నవతెలంగాణ-హైదరాబాద్: పవిత్ర మక్కా నగరంపై డ్రోన్ తో దాడి చేయలేదని యెమెన్ హౌతీ ప్రకటించింది. ఈ ఆరోపణలు “కల్పనలు, అబద్ధాలు” అని పేర్కొంటూ, తమ కార్యకలాపాలు ఇస్లామిక్ పవిత్ర స్థలాలకు దూరంగా ఉన్న సౌదీ సైనిక, చమురు సౌకర్యాలను లక్ష్యంగా చేసుకున్నాయని స్పష్టం చేసింది. టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో.. హౌతీ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యహ్యా సరీ, సౌదీ అరేబియాలోని అల్ సౌద్ పాలనను విమర్శిస్తూ, ఈ ప్రయత్నాన్ని ఒక మోసంగా అభివర్ణించారు.
అదే సమయంలో, తమ తిరుగుబాటు బృందం పవిత్ర స్థలాలకు ఎలాంటి ముప్పు కలిగించదని ఆయన స్పష్టం చేశారు. “పవిత్రమైన మక్కాను లక్ష్యంగా చేసుకున్నామన్న నేరపూరిత అల్ సౌద్ పాలన ప్రచారం చేస్తున్న కల్పనలు, అబద్ధాలు ఎవరినీ మోసగించలేవు. ఎందుకంటే, దురాచారాలతో వారే మక్కాను అపవిత్రం చేస్తున్నారు. ఆ పవిత్ర స్థలాలకు యెమెన్ నుండి ఎలాంటి ముప్పు లేదు,” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.



