‌’ తీసే వేదికగా మార్చేశారని విమర్శించారు. డిఎంకె ప్రభుత్వం నిర్మించిన వంతెనను సైతం ఫొటో షూట్‌కు ఉపయోగించుకున్నారని ఆరోపించారు.

ఎమర్జెన్సీ కాలంలో తన అరెస్టు, జైలు అనుభవాలను కూడా స్టాలిన్‌ వివరించారు. పోలీసులు తన ఇంటికి వచ్చిన సమయంలో తాను పార్టీ పనిపై బయటకు వెళ్లినట్లు తెలిపారు. తాను తిరిగి వచ్చిన తర్వాత తన తండ్రి, అప్పటి ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తనను అరెస్టు చేశారని చెప్పారు. మరో తొమ్మిది మందితో కలిసి చిన్న గదిలో నిర్బంధించారని, అక్కడ మూత్ర విసర్జనకు ఒకే కుండ ఉండేదని, అదే దుర్వాసనతో కూడిన ప్రదేశంలో నిద్రించాల్సి వచ్చేదని తెలిపారు. రాత్రిళ్లు నిద్రపోకుండా పోలీసులు లాఠీలతో కొట్టడం, బూట్లతో తన్నడం చేసేవారని స్టాలిన్‌ చెప్పారు. ఖైదీలతోనూ తమపై దాడులు చేయించేవారని, ఆ క్రూరమైన దాడుల కారణంగానే జైలులో డిఎంకె ఎంపి చిట్టిబాబు మరణించారని పేర్కొన్నారు. ‘‘ప్రజా జీవితంలో ఉంటూ తమిళుల ప్రయోజనాల కోసం పోరాడిన వారు ఇలాంటి అమానుష దాడులను ఎదుర్కొన్నారు. మేము ఆ ఘటనలను దాటి ముందుకు సాగాం. పోరాడటం, దాని పర్యవసానాలను ఎదుర్కోవడం మాకు కొత్తేమీ కాదు. డిఎంకె చరిత్రే అలాంటిది. ఆ చరిత్రలో భాగం కావడం నాకు గర్వకారణం. నన్ను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా ఆ చరిత్రను మార్చలేరు’’ అని స్టాలిన్‌ అన్నారు.

అసెంబ్లీలో పోలీస్‌, అగ్నిమాపక, రక్షణ సేవల శాఖలకు నిధుల కేటాయింపుపై జరిగిన చర్చ సందర్భంగా సిఎం విజయ్‌, స్టాలిన్‌ విరిగిన దవడను సూచించేలా సైగలు చేసిన సంగతి తెలిసిందే. విజయ్‌ వ్యాఖ్యలపై సిపిఐ(ఎం) తీవ్రంగా ఖండించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -