నవతెలంగాణ-హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పారని ఆరోపించారు. దళిత సమాజం ఆయన్ను ఎప్పటికీ క్షమించదన్నారు. ఓట్ల కోసమే కేసీఆర్ దళిత కార్డును ఉపయోగించారని విమర్శించారు.
తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్.. దళితుల కోసం బీఆర్ఎస్ 2003లో రూపొందించిన డాక్యుమెంట్‌ను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు పథకాలను ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా ఆయన సూచనలను పాటించాలని హితవు పలికారు. దళితుల గురించి మాట్లాడే హక్కు కేసీఆర్‌కు లేదన్నారు.
దళితులు నడిచిన నేలను శుద్ధి చేసిన బీఆర్ఎస్ నేతలపై మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ‘‘నేలను కాదు.. మీ బుర్రను శుద్ధి చేయాలి’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మాక్ అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు బీసీ నేతకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని మహేశ్ కుమార్ గౌడ్ గుర్తుచేశారు. కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ప్రతిపక్ష నేతగా చేయాలని సవాల్ విసిరారు. కేసీఆర్ ఎలాగూ అసెంబ్లీకి రావడం లేదని, తలసానికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ నేతకు ఆ హోదా ఇస్తే సస్పెన్షన్ ఎత్తివేసే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.
ఇదిలా ఉండగా మంత్రి కొండా సురేఖను కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీకి పిలిచిందన్న వార్తలపై తమకు ఎలాంటి సమాచారం లేదని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను ఎవరైనా కబ్జా చేసి ఉంటే.. ఆ వ్యవహారాలు బయటకు రావాల్సిందేనని అన్నారు.


