అదానీ కోసం అడ్డగోలు ప్రతిపాదనలు సిద్ధం చేసిన కేంద్రం
‘సోలార్’కు బ్యాటరీ బరువు
గ్రిడ్ ఫార్మింగ్ ఇన్వర్టర్లు తప్పనిసరి
2027 జులై 1 నుంచి ప్రారంభమయ్యే విద్యుత్‌ప్లాంట్లలో అమలు
కేంద్రం సరికొత్త ప్రతిపాదనలు
అభ్యంతరాలు కోరిన సీఈఏ
భారీగా పెరగనున్న పునరుత్పాదక ఇంధన ధరలు
తెలంగాణకు కష్టకాలం
కొండనాలుకకు మందేస్తే, ఉన్న నాలుక ఊడిందట! విద్యుత్‌రంగంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనలు ఇలాగే ఉన్నాయి. యావత్‌దేశంలో పునరుత్పాదక ఇంధనానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం గతంలో ఆదేశాలు జారీ చేసింది. దానికోసం లక్ష్యాలు నిర్దేశించింది. లక్ష్యాలు చేరని రాష్ర్టాలపై జరిమానాలు విధించింది. ఈ గోలంతా ఎందుకని రాష్ర్ట ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ నిబంధనల్ని అమలు చేసేందుకు ప్రత్యేకంగా పునరుత్పాదక ఇంధన పాలసీలను తీసుకొచ్చాయి. తెలంగాణ రాష్ర్టం కూడా తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ–2025ను రూపొందించింది. దీనికి 2025 జనవరి 11న రాష్ర్ట ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పాలసీలో ప్రధానంగా సౌర, పవన, ఇతర పునరుత్పాదక విద్యుత్, ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాల్లో లక్ష్యాలు, పెట్టుబడులు, ప్రోత్సాహకాలను పేర్కొన్నారు. అక్కడి వరకు బానే ఉంది. అన్ని రాష్ర్టాలు తమ దారిలోకి వచ్చాయని నిర్థారణ జరిగాక కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కార్పొరేట్లకు అనుకూలమైన సరికొత్త షరతులతో కూడిన ప్రతిపాదనల్ని సిద్ధం చేసింది. వాటిని కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ)కు పంపి, వాటిపై అభ్యంతరాలను స్వీకరించాలని కోరింది. దానికి అనుగుణంగా సీఈఏ ఈనెల 3వ తేదీ ఈ ప్రతిపాదనలను తన వెబ్సైట్లో పెట్టింది. విద్యుత్ రంగ సంస్థలు, ఇతర స్టేక్హోల్డర్ల నుంచి ఏవైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే అక్టోబర్ 4వ తేదీలోపు తమకు పంపాలని కోరింది.
ఎస్ఎస్ఆర్ శాస్త్రీ
పునరుత్పాదక విద్యుత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త నిబంధనలు, ప్రతిపాదనలు ప్రజా ప్రయోజనాల కంటే, కేవలం కొద్దిమంది కార్పొరేట్ వ్యాపార సంస్థల కోసమే తెస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. అసలు పునరుత్పాదక ఇంధన రంగం మొత్తం ప్రయివేటు రంగంలోనే ఉండటం గమనార్హం. ప్రభుత్వరంగం లో కేవలం నామమాత్రంగా ఉత్పత్తి అవకాశాలను మోడీ సర్కార్ కల్పిస్తున్నది. ఈ పునరుత్పాదకం ద్వారానే తన అనుయాయ కార్పొరేట్లకు మరిన్ని లాభాలను దోచిపెట్టేలా విధానపరమైన నిర్ణయాల ను కేంద్రం తీసుకుంటున్నది. దానిలో భాగంగా కొత్త సోలార్, పవన విద్యుత్ ప్రాజెక్టులకు ‘బ్యాటరీ నిల్వ వ్యవస్థ’ లను తప్పనిసరి చేయాలని ప్రతిపాదిస్తూ సెంట్రల్ ఎలక్ర్టిసిటీ అథారిటీ (సీఈఏ) ద్వారా వ్యూహరచన చేస్తున్నది. ఈ విషయంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు ఎలాంటి మౌలిక ఏర్పాట్లు, సౌకర్యాలు లేకపోవడం గమనార్హం. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే కచ్చితంగా విద్యుత్ ఉత్పత్తి వ్యయం పెరిగి, వినియోగదారులపై భారం పడటం ఖాయంగా కనిపిస్తున్నదని విద్యుత్‌రంగ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో ఈ ప్రతిపాదనలు ఎవరి కోసమైతే చేస్తున్నారో ఆ కార్పొరేట్ సంస్థలు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం (బీఈఎస్ఎస్) ప్రాజెక్టుల్లో అగ్రస్థానంలో ఉన్నాయి. అదానీ గ్రూప్ గుజరాత్‌లోని ఖావ్డాలో ఇప్పటికే 3.37 గిగావాట్ల భారీ బిఈఎస్ఎస్ ఆపరేషనల్ సామర్థ్యం కలిగి ఉండటం విశేషం. దాని తర్వాత టాటా పవర్, గ్రీన్కో పంప్డ్ స్టోరేజీ, ఎన్టీపీసీ వంటి సంస్థలు ఉన్నాయి. అయితే బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టుల్లో మెజారిటీ భాగం అదానీ, ఇతర కొర్పొరేట్ సంస్థలదే కావడం గమనార్హం.
ఎన్టీపీసీ వాటా కేవలం నామమాత్రమే. పునురుత్పాదక ఇంధనంపై కేంద్రం చేస్తున్న ప్రతిపాదనలు అమల్లోకి వస్తే చిన్న, మధ్య తరహా విద్యుత్ ఉత్పత్తిదారులకు అదనపు పెట్టుబడి భారం తప్పదు.అదే సమయంలో తప్పనిసరిగా అదానీ వంటి కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోక తప్పదు. విద్యుత్ నిల్వ అవసరాన్ని ప్రాజెక్టు స్వభావం, ప్రాంతీయ గ్రిడ్ అవసరాల ఆధారంగా నిర్ణయించాలి. కానీ అందరికీ ఒకే రకమైన తప్పనిసరి నిబంధనలు విధించడం ఎంతవరకు సమంజసమన్నది మరో ప్రశ్న. తెలంగాణ వంటి రాష్ట్రాలు భారీ పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాలు పెట్టుకున్న సమయంలో ఈ ప్రతిపాదనలు వేల కోట్ల రూపాయల అదనపు పెట్టుబడిని సృష్టించాల్సి వస్తుంది. బ్యాటరీ నిల్వ ఖర్చును ఎవరు భరిస్తారు, దాని ప్రయోజనం ఎవరికి దక్కుతుంది అన్న అంశాలపై స్పష్టత లేకుండానే నిబంధనలు తీసుకురావడం విధానప రమైన లోపంగా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఈఏ ప్రతిపాదనలు నిజంగా గ్రిడ్ స్థిరత్వం కోసమేనా, లేక ఇప్పటికే ఈ రంగంలో ఆధిపత్యం సాధిస్తున్న కార్పొరేట్ సంస్థలకు అనుకూ ల వాతావరణం కల్పించడానికా అనే సందేహాలకు మోడీ సర్కారే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
అదానీకి ఆర్థిక ప్రయోజనాలు
సెంట్రల్ ఎలక్ర్టిసిటీ అథారిటీ (సీఈఏ) ప్రతిపాదనలైన ఎనర్జీ స్టోరేజీ సిస్టం (ఈఎస్ఎస్), బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం (బీఈఎస్ఎస్)ల ద్వారా అదానీ వ్యాపార సామ్రాజ్యం మరింత విస్తరిస్తుందని విద్యుత్‌రంగ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే దేశంలో బ్యాటరీ నిల్వకు భారీ డిమాండ్ ఏర్పడుతుంది. అదానీ గ్రూప్ ఈఎస్ఎస్, బీఈఎస్ఎస్ మార్కెట్లో ఇప్పటికే భారీ పెట్టుబడులు పెట్టింది. అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ గుజరాత్‌లోని ఖావ్డాలో 3.37 గిగావాట్స్ పర్ అవర్ (జీడబ్లూహెచ్) బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం (బీఈఎస్ఎస్)ను 2026 మే నెలలో కమిషన్ చేసింది. అలాగే అదానీ ప్రకటించిన దీర్ఘకాల ప్రణాళిక ప్రకారం 2027 ఆర్థిక సంవత్సరంలో 10 గిగావాట్లకు పైగా, వచ్చే ఐదేండ్లలో 50 గిగావాట్ల స్టోరేజ్ సామర్ద్యాన్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదానీకి చెందిన ఖావ్డా ప్రాజెక్టులో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం 1,126 మెగావాట్ల విద్యుత్ ఇవ్వగలిగే నిల్వ సామర్థ్యం ఉంది. దీనిలో 700కు పైగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం (బీఈఎస్ఎస్) కంటైనర్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో ఒకేసారి సోలార్ + విండ్ + హైబ్రిడ్ + బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం (బీఈఎస్ఎస్) + విద్యుత్ తరలింపు మౌలిక సదుపాయాలు ఉన్నాయి. సెంట్రల్ ఎలక్ర్టిసిటీ అథారిటీ (సీఈఏ) ప్రతిపాదనల వల్ల బీఈఎస్ఎస్, ఈఎస్ఎస్ నిబంధనలు తప్పనిసరి అవుతాయి.
అప్పుడు అనివార్యంగా అదానీ బ్యాటరీ స్టోరేజీలను దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిదారులు వినియోగించక తప్పదు. దీనివల్ల అదానీ కంపెనీకి మరో అప్షన్ కూడా లభిస్తుంది. ఇప్పటి వరకు సోలార్ విద్యుత్ పగలు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. బీఈఎస్ఎస్ ద్వారా చౌకైన అదే సోలార్ విద్యుత్‌ను రాత్రిపూట పీక్ అవర్స్‌లోనూ విక్రయించుకునే వెసులుబాటు లభిస్తుంది. అదానీ వద్ద ఇప్పటికే సోలార్, విండ్, హైబ్రిడ్ ప్రాజెక్టులు, బీఈఎస్ఎస్, పంప్డ్ స్టోరేజ్, ట్రాన్స్‌మిషన్‌తో పాటు గ్రిడ్ మౌలిక సదుపాయాల అవకాశాలు కూడా ఉన్నాయి. ఫలితంగా పునరుత్పాదక ఇంధనంలో అదానీ గ్రూప్ గుత్తాధిపత్యం ఏర్పడే ప్రమాదం ఉన్నదని విద్యుత్‌రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అసలు పునురుత్పాదక ఇంధన ఉత్పత్తి మొత్తం ప్రయివేటురంగంలోనే ఉండటం గమనార్హం. అంటే విద్యుత్‌రంగాన్ని దశలవారీగా పూర్తిగా ప్రయివేటు, కార్పొరేట్ సంస్థలకు అప్పగించడంమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది.
రాష్ర్టంపై ప్రభావం
రాష్ర్టంలో పునరుత్పాదక ఇంధన బాద్యతలను తెలంగాణ పునరుద్ధణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీరెడ్కో) నిర్వహిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ –2025 ప్రకారం ప్రస్తుతం 7,889 మెగావాట్ల సోలార్ విద్యుత్ సామర్థ్యం ఉంది. దాన్ని 2030 నాటికి 19,874 మెగావాట్లు, 2035 నాటికి 26,374 మెగావాట్లకు పెంచాలని లక్ష్యంగా ప్రకటించారు. అలాగే పవన విద్యుత్ (విండ్) ప్రస్తుత సామర్థ్యం 128 మెగావాట్లు ఉంది. దాన్ని 2030 నాటికి 2,528 మెగావాట్లు, 2035 నాటికి 4,528 మెగావాట్లకు పెంచాలని నిర్ణయించారు. ఎనర్జీ స్టోరేజ్ విషయంలో 2035 నాటికి 7,917 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం (బీఈఎస్ఎస్) + పంప్డ్ స్టోరేజ్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అంటే తెలంగాణలో పునరుత్పాదక ఇంధనం రోడ్‌మ్యాప్‌లో సోలార్, విండ్ మాత్రమే కాకుండా స్టోరేజ్‌ను కూడా ప్రధాన భాగంగా ఎంచుకున్నారు. ఇంత గొప్ప లక్ష్యాలను నిర్థారించుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తెచ్చిన కొత్త ప్రతిపాదనలతో ఉత్పత్తి వ్యయం భారీగా పెరగడం ఖాయం. తద్వారా పునరుత్పాదక ఇంధనం ధర కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ భారాలు అంతిమంగా విద్యుత్ వినియోగదారులపైనే పడతాయనడంలో సందేహం లేదు. అలాగే ఇక్కడి స్టోరేజ్ లక్ష్యాల్లో అదానీ కంపెనీ భాగస్వామ్యం ఎంతనేది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం యూనిట్ ధర
సోలార్, విండ్ విద్యుత్‌కు దేశవ్యాప్తంగా ఒకే మార్కెట్ ధర ఉండదు. అయితే ఇటీవలి పోటీ బిడ్డింగ్ ధరలు చూస్తే సోలార్ విద్యుత్ యూనిట్ ధర రూ. 2.50 పైసలు నుంచి రూ.3.50 పైసలు మధ్య ఉంది. తెలంగాణలో విద్యుత్ నియంత్రణ మండలి ప్రకటించిన సోలార్ టారిఫ్‌లో ధర యూనిట్‌కు సగటున రూ.3.13 పైసలుగా ఉంది.
పెరిగేది ఇలా…
సెంట్రల్ ఎలక్ల్ర్టిసిటీ అథారిటీ (సీఈఏ) నూతన ప్రతిపాదనల ప్రకారం ఎనర్జీ స్టోరేజ్ సిస్టం (ఈఎస్ఎస్) అమల్లోకి వస్తే పునరుత్పాదక ఇంధనం యూనిట్ ధర గరిష్టంగా రూ.4 నుంచి రూ.6 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని విద్యుత్‌రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదానీ వంటి సంస్థల గుత్తాధిపత్యం పెరిగితే అదే యూనిట్ ధరను మరింత హెచ్చుగా కూడా నిర్ణయించే ప్రమాదం లేకపోలేదు. ఈ పునరుత్పాదక ఇంధన ధరల పెరుగుదలకు మళ్లీ బ్యాటరీ ధరలు, వడ్డీ రేట్లు, మాడ్యుల్స్ ధరలు, ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్, ట్రాన్స్మిషన్ చార్జీలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వ్యవధి వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోకతప్పదు. ఫలితంగా ధరలు నిర్ణయించే విద్యుత్ నియంత్రణ మండళ్లు (ఈఆర్సీ) ఆ పరిమితులకు లోబడే పనిచేయాల్సి ఉంటుంది.
ఇవీ ఆ ప్రతిపాదనలు
కొత్త సోలార్, ఆన్‌షోర్ విండ్ ప్లాంట్లకు ఎనర్జీ స్టోరేజీ సిస్టం (ఈఎస్ఎస్) తప్పనిసరిగా ఉండాలి.
2027 జూలై 1 తర్వాత ప్రారంభమయ్యే కొత్త పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్లలో కనీసం 15 శాతం ఇన్వర్టర్లకు గ్రిడ్-ఫార్మింగ్ కంట్రోల్ సామర్థ్యం ఉండాలి. దానికి అనుగుణంగా ఇన్వర్టర్ల ఏర్పాటు ఉండాలి.
గ్రౌండ్ మౌంటెడ్ సోలార్, ఆన్‌షోర్ విండ్ ప్రాజెక్టులకు వాటి స్థాపిత సామర్థ్యంలో కనీసం 10 శాతం, లేదా రెండు గంటల నిల్వ సామర్థ్యం కలిగిన ఈఎస్ఎస్ ఉండాలి.
ఉదాహరణకు 100 MW సోలార్ ప్లాంట్ అయితే కనీసం 10 మెగావాట్ల బ్యాటరీ సామర్థ్యం, 2 గంటల నిల్వ అంటే 20 మెగావాట్ పర్ అవర్ (ఎమ్డబ్య్లూహెచ్) బ్యాటరీ నిల్వ అవసరం.
2029 జూలై 1 నుంచి
2031 జూన్ 30 వరకు ప్రారంభమయ్యే ప్రాజెక్టులకు ఈ నిబంధనలు మరింత కఠినంగా ఉంటాయి. కనీసం 10 శాతం ఈఎస్ఎస్ సామర్థ్యం తోపాటు 4 గంటల నిల్వ సామర్థ్యం తప్పనిసరి.
అంటే 100 మెగావాట్ల ప్లాంట్‌కు 2029 తర్వాత 10 మెగావాట్ల ఈఎస్ఎస్, 4 గంటల నిల్వ మొత్తం 40 మెగావాట్ పర్ అవర్ (ఎమ్డబ్ల్యూహెచ్) నిల్వ సామర్థ్యం ఉండాలి.
బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం (బీఈఎస్ఎస్) లోని అన్ని పవర్ కన్వర్షన్ సిస్టం (పీసీఎస్) లకు గ్రిడ్ ఫార్మింగ్ కంట్రోల్ తప్పనిసరిగా ఉండాలి.
అవసరాన్ని బట్టి భవిష్యత్తులో ప్రస్తుత 10 శాతం సామర్థ్యాన్ని లేదా ఈఎస్ఎస్ అవసరాలకు అనుగుణంగా మార్చుకునే అవకాశాన్ని కూడా సీఈఏ ప్రతిపాదించింది.
ఈఎస్ఎస్ అంటే పగటిపూట సోలార్ ద్వారా వచ్చిన అదనపు విద్యుత్‌ను బ్యాటరీలో నిల్వ చేసి, అవసరమైన సమయంలో ముఖ్యంగా సాయంత్రం లేదా పీక్ సమయంలో గ్రిడ్‌కు అందించడం.


